హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లానింగ్‌తో సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని కేంద్రం కావాలనే విస్మరించిందన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలంటే కనీసంగా మూడేళ్లు పడుతుందని తెలిపారు.
అన్ని సిద్దంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని పరిగణనలోకి తీసుకుపోకపోవడం..ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత దిశగా స్వయం సమృద్ధి చేయాలన్న లక్ష్యం పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతలేమికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని అనుకూలతలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండి చెయ్యి ముమ్మాటికీ వివక్షేనని ధ్వజమెత్తారు. వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్మా సిటీని కావాలనే కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. మరో నాలుగేళ్ళైనా పట్టాలెక్కని ప్రాంతాలకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించడం బాధాకరమన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి మొండి చేయి చూపడం ముమ్మాటికీ వివక్షేనన్నారు.


