- సామాజిక కార్యకర్తల సమావేశాలపై మీడియా చిన్న చూపు
- నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయింది
- భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ మీడియా సమావేశంలో వక్తల ఆందోళన
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 05 : తమలాంటి సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు చాలామంది రిపోర్టర్లు వచ్చి విషయాలన్నీ రిపోర్టు చేస్తున్నప్పటికీ ఆ విషయాలు మీడియాలో సరిగ్గా ప్రసారం చేయడం లేదని పోగ్రెసీవ్ ఆర్గనైజషన్ ఫర్ విమెన్(పి.వో.డబ్ల్యూ) జాతీయ కార్యదర్శి సంధ్య అన్నారు. తమపై మీడియా చిన్నచూపు తగదన్నారు. ఈ విషయంపై త్వరలో మీడియా కౌన్సిల్ తో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మీడియా అంతా సినీ ప్రముఖుల వార్తలు వారి వ్యక్తిగత జీవితాలను సెన్సేషన్ చేస్తూ టిఆర్పి రేటింగ్ కోసము పాకులాడుతున్నాయన్నారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, లైంగిక దాడులు, కుల దురఆహంకార హత్యలపై ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా జెండర్ సున్నితత్వంతో వ్యవహరించాలని మిభూక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో భూమిక సంస్థ ముఖ్య నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన పి.వో.డబ్ల్యూ జాతీయ కార్యదర్శి సంధ్య మాట్లాడుతూ సమాజంలో కుల దురహంకార హత్యలు జరుగుతున్నా, బాలికలు, మహిళలపై హింసకు సంబందించిన నేరాల గురించి అసలు వార్తలు రావడం లేదన్నారు.
పరువు హత్య అనే పేరుతో రకరకాల వ్యాసాలు, వార్తలు ప్రసారాలు చేస్తున్నారు కానీ వాటి పేరు కుల దురహంకార హత్యలు అని రాయాలన్నారు. బాధితులు అందంగా ఉన్నవారైతే వారి వార్తలు సంచలనాలుగా వేస్తున్నారు కానీ బాధితుల బాధలు అందంతో సంబంధం లేకుండా చూసి నిజాలు రాయాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి భద్రత ఉన్నదో ఇప్పటి ప్రభుత్వం చెప్పాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మహిళలపై దాడులు ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని చెప్పారు. యువత పోర్న్ వీడియోల మత్తులో ఉందని, దానిని సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఆధారపడిందన్నారు.
చాలా దేశాలలో ఫోర్న్ వెబ్సైట్లను బ్యాన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఇలాంటి విషయాలపైన అన్ని వర్గాలతోని సలహాలు తీసుకుని పోర్న్ సైట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అత్యాచారం, హత్యకు, గురైన మహిళలు, పిల్లల ఫోటోలు మీడియాలో చూపించొద్దు అని చెప్పారు. జర్నలిజం రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ షా మాట్లాడుతూ నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం ఇస్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న హింసకు పొంతన లేదన్నారు.
పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అయిన కేసులు తప్ప బయట జరుగుతున్న నేరాలు ఎక్కడ మీడియా చూపించట్లేదు అన్నారు. మీడియా కొన్ని వార్తలను మాత్రం సెన్సేషన్ చేస్తుంది కానీ మీడియా అనేది చాలా బాధ్యతాయుతమైన వ్యవస్థ నిరంతరం ఆకలి మీద ఉండాలి నిజాలనే ప్రసారం చేయాలన్నారు. మహిళ రాజకీయ నాయకుల కట్టుబొట్టు నడవడిక గురించి రాయడం సరికాదన్నారు. మహిళ రాజకీయ నాయకుల సామర్థ్యాలను, వారి పనితీరును ప్రశంసిస్తూ వార్తలు రాయాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని పదేపదే మీడియాలో చూపించడం సరికాదన్నారు. టీవీ సీరియల్స్ లో పితృ స్వామ్మ్యా భావజాలము, ఆడవాళ్ళని కొట్టడం, తిట్టడం, అందులో వాడే భాష, స్త్రీలను విలన్ గా చూపించడం, విష ప్రయోగాలు చేయడము వంటి విషయాలు, సమాజంలో స్త్రీలు ఆలోచించే విధానం వారి జీవన విధానంపై చాలా వ్యతిరేక ప్రభావం చూపుతుందన్నారు. ఇలాంటివి అసలు ఆమోదయోగ్యమైనవి కావు అన్నారు. ఇలాంటి సీరియల్లు విష సంస్కృతి వెదజల్లుతున్నాయని అన్నరు. యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమా అని అందరూ జర్నలిస్టులు అయ్యారన్నారు.
జర్నలిజం ఒక వృత్తి గా స్వీకరించి నిజాలను రాయాలి అనే నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కావున చాలా విలువలతో కూడిన బాధ్యతయుతంగా మీడియా వ్యవహరించాలని కోరారు. కొండవీటి సత్యవతి మాట్లాడుతూ మీడియాలో ప్రసారమయ్యే స్త్రీలు, పిల్లల విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు సెన్సేషన్ కోసం కాకుండా సెన్సిటివ్ తో ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీడియా అంతా కూడా సినీ తారలు రాజకీయ నాయకులకు రాజకీయాలకు సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తున్నారే కానీ జనాభాలో సగభాగం అయిన స్త్రీలు, పిల్లలకు సంబంధించిన విషయాలు రావడం లేదని, ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు.
కరోనా తర్వాత మహిళలు పేదవారు, విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారన్నారని, వాటిని ఎక్కడ కవర్ చేయడం లేదు అన్నారు. అధికారంలో ఉన్న మహిళలు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వారి గురించి ఎక్కువగా మీడియాలో రావడం లేదన్నారు. మీడియాలో మహిళలను గొడ్రాలు, కసాయి తల్లి అని సంబోధించడం సరికాదన్నారు. మీడియా మహిళలు, బాలికల విషయంలో వివిధ అంశాలను మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రసారం చేస్తున్నప్పుడు గౌరవప్రదమైన భాషను వాడాలి అని చెప్పారు. అకాడమీ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలని డిమాండ్ చేశారు.




