తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో భారతీయ జనతాపార్టీ అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార బిఆర్‌ఎస్‌ను మానసికంగా కృంగదీయటంతోపాటు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పథకాలను రచిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలాంటి బిజెపి యేతర రాష్ట్రాలపట్ల కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిసున్నదన్న వాదన ఒక పక్క ఉంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలైతేనేమీ, నిధు) విషయంలో నైతేనేమీ కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదంటూ ఇక్కడి పాలకులు చాలాకాలంగా ఎలుగెత్తి ఆరోపిస్తున్న విషయం తెలియందికాదు. ఎట్టిపరిస్థితిలో తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణకు కష్టాలను తెచ్చిపెడుతున్నదన్న ఆరోపణలున్నాయి. పాలనాపరమైన ఇబ్బందులు ఒక పక్క ఉండగా ఐటి, ఇడి సోదాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిపర్చే కార్యక్రమానికి బిజెపి తెరతీసిందని బిఆర్‌ఎస్ ఘాటుగానే విమర్శిస్తోంది. దానికి తాజాగా గత మూడు రోజులుగా బిఆర్‌ఎస్ ఎంపి, ఎంఎల్‌ఏల ఇళ్ళపైన, వారి కార్యాలయాలపైన ఐటి జరుపుతున్న సోదాలే నిదర్శనమంటున్నారు. ఇది ఒక విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. విచారణ సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను లొంగదీసుకునే ఆలోచనగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌ర్‌రెడ్డి ఇటీవల తన అసహనాన్ని వ్యక్తంచేశారు. కేసులుపెట్టి, భయపెట్టి తమకు అనుకూలంగా నాయకులను మార్చుకోవాలనుకోవడం దుర్మార్గపు ఆలోచనగా ఆయన వ్యక్తీకరించారు. రాష్ట్రంలో కొంత కాలంగా వివిధ వ్యాపారవేత్తలు, వ్యాపార వేత్తలుగా కొనసాగుతున్న రాజకీయ నాయకులు, ఇతర సంస్థలపై వరుసగా ఐటి, ఈడీ• దాడులు జరుగుతున్నాయి. అయితే బిఆర్‌ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నట్లు ఈ దాడులు ఎక్కువగా బిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, వారి వ్యాపార సామ్రాజ్యాలపైనే జరుగుతుండడం నిజంగానే కేంద్రం తమ ఆధీనంలోని సంస్థలను ప్రేరేపిస్తుందా అన్న అనుమానానికి తావేర్పడుతున్నది. కొద్ది రోజుల క్రింత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రుల వ్యాపార సంస్థలపైన ఐటి,ఈడీ దాడులు చేసిన విషయం తెలియంది కాదు. మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌ల సంస్థల్లో రెండు మూడు రోజులు సోదాలు జరిగాయి. వారిద్దరుకూడా తామేమీ భయపడేదిలేదని అన్ని పద్దతి ప్రకారమే తాము నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు బిఆర్‌ఎస్ నాయకుల ఇళ్ళు, వ్యాపార సంస్థలపై గత మూడు రోజులుగా ఐటి సంస్థ సోదాలు నిర్వహిస్తున్నది.
వీరిలో ఒకరు ఎంపి కాగా, మరో ఇద్దరు ఎంఎల్‌ఏలు కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కావాలనే పనిగట్టుకుని దర్యాప్తు సంస్థలను తమ పార్టీ నేతలపై ప్రేరేపిస్తున్నట్లుగా బిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రతీ రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబిస్తున్నదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమిళనాడులో డిఎంకె మంత్రిని, ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులను వివిధ ఆరోపణలపై జైలుకు పంపించిన విషయం తెలిసిందే. దర్యాప్తు సంస్థలను ఒక అస్త్రంగా ప్రయోగించి విపక్ష పార్టీ వర్గాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ఆలోచనగా కేంద్రం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. తాజాగా తెలంగాణలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎంఎల్‌ఏ పైళ్ళ శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఏ మర్రి జనార్థన్‌రెడ్డితో పాటు మరి కొందరు బిఆర్‌ఎస్ నేతల ఇళ్ళు, సంస్థలపైన ఏక కాలంలో ఐటి సోదాలు చేస్తున్నాయి. సుమారు డెబ్బైకి పైగా టీములు వివిధ ప్రాంతాల్లోని వీరి సంస్థల్లో దర్యాప్తులు కొనసాగిస్తున్నాయి.
పై ముగ్గురు ప్రజాప్రతినిధులు బిఆర్‌ఎస్‌లోకి చేరడానికి ముందునుండే వ్యాపారవేత్తలు స్థిరపడినవారు. తామంతా పద్దతి ప్రకారం పన్నులు చెల్లిస్తున్నవారమేనని కూడా వారు చెబుతున్నారు. అయినా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులను భయపెట్టాలని కేంద్రం తమ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను తమపై ప్రయోగిస్తున్నదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్యామ్‌లో ఎంఎల్‌సీ కవిత పేరు పలుసార్లు తెరమీదకు రావడంతో ఆ పార్టీ గందరగోళంలో పడిపోయింది. మరో పక్క ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాల్లో విపరీతమైన అవినీతి జరిగిందంటూ విపక్షాలు నిత్యం చేస్తున్న దాడులను ఎదుర్కుంటోంది. వీటన్నిటికి తోడు ఇప్పుడు కొత్తగా మరోసారి ఆ పార్టీ ఎంఎల్‌ఏలు జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై అయిదు మంది తమ సంప్రదింపులో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేసిన ప్రకటన బిఆర్‌ఎస్‌లో తీవ్ర ప్రకంపనలు లేపుతోంది. బిజెపి కార్పోరేటర్లు కొందరు తమ సంప్రదింపులో ఉన్నారన్న బిఆర్‌ఎస్ మంత్రి కెటిఆర్ ప్రకటనకు బండి సంజయ్ ఇచ్చిన ఈ కౌంటర్ బిఆర్‌ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లైంది. రానున్న ఎన్నికల్లో ప్రజల స్పందనను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కెసిఆర్ పేర్కొంటున్న తీరును తమకు అన్వయించుకుంటున్న ఎంఎల్యేలెవరైనా బిజెపి టచ్‌లో ఉంటున్నారా అన్న శోధన ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో మొదలైనట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా ముప్పై స్థానాల్లో ఈసారి బిఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావంటున్న సంజయ్ మాటల్లో ఎంతవరకు వాస్తవముందన్న విషయాన్ని ఆ పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.




