- పెద్దపల్లి ఎంపిని పార్టీలో చేర్చుకుని బిఆర్ఎస్ సవాల్‌కు జవాబు
- పార్లమెంట్ ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధ చేసున్న కాంగ్రెస్
- అంతర్ఘత సమావేశాలతో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో బిఆర్ఎస్, బిజెపి
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల నాయకులు హద్దు మీరి మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఒకరినే నిందించే పరిస్థితి లేదు. అదేమంటే తిట్లపురాణం నేర్పిన మా గురువు అడుగుజాడల్లోనే కొనసాగుతున్నామన్న ముక్తాయింపునిస్తున్నారు. రానున్న తరాలకు ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన నాయకులు సంయమనం పాటించడం ద్వారా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటున్నారు రాజకీయక మేధావులు. ఇదిలా ఉంటే త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయదుందుభిని మోగించాల్సిందేనని కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నది. రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో కనీసం పదిహేను స్థానాలనైనా గెలువాల్సిందేనంటుంది.
అందుకుగాను గెలిచే గుర్రాల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. పదిహేడు స్థానాలకుగాను ఇప్పటివరకు మూడు వందలకు పైగా దరఖాస్తులు అందాయి. వాటిలో నుండి నియోజకవర్గాల వారీగా కనీసం రెండు లేదా మూడు పేర్లను ఎంపిక చేసి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే కార్యక్రమంలో ఆ పార్టీ మునిగిపోయింది. కాగా బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు అంతర్ఘత సమావేశాలు ఏర్పాటు చేసి, నాయకులు, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే పనిలో ఉన్నాయి. అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటాలనుకుంటున్నది. అందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. దానికి పోటీ బహిరంగ సభకు కాంగ్రెస్ కూడా వ్యూహరచన చేస్తున్నది. ఈ రెండు పార్టీలు కూడా లోకసభ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడే అవకాశం ఉంది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందే బిఆర్ఎస్కు పెద్ద షాక్ ఇచ్చే ప్రణాళికను కాంగ్రెస్ రచిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, పలువురు ఎంఎల్యేలు, ఎంపిలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ను ఎలా బెదిరించిందో కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదేపాట పాడుతుంది. వాస్తవంగా శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాఖ్యలే చేస్తూ రావటం గమనార్హం. అయితే ఈసారి పార్టీ మార్పిడులను కాంగ్రెస్ చాలా గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా పెద్దపల్లికి చెందిన బిఆర్ఎస్ ఎంపి బోర్లకుంట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేవరకు ఎవరికీ తెలియనీయలేదు. ఆయన పార్టీ మారుతారన్న మాట వినిపించినా అంతతొందరగా నిర్ణయం తీసుకుంటాడని బిఆర్ఎస్ ఊహించలేకపోయింది. సరాసరి దిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిల్లీలో ఉన్నప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇంటికెళ్ళి కాంగ్రెస్ కండువను గుట్టు చప్పుడు కాకుండా కప్పుకోవడం ‘నన్ను.. నా పార్టీని టచ్ చేసి చూడు’ అని సవాల్ విసిరిన కెసిఆర్‌కు రేవంత్‌రెడ్డి టచ్ చేసి చూపించినట్లు అయింది. కాంగ్రెస్ కండువ కప్పుకున్న బోర్లకుంట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పాతవాసనలు ఉన్న వాడె. ఆయన తన స్వంత గూటికి చేరిపోవడమే కాకుండా, మరోసారి పెద్దపల్లి టికట్ హామీని కూడా పొందినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలు ముసురుతాయన్నట్లు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీవైపు చూడడమన్నది నేటి రాజకీయాల్లో సహజమైపోయింది.
దానికి తగినట్లు అధికార పార్టీ విసిరే ఆకర్ష్ పథకాలకు ఆకర్షితులు కాని రాజకీయ నాయకులుండడం అరుదైన విషయం. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టికెట్లు ఆశించి భంగపడినవారు, టికెట్లు లభించినా ఓటమి చవిచూసినవారు, ఆ పార్టీలో ఇముడలేకపోతున్నవారు, అసంతృప్తులు ఇలా ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీ నేతలను కలవడం ప్రారంభమైంది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికార పార్టీలో చేరాలనుకునేవారు కొందరైతే, తర్వాతైనా చేరిపోవచ్చని నిబ్బరంగా ఉన్నవాళ్ళు మరికొందరు ఇప్పటికే దారి ఏర్పరుచుకునే పనిలో ఉన్నారు. తాజాగా నలుగురు ఎంఎల్ఏలు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం బహిరంగ రహస్యమే. ఒక ముఖ్యమంత్రిని ఎంఎల్ఏలు కలువకూడదా అన్న వారి ప్రశ్నను ఎవరు కాదంటారు. తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో కాకుండా ఎవరితో మాట్లాడుతామన్న వారి మాటలను తీసిపారేయలేముకదా. నర్సాపూర్ ఎంఎల్ఏ సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎంఎల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్ చెరువు ఎంఎల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంఎల్ఏ మాణిక్‌రావులు గత నెల చివరి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చాలనిచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అదేవరుస పాటించింది. స్టేషన్‌ఘణపూర్ మాజీ ఎంఎల్ఏ సరాసరి పార్టీ కండువ కప్పుకొవడానికి సిద్దమైనా,అక్కడినుండి తాను ఆశించిన హామీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయనతోపాటు కొందరు సిట్టింగ్ బిఆర్ఎస్ ఎంపీలు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో టికట్ హామీకోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్‌లకు గాలం వేయడంద్వారా బిఆర్ఎస్ పార్టీని కోలుకోని దెబ్బతీయాన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.అదే నిజమైతే కాంగ్రెస్ ‘టచ్’కు బిఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.





