సిబిఐ,ఇడి దర్యాప్తులపై బిజెపి నేతలు ముందే చెప్పేస్తున్నారు
మేము నీళ్లు పారిస్తుంటే..వారు రక్తం పారిస్తున్నారు
8 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల కూల్చివేత
ఎంఎన్‌జె హాస్పిటల్‌లో రోబో థియేటర్ రాబోతుందన్న మంత్రి హరీష్ రావు
సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం…
శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’లో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 26 : బీజేపీ పార్టీనా..దర్యాప్తు ఏజెన్సీనా..అని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ప్రశ్నించారు. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీ ఎలా చెప్తారన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో సీబీఐ పనిచేస్తుందన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవని మంత్రి ప్రశ్నించారు. నిఘా సంస్థలు బీజేపీకి జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. బీజేపీ, సీబీఐ కలిసి కావాలనే ప్రతిపక్షాలను వేధిస్తున్నాయని..8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టి..దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. సీబీఐకి వారు డైరెక్షన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారన్న హరీష్..హైదరాబాద్‌లో ఏం జరుగుతుంది. రాష్ట్రంలో మత కలహాలు మంచివా..అని సీరియస్ అయ్యారు. బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తుంటే..బీజేపీ మాత్రం బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుందన్నారు. మరోవైపు కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి ఎందుకు చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
మరో నెల రోజుల్లో 30 కోట్లతో రోబో థియేటర్ రాబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ ఎంఎన్‌జే హాస్పిటల్‌లోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్ నాలుగో ప్లోర్‌లో ఉన్న మాడ్యులర్ థియేటర్లు, దోబీ ఘాట్, కిచెన్‌ను ప్రారంభించిన హరీష్ రావు…దేశంలో తొలిసారిగా ఆంకాంలజీ స్పెషల్ నర్సింగ్ కోర్స్ రాబోతుందని ప్రకటించారు. ఎంఎన్ జే ప్రభుత్వ హాస్పిటల్‌లో 30 కోట్లతో..7 మాడ్యులర్ థియేటర్స్ ప్రారంభం అయ్యాయన్నారు. ఇక్కడ క్యాన్సర్ రోగులకు చాలా బాగా అందిస్తున్నారని…మరో నెల రోజుల్లో 350 పడకల కొత్త బిల్డింగ్ రాబోతుందని చెప్పుకొచ్చారు. రోజురోజుకూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి హరీష్ రావు… ప్రస్తుతం వారి కోసం 450 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం రూ.5 కోట్లతో మోడ్రన్ దోబి ఘాట్, కిచెన్ కూడా శుక్రవారం రోజు నుంచి అందుబాటులోకి వొచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ వొచ్చిన తరువాత రూ. 750 కోట్లు క్యాన్సర్ రోగులకు ఖర్చు చేశామని..గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు.
నిమ్స్‌లో నెలకు 8 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేస్తుండగా..ఎంఎన్ జేలో రెండు చేస్తున్నారన్నారు. ఈ థియేటర్స్ కారణంగా మరిన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్‌లకు ఆస్కారముంటుందని చెప్పారు. 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్‌ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ వంటి కారణాలతో…క్యాన్సర్ పెరుగుతుందని చెప్పారు. కోటి రూపాయిలతో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ వెహికల్ జిల్లాలలో తిరుగుతుందని, దీని కోసం 22 క్యాంపులు పెట్టి…స్క్రీనింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలకు ఎంఎన్‌సీ నుంచి పర్మిషన్ వొచ్చిందన్న మంత్రి…33 జిల్లాల్లో నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో దేశంలోనే తొలిసారి…రోబోటిక్ థియేటర్‌ను మన రాష్ట్రంలో తీసుకొచ్చామని హరీష్ రావు తెలిపారు. డైట్ మెనూను రూ.56 నుంచి రూ.112 లకు పెంచామని చెప్పారు.
సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం…శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ పూర్వ వైభవానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శత వసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక విద్యా సంస్థ వొస్తే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. విద్య గొప్ప మార్పులకు, వెలుగులకు కారణం అవుతుంది. ఇందుకు సిటీ కాలేజీ ఒక నిదర్శనం అన్నారు. వందేళ్ల కింద నిజాం స్థాపించిన ఈ కాలేజీ నుంచి ఎంతోమంది మేధావులు, విద్యావంతులు వచ్చారు. వారు విద్య, రాజకీయ, పరిశోధన వంటి అనేక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరారు. సిటీ కాలేజీ చదువుకు మాత్రమే కాదు.. సామాజిక ఉద్యమాలకు వేదిక అని పేర్కొన్నారు. జయశంకర్ సార్ తరచూ సిటీ కాలేజీ గురించి చెప్పేవారు. కాలేజీలో రూ.8కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణం ప్రభుత్వం చేస్తున్నది. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవన పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


