బిజెపి ఊసే లేదు.. పవర్‌ .. ‌పథకాలే ప్రథాన ఎజండాగా..

‌కాంగ్రెస్‌ ‌టార్గెట్‌గా ముగిసిన మూడు సభలు

ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు శాసనసభ నియోజకవర్గాల్లో  బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుడిగాలి పర్యటన చేశారు. ఈ మూడు సభల్లో కూడా అసంఖ్యాక జనం హాజరవడాన్ని చూసి, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్ధులు గెలిచినట్లేనని హర్షద్వనాల మధ్య ప్రకటించారు. ఈ మూడు సభల్లో ఆయన ఎక్కడకూడా బిజెపి ఊసెత్తలేదు. కాని, కాంగ్రెస్‌ను మాత్రం తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా పవర్‌.. ‌పథకాలపైన కాంగ్రెస్‌ ‌నాయకులు చేసిన కామెంట్లనే ఆయన తన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ ‌సరఫరా విషయంలో గత కొంతకాలంగా అధికారపార్టీకి, విపక్షాలమద్య పంచాయితీ కొనసాగుతున్న విషయం తెలియందికాదు. దీనిపైన సవాళ్ళు ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. 24 గంటలపాటు నిర్విరామంగా విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలన్నీ అబద్దాలేనని, తమ వెంట వస్తే విద్యుత్‌ ‌సరఫరా లేక అవస్థలు పడుతున్న గ్రామాలను చూపిస్తామని విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌చాలెంజీ చేస్తున్నది.

దీనికంతకూ కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విదేశంలో ఉండి చేసిన ప్రకటన కారణంగా మారింది. పొలం తడవడానికి మూడు గంటల విద్యుత్‌ ‌చాలనడాన్ని బిఆర్‌ఎస్‌ ‌తన ప్రచారాస్త్రంగా తీసుకుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో బిఆర్‌ఎస్‌ ‌నాయకులు దాన్నే ప్రధానాంశంగా ఎత్తి చూపుతున్నారు. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌మూడు రోజుల వ్యవధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలన్నిటిలోనూ ఈ విషయంపైనే ప్రజాభిప్రాయాన్ని అడగడంద్వారా కాంగ్రెస్‌ను కార్నర్‌ ‌చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు చాలంటున్నాడు. మీకు 24 గంటల కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్‌ ‌కావాలా, మూడు గంటలే ఇచ్చే కాంగ్రెస్‌ ‌కావా)న్న దానిపైన ప్రజల అభిప్రాయాన్ని అడుగుతూ కావాలన్నవారంతా చేతులెత్తాల్సిందిగా కోరడమేకాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత దీనిపైన తీవ్రంగా ఆలోచించి ఓటు వెయ్యాలన్న విషయాన్ని కూడా ఆయన ప్రతీసభలో ప్రత్యేకంగా చెప్పడంద్వారా ఓటర్ల మెదడుకు పదును పెడుతున్నారు. తన మాటలను బిఆర్‌ఎస్‌ ‌వక్రీకరించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నాయకులు ఎంత మొత్తుకున్నా, బిఆర్‌ఎస్‌ ఆరోపణే ప్రజల్లోకి దూసుకుపోయినట్లు కనిపిస్తున్నది. దీనికి తోడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ ‌చేసిన ప్రసంగంకూడా కాంగ్రెస్‌ను మరింత ఇరుకున పెట్టినట్లైంది. కెసిఆర్‌తో పాటు కెటిఆర్‌, ‌హరీష్‌రావు తదితర నేతలందరికీ డికె మాటలు మరో ఆయుధాన్ని అందించినట్లైంది. ఆదివారం జరిగిన మూడు సభల్లో కూడా కెసిఆర్‌ ‌శివకుమార్‌ ‌మాటలనే ఎత్తిచూపారు.

గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు  24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, అయిదు గంటల కరెంటు ఇవ్వటం గొప్పగా చెప్పుకోవడాన్ని తెలివితక్కువ తనంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముందు రాష్ట్రంలో కరెంటు దుస్థితికి నేటి స్థితిని బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు నిర్ధిష్టమైన సమయాన్ని పెడితే రైతులంతా ఒకేసారి మోటర్లు ఆన్‌చేస్తే ట్రాన్స్‌ఫార్మర్‌లపైన భారంపడి అవి కాలిపోవడం, వాటి మరమ్మతు అయ్యేలోగా పంట ఎండిపోవడాన్ని చూసే, రైతులకు నష్టంకావద్దనే 24 గంటల కరెంట్‌ అం‌దుబాటులో ఉంచు తున్నామని, దీన్ని కాంగ్రెస్‌ ‌కాదంటోందని, కావాలా, వద్దా అని ఒకటికి పదిసార్లు అడిగి, కావాలనేవారు చేతులెత్తాలనడంద్వారా కాంగ్రెస్‌ ‌రైతు వ్యతిరేకి అన్న ముద్ర వేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే రైతులకు సంబంధించిన మరో పథకం రైతు బంధును ఎన్నికలవేళ నిలిపి వేయాలంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల అధికారికి వ్రాసిన లేఖను కూడా తమ ప్రచారానికి బిఆర్‌ఎస్‌ ఆయుధంగా చేసుకుంది. వ్యవసాయ పెట్టుబడి పెట్టలేని బక్క రైతులను ఆదుకునేందుకు దేశంలో మరెక్కడ లేని విధంగా, ఎవరికీ ఇంతవరకు కనీస ఆలోచనకూడా రాని ఈ పథకాలన్ని అమలుపరిచి గత మూడునాలుగు ఏళ్ళుగా సరాసరి  రైతుల ఖాతాలోకి ఈ అర్థిక సహాయాన్ని అందిస్తుండగా ఇప్పుడు నిలిపివేయాని సిఫారసు చేయడంపైన కూడా బిఆర్‌ఎస్‌ ‌తీవ్రంగా విమర్శించడంద్వారా రైతాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామన్న రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలను ఆయన తీవ్రంగా విమర్శించారు. వారికి వ్యవసాయంగురించి ఏమీ తెలియదని, సెంటు భూమిని పట్టాదారు అనుమతిలేకుండా ఎవరూ తీసుకునే వీలులేని విధంగా ధరణిని రూపొందించామని,  రైతులు గుండెమీద చెయ్యిపెట్టుకుని హాయిగా నిద్రించే విధంగా ధరణి రూపొందింస్తే దాన్ని బంగాళఖాతంలో వేయాన్నవారిని బంగాళాఖాతంలో వేయాలా వద్దా అంటూ హర్షధ్వనాలమధ్య ధరణి ఉండాలనిపించారు. ఆదివారంనాటి మూడు సభల్లో కూడా  విద్యుత్‌, ‌రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాలకు అడ్డుతగులుతున్న కాంగ్రెస్‌ ‌కావాలా, బిఆర్‌ఎస్‌కు ఓటేసి వాటిని అలా కొనసాగించుకుంటారో మీరే తేల్చుకోవాలంటూ  సభికులను ఆలోచనలో పడేశారు కెసిఆర్‌. ‌చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతు, వివిధ ప్రాజెక్టుల ద్వారా వివిధ జిల్లాలకు తరలివస్తున్న గోదావరి జలాలు, పెరుగిన భూగర్భజలాలు, పెరిగిన పంటలు, వివిధ వృత్తులవారికి వస్తు, ధన రూపంలో అందుతున్న ఆర్థిక సహాయం, నిరుపేద వర్గాలను ఆదుకుంటున్న పెన్షన్లు బిఆర్‌ఎస్‌ను కాదన్న మరుక్షణంనుండి నిలిచిపోతాయంటూ లబ్దిదారులను కెసిఆర్‌ ‌ప్రతీ సభలో హెచ్చరిస్తున్నారు.
image.png
 మండువ రవీందర్‌రావు,
సీనియర్‌ ‌జర్నలిస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *