సిద్ధిపేట సర్కార్ దవాఖానలో ఆలన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 5: ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం ఎవరికీ లేకుండా పోయిందనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సర్కార్ వైద్య కళాశాల దవాఖానలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టర్ విమలా డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ కాశీనాథ్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు ఆలన కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. 33వ పాలేటికేర్ సెంటర్ సిద్ధిపేటలో ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ పేషంట్స్‌కు ఒక వరం లాంటిదన్నారు.
వృద్ధులకు ఫిజియోథెరపీ కోసం ముగ్గురు డాక్టర్లను అందుబాటులో ఉంచామనీ, ఆలన వాహనం ద్వారా ఇంట్లో ఉన్న పేషంట్స్‌కు ఇంటికి వెళ్లి వైద్యం అందిస్తారన్నారు. 57 పిజి మెడికల్ సీట్లు సిద్ధిపేటకు రావడం 9గైనిక్ డిపార్ట్‌మెంటులో రావడం సంతోషంగా ఉందన్నారు. సిఎం కేసీఆర్ సిద్ధిపేటకు ఎన్ని నిధులు కావాలంటే అన్ని ఇవ్వడం, సిబ్బంది పనితీరు కలిసి సిద్దిపేట మెడికల్ కళాశాల ఒక చరిత్ర ఉందన్నారు. కీమో, రేడియో తెరపిలు త్వరలో అందిస్తామనీ, 13కోట్ల రూపాయలతో క్యాత్ లాబ్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా పెంచాలనీ, సిద్ధిపేట ప్రభుత్వ ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంటు సేవలు అద్భుతంగా ఉన్నాయనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రంలో స్థానిక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్, వైద్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



