బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా లేదు

పార్టీ కార్యాయలంలో గణతంత్ర వేడుకల్లో బిజెపి ఎంపి లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో చింతా సాంబమూర్తి, కాశం వెంకటేశ్వర్లు, బండా కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మందు చూపుతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అవినీతికి ఆస్కారం లేకుండా దేశంలో మోదీ పాలన సాగుతుందన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో దలారి పాలన కొనసాగిందన్నారు. రాష్ట్రంలో గ్యారెంటీ, ఉచితాల పేర్లతో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని, పేదలకు శాశ్వత ప్రయోజనం కల్పించాలనే చిత్తశుద్ధి ఆ పార్టీకి లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేయలేని పనులను బీజేపీ చేసి చూపించిందని, 33 శాతం మహిళ రిజ్వేషన్లు, అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. తెలుగు తేజాలకు పద్మ భూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డు వరించడంలో ఎవరి సిఫారసు లేదని ఆయన వివరించారు. యాభై రోజుల రేవంత్‌ రెడ్డి పాలన కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అనిపిస్తుందని, రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని లక్ష్మణ్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *