- కాంగ్రెస్ రన్ అవుట్…బిజెపి డకవుట్
- దుబ్యాకలో గులాబీ జెండా ఎగురడం…రాష్ట్రంలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
- ప్రభాకర్ రెడ్డిపై దాడి దురదృష్టకరం…కొందరు రెచ్చగొట్టడమే కారణం
- కాళేశ్వరం మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరు
- దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఒకటో, రెండో సీట్లు వొచ్చే బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రన్ అవుట్ అవుతుందని, శివకుమార్ వొచ్చి 5 గంటల కరెంట్ అని హిట్ వికెట్ అయ్యాడని, బిజెపి డక్ అవుట్ అవుతుందని, బిఆర్‌ఎస్ సెంచరీ కొడుతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో గులాబీ జెండా ఎగరటం ఖాయమని, బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు. అయితే ఎన్నో ఏళ్ల నుండి ఎన్నికలు జరిగినా ఎప్పుడూ జరుగనిది తొలిసారిగా మొన్నటి ఉప ఎన్నికలో, మళ్లీ మొన్న ఎంపీ, దుబ్బాక అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. కొందరు కావాలని రెచ్చగొట్టడమే ఈ దాడులకు కారణమని ఆయన ఆరోపించారు. నాడు రామలింగ రెడ్డి, నేడు ప్రభాకర్ అన్న లేకుండా మీటింగ్ ఉంటుందని తాను అనుకోలేదని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ప్రభాకరన్నను మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…దుబ్బాకకు గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని పక్కకి పెట్టారని విమర్శించారు. ఉప ఎన్నికలో చారిత్రాత్మక తప్పిదం చేశామని ఎంతో మంది అంటున్నారని, ఈ సారి ఆలాంటి తప్పు జరగానివ్వమని, గులాబి జెండా ఎగరేసి తీరుతామంటున్నారన్నారు.
అన్ని సర్వేలు బిఆర్‌ఎస్ గెలుపు పక్కా అని చెబుతున్నాయని తెలిపారు. ఎంతో చైతన్యవంతమైన గడ్డ దుబ్బాక అని, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిందని హరీష్ రావు అన్నారు. లోపాయికారీ ఒప్పందాలు వొద్దని, పార్టీ తల్లి లాంటిదని, మోసం చేయొద్దని, మనిషికి ప్రేమ గుణం ఉండాలని, కష్టంలో ఉన్నప్పుడు నిలబడాలని పార్టీ కార్యకర్తలకు హరీష్ రావు హితవు పలికారు. దుబ్బాక వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతులకు వ్యవసాయం ఎలా పండగ అయ్యిందనేదనేది తెలుసన్నారు. ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయని, కాళేశ్వరం నీళ్ళు, 24 గంటల కరెంట్ కేసీఆర్ వల్ల సాధ్యమైందని హరీష్ రావు స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వాలు రైతు నుండి డబ్బులు వసూలు చేస్తే, కేసీఆర్ రైతు బంధు రూపంలో రైతులకే 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని అన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ కుమార్ రెడ్డి అంటున్నాడని, బిచ్చమని రేవంత్ రెడ్డి అంటడని, మరొక నేత రైతు బంధు ఆపాలంటడని హరీష్ రావు మండిపడ్డారు. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేది కాంగ్రెస్ పార్టీనే అని, రైతులను అవమాన పర్చింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని, డికె శివకుమార్ స్వయంగా ఒప్పుకున్నాడని, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి వోటు వేయరన్నారు. మళ్ళా వ్యవసాయానికి చీకటి రోజులు అవసరమాఅని వారి వారి ఊళ్ళలో చర్చించాలన్నారు. నూకలు బుక్కుమన్న బిజెపికి, దుబ్బాకలో నూకలు లేకుండా చేయాలన్నారు. 8 నెలలుగా కుడవెల్లి వాగు పారుతనే ఉన్నదని, కాలం కాకున్నా పంటలు పండుతున్నాయన్నారు. కాళేశ్వరం ఎప్పుడు మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నరని విమర్శించారు హరీష్ రావు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బాలారిష్టాలు అనేవి ఎక్కడైనా ఉంటాయని, ఒక్క పిల్లర్ వంగితే మునిగిందని దుష్ట్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం చూడాలని, పారుతున్న నీళ్ళు చూడాలని, పండిన పంట చూడాలని హరీష్ రావు సూచించారు. వంగిన పిల్లర్‌ను ఒక్క పైసా మన ఖర్చు లేకుండా ఆ కంపెనీనే మళ్లీ బాగు చేస్తదని, 80 వేల కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కామ్ అంటున్నారని, గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మరని హరీష్ రావు దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా నిరంతర కరెంట్ లేదని అన్నారు. మేనిఫెస్టో చాలా అద్భుతంగా వొచ్చిందని, సీఎం ప్రకటించినవి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా హరీస్ రావు సూచించారు. తెలంగాణ జైత్రయాత్ర..లేదంటే తన శవ యాత్ర అని బయల్దేరి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ధరలు పెంచే దిక్కు ఉంటరా..సంపద పంచే వాళ్ల దిక్కు ఉంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. తాము ఇప్పటివరకు 14 వేల కోట్ల రుణమాఫీ చేశామని, అయితే దాన్ని ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినందున అనుమతి అడిగామని, ఒకవేళ అనుమతిస్తే వెంటనే మిగతా వాళ్లకి కూడా చేస్తామని, లేదంటే తిరిగి మన ప్రభుత్వం వొచ్చాక చేసుకుందామని హరీష్ రావు వివరించారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రభాకర్ రెడ్డి కావాలని, అందరూ కలిసి మంచి మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు కార్యకర్తలను కోరారు.




