తెలంగాణ ఎన్నికల్లో చిన్న పార్టీలన్నీ తలో దిక్కు చేరిపోతున్నాయి.పొత్తులు లేకపోతే పోటీ నుంచి విరమించుకోవడం వంటివి చేస్తున్నాయి. కానీ బహుజనసమాజ్ పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఒంటరిగా పోటీ చేస్తోంది. కనీసం వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ బిఎస్పీకి ఊతంగా నిలిచిన ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఏ మేత్రకు ప్రభావం చూపుతారన్నది చూడాలి.
ఇప్పటికే మూడు జాబితాల ద్వారా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అందరి దృష్టిని ఆకర్షించేలా ఓ ట్రాన్స్ జెండర్‌కూ టిక్కెట్ కేటాయించారు.
మరో వైపు తాను స్వయంగా జనరల్ సీటులో పోటీకి దిగారు. సిర్పూర్ నుంచి తాడోపేడో తేల్చు కుంటానంటున్నారు. దీంతో ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై రాజకీయవర్గాల్లో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. కులాల కుంపట్లలో కొట్టుకుపోతున్న ప్రజలు గంప గుత్తగా బిఎస్పీకి అధికారం అప్పగిస్తారని అనుకోవాడనికి లేదు. అలా అయితే ఎస్సీ,బిసీలంతా బిఎస్పీకి అండగా నిలవాల్సిందే. కానీ అలా జరగదని గతంలో అనేక ఎన్నికల అనభువాలు చెబుతున్నాయి. తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ ఉనికి గతంలో పెద్దగా ఉండేది కాదు. ఏదైనా పార్టీలో టిక్కెట్లు దొరకని నేతలు బీఎస్పీ బీఫాం తెచ్చుకుని పోటీ చేసి తమ సత్తా చాటేవారు. 2014లో బీఎస్పీకి ఆదిలాబాద్ జిల్లాలో రెండు సీట్లు వోచ్చాయి.
ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కోనేరు కోనప్ప బీఎస్పీ సీట్లపై గెలిచారు. కానీ వారు కేవలం బీఫాం కోసమే ఆ పార్టీలో చేరారు. ఓ రకంగా ఇండిపెండెంట్లుగా గెలిచారు. తర్వాత వారు బీఆర్‌ఎస్ లో చేరారు. అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరోసారి పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి స్థిరమైన నాయకత్వం లేదు. జాతీయ అధ్యక్షురాలు మాయవతి కూడా ఎప్పుడూ తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఐపీఎస్‌గా పదవీవిరమణ తీసుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సాదాసీదా ఐపీఎస్ కాదు. ఆయన ఐపీఎస్ అయినా.. పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖలో తీసుకున్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాల వ్యవహారాలను తొమ్మిదేళ్ల పాటు తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్నారు. ’స్వేరోస్’ అనే సంస్థను పాతుకుపోయేలా చేయగలిగారు. సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ను స్వేరోస్‌గా పిలుస్తారు. ఈ సంస్థను ప్రవీణ్ కుమార్ ప్రారంభించ లేదు. కానీ ఈ సంస్థకు వెన్నుముకగా ఆయన నిలిచారు. ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకల హాస్టళ్లలో స్వేరోస్ విస్తృతంగా విస్తరించారు. మెల్లగా స్వేరో భావాజాలను దళిత కాలనీలకు విస్తరించారు. స్వేరోస్ భావజాలం.. చాప కింద నీరులా విస్తరించింది.
ఇప్పుడు వీరినే ప్రవీణ్ కుమార్ తన బలంగా భావిస్తున్నారు. దళిత భావజాలాన్ని అందుకే విస్తృతంగా వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జనాభాలో 17.5 శాతం. వీరు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మార్చేయగలరు. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే.. రాజకీయ పార్టీలన్నీ దళితవాదం అందుకున్నారు. అయితే.. దళితుల్లో సహజంగానే తమను పైకి రానివ్వడం లేదన్న అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి నుంచి ఇప్పటి వరకూ ఒక్క సరైన నాయకుడు పుట్టుకురాలేదు. ఇప్పుడు తాను ఆ బాధ్యత తీసుకుంటానని.. వారికి నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంత ప్రభావం చూపిస్తుందన్నది అంచనా వేయడం కష్టంగా మారింది. రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూర్ లో పోటీ చేస్తున్నారు.
దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీల పక్షాన గళం విప్పుతున్నా.. వారు ఏ మేరకు బిఎస్పీకి అండగా ఉంటారన్నది కూడా అనుమానమే. అసైన్డ్ భూములను అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపక పోవడంతో పాటు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపైనా ప్రశ్నిస్తున్నారు. పోరాట పటిమ ద్వారా ఓ బలమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశం వొచ్చినా పట్టించుకోలేదు. దళిత వర్గాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ వోట్లు పొందితే ఎవరు నష్టపోతారన్న సంగతి పక్కన పెడితే.. ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు ప్రయత్నిస్తా రన్నది చూడాలి.





