బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

త్వరలో సిద్ధిపేటలో బసవేశ్వరుని భవన నిర్మాణం
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ వొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. కోటి రూపాయలతో హైదరాబాద్‌ ‌ట్యాంకు బండ్‌పై బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం, 10 కోట్లు, అన్ని చోట్ల భూములు, బసవ భవనాలు నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఆదివారం సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్‌ ‌హాల్‌ ‌వేదికగా సిద్ధిపేట వీరశైవ బలిజ సమాజ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి హరీశ్‌ ‌రావు, జహీరాబాద్‌ ఏం‌పీ బీబీ పాటిల్‌, ‌వీరశైవ బలిజ సమాజ సభ్యులు హాజరయ్యారు. ఈ సారి ఈ సారి జరిగే ఎన్నికల్లో తమ వోటు హరీష్‌ ‌రావుకే అంటూ వీరశైవలింగ బలిజ సమాజం ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు బలిజ సమాజాన్ని పట్టించుకోలేదని వాఖ్యానించారు. త్వరలో సిద్దిపేటలో బసవేశ్వరుని భవనాన్ని నిర్మిస్తామని, బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో బలిజలు ఎక్కువని, వారితో అవినాభావ సంబంధమున్నదని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని మంత్రి హరీశ్‌ ‌విమర్శించారు. లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, కష్టం గురించి వివరించిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని, బసవుడి పాలనను మహారాష్ట్రలో స్వయంగా వెళ్లి తెలుసుకున్నానని తెలిపారు. తాము బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, బసవుడి ఆలోచనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం మనదని అన్నారు. సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుకు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ అని పేరు పెట్టుకున్నామని, సీఎం కేసీఆర్‌ ఆలోచన ఎప్పుడు పేదలను ఆదుకోవాలన్నదేనని తెలిపారు. వారందరి సహకారం, బలంతోనే ఈ అభివృద్ధి సాధ్యమని, తనతో వారు ఉన్నానన్నప్పుడు తాను కూడా ఎప్పుడూ వారి వెంట ఉంటానని హరీష్‌ ‌రావు తెలిపారు. రుద్రభూమికి అవసరమైన స్థలంతో పాటు, బసవ కల్యాణ మండపం నిర్మిస్తామని, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వారికి ఎప్పుడు అండగా ఉంటానని మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జహీరాబాద్‌ ఏం‌పీ బీబీ పాటిల్‌ ‌మాట్లాడుతూ…వీర శైవులను బీసీల్లో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ ‌దేనని, ప్రభుత్వంలో బలిజలకు రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. ఏదైనా అడిగితే లేదనుకుండా ఇచ్చే మంచి మనసున్న వ్యక్తి కెసిఆర్‌ అని, అడగకుండానే అన్నీ సమకూర్చే వ్యక్తి అని అన్నారు. మంత్రి హరీష్‌ ‌రావుపై వారి ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలని, సిద్ధిపేటను మరింత అభివృద్ధి చేస్తారని ఏంపీ బీబీ పాటిల్‌ ‌స్పష్టం చేశారు. అంతకు ముందు డీసీఏంఎస్‌ ‌చైర్మన్‌ ‌శివకుమార్‌ ‌మాట్లాడుతూ…ప్రభ్యుత్వ పరంగా బసవేశ్వర జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మహాసభలో మాజీ మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యుడు పాల సాయిరాం, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, వీర శైవ ప్రతినిధులు శివప్ప, ప్రశాంత్‌, ‌భద్రప్ప, అశోక్‌, ‌యాదగిరి, శివకుమార్‌, ‌నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *