బహుముఖ ప్రజ్ఞాశాలి లూయిస్‌ బ్రెయిలీ

(నేడు ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ సందర్భంగా…)

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్‌ అంగవైకల్య అభాగ్యుల ఆరోగ్య, విద్య, విధి నిర్వహణల్లో అసమానతలను ఎదుర్కొంటూనే, కడు పేదరికం, నిరాదరణ, నిర్లక్ష్యం, వేదింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, క్రూరత్వాలకు గురి అవుతున్నారు. అంగవైకల్య వర్గంలో అంధత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించబడిరది. కంటి చూపు లోపించిన అభాగ్యులకు దారి దీపంలా ‘బ్రెయిలి లిపి’ వరంగా మారడం చూస్తున్నాం. బ్రెయిలీ లిపి రూపశిల్పి ‘‘లూయిస్‌ బ్రెయిలీ’’ జన్మదినం సందర్భంగా ప్రతి ఏట 04 జనవరిన ‘ప్రపంచ బ్రెయిలీ దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. 04 జనవరిన ఐక్యరాజ్య సమితి తీర్మానంతో 2019 నుంచి ‘‘ప్రపంచ బ్రెయిలీ దినం‘‘ పాటిస్తున్నాం.
లూయిస్‌ బ్రెయిలీ అసాధారణ ప్రతిభ 04 జనవరి 1809న ఫ్రాన్స్‌లో గుర్రపు స్వారీకి సంబందించిన లెదర్‌ వ్యాపారి (హార్నెస్‌ షాప్‌) కుటుంబంలో జన్మించిన లూయిస్‌ బ్రెయిలీ 3-ఏళ్ల బాల్యంలో జరిగిన ప్రమాద కారణంగా చూపును కోల్పోవడం దురదృష్టకరం.

కంటి చూపు కోల్పోవడంతో కారు చీకట్లు కమ్మిన కారణంగా నిరాశకు గురి కాకుండా తన గ్రామ పాఠశాలలో వినికిడి జ్ఞానంతో చదువుతూ చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. తన ప్రతిభకు గుర్తుగా 10 ఏటనే స్కాలర్‌షిప్‌ పొంది, పారిస్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ బ్లైండ్‌ యూత్‌’లో చదవడం ప్రారంభించారు. ‘చార్లెస్‌ బార్బియర్‌’ సహకారంతో తన 15వ ఏటనే బ్రెయిలీ లిపిని ప్రవేశ పెట్టి ప్రపంచ అంధుల పాలిట జ్ఞాన దీపం వెలిగించారు. 1829లో లూయిస్‌ బ్రెయిలీ రచించిన ‘మెథడ్‌ ఆఫ్‌ రైటింగ్‌ వర్డ్స్‌’ పుస్తకం ప్రచురితం అయ్యింది. లూయిస్‌ బ్రెయిలీ 19వ ఏటనే ఉపాద్యాయుడిగా నియమించబడ్డారు. కాలక్రమంలో బ్రెయిలీ లిపిని మరింత సరళంగా మార్పు చేస్తూ 1837లో తొలి బ్రెయిలీ లిపి పుస్తకం విడుదల చేశారు. నేడు ప్రపంచ అంధుల లిఖిత బ్రెయిలీ భాషగా లూయిస్‌ బ్రెయిలీ బహుళ ప్రచారం, ఆచరణ పొందడం ప్రారంభమైంది. కంటి చూపు మందగించిన లేదా అంధ వ్యక్తుల జ్ఞాన సమపార్జనకు దోహదపడుతున్న బ్రెయిలీ లిపి ద్వారా జ్ఞాన వెలుగులు నింపడం జరుగుతున్నది. బ్యాంకులు, కార్యాలయాలు, హోటళ్లు, ఆసుపత్రులు లాంటి రంగాల్లో బ్రెయిలీ లిపి సౌకర్యం నేటికీ అమలు కాక పోవడంతో అంధులకు ఎంపికలో స్వేచ్ఛ, ప్రాధాన్యం, సమానత్వం లభించడం లేదు.

బ్రెయిలీ లిపికి ప్రజాదరణ
06 జనవరి 1852న లూయిస్‌ బ్రెయిలీ క్షయవ్యాధితో 43వ ఏట  మరుడయ్యారు. బ్రెయిలీ మరణించిన 2 ఏండ్ల అనంతరం మాత్రమే ఫ్రాన్స్‌లోని ‘రాయల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్లైండ్‌ యూత్‌’ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలో బోధనలు ప్రారంభించారు. 1916 తరువాత అమెరికాలో కూడా అంధుల పాఠశాలల్లో బ్రెయిలీ భాషతో బోధనలు ప్రారంభమైనాయి. నేడు బ్రెయిలీ లిపి అత్యంత ప్రచారంలోకి రావడంతో ఏటియం, ఎలివేటర్స్‌, కాలిక్యులేటర్స్‌, రూబిక్స్‌ క్యూబ్‌, వాచెస్‌ లాంటి పలు రంగాల్లో బ్రెయిల లిపి వాడబడుతున్నది. బ్రెయిలీ లిపిలో కాగితపు గ్రిడ్లపై ఆరు డాట్స్‌ను 64 రకాల సంయోగాలతో వ్రాయడం జరుగుతుంది. దీని ద్వారా అంధులు స్పర్శ జ్ఞానంతో చదవడం, రాయడం వీలు కలిగింది. అంధులకు బ్రెయిలీ లిపిని అందుబాటులోకి తేవడం, సకల సౌకర్యాలు కలిగిన అంధుల పాఠశాలలు నెలకొల్పడం, బ్రెయిలీ లిపిలో పుస్తకాలు ముద్రించడం, అంధులకు టేప్‌ రికార్డ్‌లు, ఆడియో పాఠాలు అందించడం జరుగుతున్నాయి.
వివేకానందుడు, శ్రీనివాస రామానుజన్‌ లాంటి తక్కువ జీవితకాలం జీవించిన ప్రపంచ స్థాయి మేధావుల సరసన లూయిస్‌ బ్రెయిలీ కూడా నిలిచి ప్రపంచ అంధులకు అక్షర చూపును అందించి 43 ఏండ్లకే అమరుడై, నిత్య ప్రేరకుడై, మన గుండెల్లో పదిలంగా జీవించే ఉన్నారు. ప్రపంచ అంధులలో జ్ఞానకాంతులు నింపిన లూయిస్‌ బ్రెయిలీ జీవితం మనందరికీ మార్గదర్శనం చేయాలి.

-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *