- కాంగ్రెస్ పలువురు ఉద్యమకారులను పొట్టనపెట్టుకుంది
- ఇందిరమ్మ రాజ్యంలో కాల్చివేతలు, కూల్చివేతలు, ఎన్‌కౌంటర్లు తప్ప జరిగిందేం లేదు
- హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి
- 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తూర్పు తెలంగాణకే తలమానికం
- వరంగల్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్
వరంగల్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, నవంబర్ 28 : వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన బిఆర్‌ఎస్ అభ్యర్ధులిద్దరూ బిసి బిడ్డలు, వారిని ఆశీర్వదించి గెలిపించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా బిసి మేధావి వర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్ ఇద్దరూ వెనుకబడిన తరగతులకు చెందినవారే కాకుండా, చాలా కష్టపడి ఎదిగి వొచ్చివారని, వారిద్దరు మీ బిడ్డలు, మీ ముందు పెరిగినవారు, మీరు పెంచినవాళ్ళు, సదా మీ సేవలో ఉంటున్నవారని కెసిఆర్ అన్నారు. ఇద్దరు కూడా పులిబిడ్డలు. అందుకే వారిద్దరిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ఇక్కడి బిసి మేధావి వర్గానికి, బిసి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కెసిఆర్. రేపు జరుగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో గత నెలరోజులుగా వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద ప్రచార సభల్లో భాగంగా చివరి రోజున వరంగల్ జంట నియోజకవర్గాల మధ్య మంగళవారం ఏర్పాటు చేసిన 95వ సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరంగల్ చారిత్రాత్మక నగరం. వెయ్యేండ్ల చరిత్రకు సాక్షిభూతమైన ఈ నగరానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.
అంతేకాదు తెలంగాణ ఉద్యమకాలంలో అనేక ప్రధాన ఘట్టాలు ఇక్కడే ఆవిష్కృతమైనాయి. భద్రకాళి అమ్మవారి దయవల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాకారమైంది. అందుకు సహకరించిన కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్లను మనస్సుపూర్తిగా స్మరించుకుంటున్నానన్నారు. వరంగల్ పశ్చిమ అభ్యర్ధి వినయ్‌భాస్కర్ చెప్పినట్లు హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలన్నది తన అభిమతమని, అందుకు తగిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం జరుగుతున్నదన్నారు. ఈ మహానగర అభివృద్ధి కాంగ్రెస్ కాలంలో కుంటుపడిరదని, కాని ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిననంతరం అభివృద్దిలో ముందుకు దూసుకు పోతున్నదన్నారు. కాంగ్రెస్ కాలంలో పలువురికి ఉపాధి కల్పించిన ఆజంజాహిని మూసివేస్తే, దాని స్థానంలో వేలాది మందికి ఉపాధిని కల్పించే టెక్స్‌టైల్ పార్క్ తీసుకు వొచ్చామని, ఇవ్వాళ తూర్పు తెలంగాణకే తలమానికగా 24 అంతస్థులతో కాళోజీ పేరున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ని తీసుకువచ్చామన్నారు.
ఇప్పటికి వొచ్చిన ఐటి కంపెనీలకు తోడు మరికొన్ని త్వరలో వొచ్చే అవకాశాలున్నాయని, మరికొన్ని పరిశ్రమలు, ఇతర సంస్థలు ఇక్కడి రాబోతున్నాయన్నారు. రైల్వే ట్రాక్ మీద ఆరు బ్రిడ్జిల నిర్మాణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానితో నగరం మరింత త్వరగా విస్తరించే అవకాశముందన్నారు. వరంగల్‌లో గతంలో నాలుగైదు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వొచ్చేవి, ఇవ్వాళ రోజూ నీళ్ళు తాగుతున్నారు. కరెంటు 24 గంటలు వొస్తున్నది. గతంలో రోడ్లు నేటి రోడ్లు బేరీజు వేసుకోండి. పల్లె, పట్టణ దావఖానాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మార్పులు చేశాం. అందుకు శ్రమించి పనిచేసే అభ్యర్ధులను గెలిపించాలని కెసిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ సభలో చెబుతున్న అంశాన్నే మరోసారి గుర్తుచేస్తున్నానంటూ ప్రజాస్వామ్య ప్రక్రియలో రావల్సినంత పరిణతి ఇంకా రాలేదన్నారు. ప్రజల తలరాతలను మార్చే వోటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడమే పరణతికి నిర్వచనంగా ఆయన చెప్పారు. అభ్యర్థులతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ చరిత్రను పరిశీలించాల్సిన అవసరముందన్నారు. బిఆర్‌ఎస్ మీ కండ్ల ముందు పుట్టింది. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనకు 50 ఏండ్లపాటు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ పాలనను బేరీజు వేసుకోవాలన్నారు.
నిజంగానే కాంగ్రెస్ పాలన సరిగా ఉంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వొచ్చేదా, రెండు రూపాయల బియ్యం ఇచ్చేవాడా ఆలోచించండి. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో జరిగిందేమిటీ.. ఎమర్జన్సీ, కాల్చివేతలు, కూల్చివేతలు, ఎన్‌కౌంటర్‌లు, మొదటి తెలంగాణ ఉద్యమం, మలితెలంగాణ ఉద్యమంలో అనేక మరణాలకు కారణం కాంగ్రేసేనన్నారు. అసలు 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడల్లా ప్రజలను ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ అన్నారు కెసిఆర్. తమతో పొత్తుపెట్టుకుంటే తెలంగాణ ఇస్తామన్నది కాంగ్రెస్. కాని, అధికారంలోకి వొచ్చినా తెలంగాణ ఇవ్వకుండా ధోకా చేసింది. అప్పుడు ఇదే వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ నుండే మళ్ళీ ఉద్యమం మొదలైంది. కెసిఆర్ చచ్చుడో..తెలంగాణ వొచ్చుడో అని ఆమరణ దీక్షకు పోతే ఉద్యోగాలు, విద్యార్థులు, సబండ వర్గాలు ఉద్యమంలో కలిసి వచ్చేవి. 33 రాష్ట్రాలు మద్దతిచ్చాయి. అందుకే పార్టీ నడవడికను చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తే, ఇప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు వేలిస్తున్నది. మళ్ళీ అధికారం చేపట్టగానే దాన్ని అయిదువేలకు పెంచుతున్నా. సౌభాగ్య పథకం కింద ప్రతీ మహిళకు మూడువేలు అందజేయబోతున్నాం. దేశంలో మరే రాష్ట్రానికి కనీసం ఆలోచనలేని విధంగా మూడు లక్షల మందికి కంటి వెలుగు కింద పరీక్షలు చేయించి, 80 లక్షల మందికి కంటి అద్దాలిచ్చాం. పేదింటి ఆడపిల్లలకోసం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ, ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నవారికి పట్టాలు ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా చాలాచేయాలనుకుంటున్నది. అందుకు మరోసారి తమకు బలాన్నిచ్చి ఆశీర్వదించాల్సిందిగా కెసిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




