రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఏర్పడితే దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమట. మేడిగడ్డ కుంగితే మాత్రం.. కుంగితే తప్పేంది అంటారు. ఇట్లాంటివి ఎన్నో కుంగాయి అట. పళ్లు ఒక్కటి ఊడిపోతే అన్నీ పీక్కోలేము కదా అని కెసిఆర్ అంటాడు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంటే..2004 నుంచే జరుగుతోంది…దీనిపైనా విచారణ చేయాలంటారు కెటిఆర్. కానీ ఫోన్ ట్యాపింగ్ పై మాత్రం తప్పును ఒప్పుకోవడం లేదు. పదేళ్లపాటు తెలంగాణను అడ్డంగా దోచుకుని, అధికార దుర్విని యోగానికి పాల్పడ్డ నేతలకు తమ పాపాలను కప్పిపుచ్చుకోవడమెలా అన్న ధ్యాసలో ఉన్నారు. అందుకు ప్రజల దృష్టిని మళ్లించే టక్కుటమార గారడీ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. లేఖలు రాయడం, నిందలు వేయడం, విమర్శలు చేయడం వంటి విద్యలను ప్రదర్శిస్తున్నారు. ఇక నేనే తెలంగాణ తెచ్చానన్న కెసిఆర్ రైతుల కోసం అంటూ రాజకీయ యాత్రలకు దిగారు. ఈ మధ్య నల్లగొండ జిల్లాలో పర్యటించారు.
తాజాగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే నీళ్లను సక్రంగా ఇవ్వడం లేదని , కరెంట్ సరిగా రావడం లేదని పాపం నోరెళ్లబెడుతున్నారు. గ్రామాలకు వెళితే ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ కుటుంబ సభ్యులు తెలుసుకోవడం లేదు. పార్టీలో ఒక్కొక్కరే జారు కుంటున్నా..ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. పార్టీ కార్యాలయానికి వాస్తు సరిచేస్తే చాలని భావిస్తున్నారు. ఇలా తిరోగమన చర్యలతో పదేళ్లపాటు తెలంగాణలో రాజ్యం ఏలారు. ఇప్పుడు విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. అసమర్థతతో, అక్రమాలు, అభివృద్ది పేరుతో అడ్డగోలు అప్పులతో, అణచివేతలతో పాలన చేసిన కేసీఆర్ పదేళ్ళ అధికారంలో ఒక్కనాడు కూడా ప్రజలను కలవలేదు. ప్రజలు విసిగిపోయి అధికారం నుంచి దింపేస్తే, ఇప్పుడు బయటకొచ్చి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. నా ప్రజలెక్కడ అని వలపోస్తు న్నారు. నా రైతులు అంటూ నానా కంగారు పడుతున్నారు. అంతేనా అంటే పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణమంటూ రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టారు. రుణమాఫీ చేయలేదని అంటున్నారు. రైతుబంధు జమ కాలేదని అంటున్నారు. అయితే ఇవన్నీ దొంగ ఏడుపులని ప్రజలకు తెలియదని అనుకుంటున్నారు కాబోలు. కెసిఆర్‌ను నమ్మి ప్రజలు మళ్లీ ఆయనకు ఓట్లేస్తారని భ్రమపడుతున్నారు.
. కెసిఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలే జరగలేదని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జీరో అని కేసీఆర్ చెప్పారు. కానీ వాస్తవాలను ఎప్పటికప్పుడు పత్రికలు ప్రచురించాయి. ఏ జిల్లాకు వెళ్లినా రైతుల ఆత్మహత్యలు కనిపించాయి. వారికి రైతుబీమా వొచ్చింది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల గురించిన ఎన్సీఆర్బీ రికార్డులను బయటపెట్టారు. రైతులు చనిపోకపోతే రైతు బీమా డబ్బులు ఎందుకు ఇచ్చారని ఆనాడు పిసిసి చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి పదేపదే ప్రశ్నిస్తూ వొచ్చారు. ఇప్పుడు 200మందికి పైగా రైతులు చనిపోయారని పాపం కన్నీళ్లు పెట్టుకుంటున్న కెసిఆర్… ఆనాటి నుంచి రైతుల ఆత్మహత్యలపై లెక్కలు తీయాలని ఎందుకు అడగడం లేదు. వరి వేస్తే ఉరి అని ఆగం చేసింది కేసీఆర్ సర్కారు. వరి కొనుగోలులో తరుగు పేరు ద రైస్ మిల్లర్లు దోచుకుంటున్నా నోరు మెదపలేదు. రుణమాఫీ ఏక కాలం అని చెప్పి పది సంవత్సరాలు కాలయాపన చేస్తే ఇచ్చిన పైసలు వడ్డీకే సరిపోయినవి, ఖాతాలు మొండి బకాయిల కింద పడ్డవి. రైతన్నకు బ్యాంకర్లు నోటీస్‌లు ఇస్తున్నారు. రైతుల పట్ల, ప్రజల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తించిన కెసిఆర్ ఇప్పుడు ఎన్నికల కోసం రైతుల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. బలవంతంగా మల్లన్న సాగర్ కింద భూములు లాక్కుంటే ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించి జైల్లో పెట్టించారు. రైతుల పేరుతో రాజకీయం చేయడం కెసిఆర్‌కు మాత్రమే చెల్లుతుంది.
లక్ష కోట్ల అప్పు చేసి కాళేశ్వరం కడితే, మూడేండ్లు కూడా గడువకముందే కుంగిపోయినా సోయిరాలేదు. పొలాలు ఎండిపోయి రైతులు దైన్యంగా ఉంటే కరువు పరిస్థితులను వివరించి వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు కాక మరేమంటారో దొరగారు సెలవియ్యాలి. తన తప్పులను, ప్రకృతి వైపరీత్యాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ద నెట్టివేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్, ఆయన కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఆడని అబద్ధం లేదు. మేడిగడ్డలో నీళ్లు స్టోర్ చేయొచ్చు అని, ఎత్తిపోయొచ్చు అని చెబుతున్న కేసీఆర్ మరి తాను అధికారంలో ఉన్నప్పుడు గేట్లు ఎత్తి 27 టీఎంసీల నీటిని బ్యారేజీ నుంచి ఎందుకు వదిలేశాడో, నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేదో రైతులకు సమాధానం చెప్పాలి. అధికారంలో ఉండగానే వర్షాకాలం వొచ్చిపోయింది.
కాళేశ్వరం, మేడిగడ్డ హయాంలోనే కుంగింది. మరి గత డిసెంబర్ 7న అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరువు ఎలా తెచ్చిందో వేలపుస్తకాలు చదివిన అపరమేధావి వివిరిస్తే ప్రజలు కూడా జ్ఞనోదయులు అవుతారు. రాజకీయ అస్తిత్వం కోసమే తన ఆరాటం అని ప్రజలకు తెలియదని అనుకుంటే పొరపాటు. బిఆర్ఎస్ పార్టీ నేతలు ముందు రైతన్నకు క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరం కుంగితేనే నీరు కిందికి వొదిలామని చెప్పాలి. గత వర్షాకాలంలో సరిగా వర్షాలు పడలేదని చెప్పాలి. కరువుకు కారణం కాంగ్రెస్ కాదు తామే అని చెప్పాలి. గత పదేళ్ల పాపాలను ధైర్యంగా ఒప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు చెప్పాలి. ఎక్కడెక్కడ ఎవరిదగ్గర ఎంతగా పిండారో చెప్పాలి. ఎంతగా అధికార దుర్వినియోగం జరిగిందో చెప్పాలి. లిక్కర్ కేసులో నోరు విప్పాలి. చేసిన పాపాలన్నింటికి ప్రజలను బహిరంగ క్షమాపణలు కోరాలి. అప్పుడే వారి నిజాయితీని నమ్ముతారు. లేకుంటే మరోమారు ప్రజలు ఆదరించకపోతారా అనుకుంటే..ప్రజలు అంత త్వరగా నమ్మి మోసపోరని గుర్తించాలి.
-ప్రజాతంత్ర డెస్క్





