- ఆదివాసీలను ఇబ్బంది పెడితే సహించేది లేదు
- రాష్ట్రాన్ని నష్టాల బాట పట్టించిన కేసీఆర్
- బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆదివాసీలు ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అతి దారుణంగా దాడులు చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా తాము నిలబడి పోరాడతామని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా భద్రాచలం వొచ్చారు. భద్రాచలంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బహుజన రాజ్యంలో ఆదివాసీలకు పోడు భూమి పట్టాలు ఇస్తామని స్పష్టం చేసారు. ఆదివాసీలు ఏర్పాటు చేసుకున్న భూములు లాక్కుంటూ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని విమర్శించారు. ఆదివాసీలకు ఉపయోగకరంగా ఉన్న జిఓ 3ని తీసివేయటం దారుణమని అన్నారు. జిఓ 3 అమలుపై బిఎస్పీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని అన్నారు. రాష్ట్రం నష్టాల్లో ఉందని అనేక విధాలుగా ఆర్టీసి చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ అయ్యే ఖర్చును తగ్గిస్తే రాష్ట్రం అప్పులపాలు అయ్యేది కాదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు అయ్యే ఖర్చు 7,800 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
ఈ నష్టాన్ని ప్రజలపై భారం మోపుతుంటే బహుజన సమాజ్ పార్టీ చూస్త్తూ ఊరుకోదని హెచ్చరించారు. బహుజన సమాజ్ పార్టీ ఏర్పడిన తరువాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉండే విధంగా రాష్ట్రాన్ని చూస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలను నిర్ధాక్ష్యణ్యంగా 14 మందిని బాలింతలు అని కూడ చూడకుండా పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేసారని అన్నారు. ఫారెస్టు అధికారులు ఆదివాసీలు ఏర్పాటు చేసుకున్న పోడు భూముల్లో కందకాలు తవ్వుతూ చెట్లు నాటి ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని అన్నారు. సోమవారం నుండి ప్రారంభమైన పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని అన్నారు. విద్యకు 79 కోట్లు కేటాయించామని చెప్తున్న ప్రభుత్వం ఏర్పాట్లు చేయటంలో విఫలమైందని విమర్శించారు. ఇప్పటివరకు పార్టీ పుస్తకాలు కూడ పాఠశాలలకు చేరలేదని అన్నారు.
మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం కేవలం ఎలక్షన్‌ల కోసమే ఉపయోగించుకుంటున్నారని అన్నారు. వేలలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్‌లు కొన్నిమాత్రమే విడుదల చేసారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైన ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీని రద్దు చేస్తామని లీకులు ఇస్తుందని అన్నారు. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి వందకోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేటికి ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్టు పేరుతో ఆదివాసీల భూములను ప్రభుత్వం నిర్ధాక్ష్యణ్యంగా లాక్కుంటుందని అన్నారు. వారికి నష్టపరిహారం కూడ ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. గిరిజన యునివర్సీటి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికి నేటికి ఆచరణలో లేదని అన్నారు. ఈ సమావేశంలో బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు.



