ప్రజా ప్రభుత్వమైనా…ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేనా!

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం చాలా సంతోషదాయకమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పాత్ర చారిత్రాత్మకమైనది. తమది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే, సమస్యలన్ని పరిష్కారమవుతాయని, తమ కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ఎగిరి గంతేసారు. ‘సర్వీస్‌ రూల్స్‌కు దొడ్డు దొడ్డు పుస్తకాలెందుకు, రెండు పేజీల్లో రాసుకుందామంటే’ గదెట్లా సాధ్యం అనకుండా మంచిదేకదా అనుకున్నారు. వచ్చిరాగానే 2015లో సంఘాలు అడిగినదానికంటే పి.ఆర్‌.సి 1% ఎక్కువగా అని 43శాతం ఇస్తే మనకు ఢోకాలేదనుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇస్తే ఆనందడోళికల్లో తేలియాడుతూ పాలాభిషేకాలు ప్రారంభించారు. 2018లో గడువుకంటే ముందే ముగ్గురు సభ్యులతో పి.ఆర్‌.సి కమీషన్‌ వేసి జూన్‌ 2న ఐ.ఆర్‌, ఆగస్టు 15న ఫిట్‌మెంట్‌ అంటే ఇంత ఫ్రెండ్లీ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ్కెనా ఉందా అని ముచ్చటపడ్డారు.

2018 అసెంబ్లీ రద్దుకు ముందు రోజున సెక్రటేరియట్‌లో ఉద్యోగ సంఘాల నాయకులంతా ప్రభుత్వం నుండి పిలుపు వస్తుందని, పి.ఆర్‌.సి ఇస్తారని ఉత్కంఠతో కండ్లు కాయలు కాసేటట్టు ఎదిరి చూస్తే మొండి చేయి చూపి ఎన్నికలకు వెళ్ళినపుడు సోషల్‌ మీడియాలో ఎన్నడు లేనంతగా విమర్శలను, తిట్ల దండకాన్ని సంఘాల నాయకులు ఎదుర్కొన్నా ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ను పల్లెత్తుమాటనలేదు. 2018లోప్రభుత్వం రద్దుకు ముందు జరిగిన ఓ అంతర్గత సమావేశంలో ఓ ప్రజాప్రతినిది ‘‘పి.ఆర్‌.సి ఇవ్వాల్సిన పనిలేదని, వాళ్ళ ఓట్లను కొంటే సరిపోతుంది’అని సెలవివ్వడంతో అప్పటి ప్రభుత్వం పండుగలప్పుడు, జన్మాదినాలప్పుడు అంటూ ఫాయిదాలేని వాయిదాల మీద వాయిదాలు వేసి సంవత్సరాల తరబడి జరుపుతున్నప్పుడు అసలు కథ అర్థమై ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని అన్‌ఫ్రెండ్‌ చేయడం ప్రారంభించారు. పెరిగిన ధరలను చెప్పకుండా ప్రపంచంలో ఎక్కడాలేని జీతాలిస్తున్నామని గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉద్యోగులను ఒక వ్యూహం ప్రకారంగా బదునాం చేస్తూ ప్రజల్లో పలుచన చేసారు. 2023లో ఎన్నికలకు వెళ్ళేప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం సంబంధం లేకుండానే పి.ఆర్‌.సి కమిటీని నియమించడాన్ని స్వాగతించినా, 5 శాతం ఐ.ఆర్‌. ఇవ్వడం, పెండిరగ్‌ డి.ఏలు ఇవ్వకపోవడం ఉద్యోగులను ఏమాత్రం సంతృప్తి పరుచలేదు.

ఒకే ఒక్కసారి సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం తప్ప మళ్ళీ సమావేశమైందీలేదు, సమస్యలను పరిష్కరించిందీలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 10 ఏండ్ల్కెనా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పడకపోవడం ఎంత దురదృష్టకరం! కాంట్రీబ్యూటరీ పెన్షన్‌(సి.పి.ఎస్‌) లాంటి అతిపెద్ద సమస్యపై అసెంబ్లీలో చెప్పుడే తప్ప పరిష్కారానికి నోచుకోలేదు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై దొడ్డు దొడ్డు ఉపన్యాసాలు ఇచ్చిన వారు అత్యంత ఆలస్యంగాన్కెనా కొంత మంది కాంట్రాక్ట్‌ వారిని పర్మనెంట్‌ చేయడం సంతోషించతగ్గ విషయమే అయినా నిబంధనలు, నకీలీల విషయంలో అభాసుపాల్కెంది. ఔట్‌సోర్సింగ్‌ వాళ్లు, ఏ పర్మనెంట్‌కు కూడా నోచుకోకుండానే వందలమంది పార్ట్‌ట్కెమ్‌ స్వీపర్లు చనిపోయారు. దాయాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనుసరించిన పద్ధతులు, ప్రయత్నం లేకపోవడంవల్ల పర్యవేక్షక పోస్టుల్కెన ఎం.ఇ.ఓ, డిప్యూటీ ఇ.ఓ పోస్టులకు ప్రమోషన్లులేక ఇంచార్జీల పాలన వల్ల విద్యావ్యవస్థ పరిస్థితి అట్టడుగుస్థాయికి వెళ్ళిపోయింది. డ్కెట్‌, ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి, సి.టి.ఇ లాంటి సంస్థల్లో 95శాతం పోస్టులు ఖాళీ. కొత్త జిల్లాలు ఏర్పరిచి కొత్త డి.ఇ.ఓ పోస్టులు, అన్ని కార్యాలయాల్లో క్లారికల్‌ పోస్టులు ఇవ్వడం మరువడంతో విపరీతమైన పనిభారం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 371డి ఆర్టికల్‌ రద్దు/మాడిఫై చేయబడి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిపోస్టులు మాత్రమే ఉంటాయని, ముఖ్యంగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కారమై ప్రమోషన్లు వస్తాయని అందరూ భావించినా ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఏది కాలేదు. పరిష్కరించడానికి రాష్ట్రపతి నుండి ఉత్తర్వులు తెచ్చినా, హైకోర్టులో మళ్ళీ కేసులుపడి మూలకుపడి ముప్పై ఏళ్ళ కథ మొదటికి వచ్చింది.

ఈ సమస్య పరిష్కారం కాకుండా పాఠశాల విద్యావ్యవస్థ గాడినపడదని తెలిసినా, పరిష్కారానికిగల అడ్డంకులేమిటి, మార్గాలేమిటి అని గత ప్రభుత్వం చర్చించలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ తెలుగు మహసభల సందర్భంగా హామి ఇచ్చిన భాష పండిట్ల అప్‌గ్రెడేషన్‌, ప్రమోషన్ల సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యతో ముడిపడి ఉన్న ఎస్‌.జి.టిలకు 10వేల పైచిలుకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఇస్తామని ప్రకటించి ఏండ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ప్రతి యం.ఎల్‌.సి ఎన్నికలప్పుడు జి.ఓ లిచ్చి ఓట్లువేయించుకొని బోడిమల్లప్పలను చేయడం ఎన్నిసార్లు జరిగిందో! పాఠశాల విద్యలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా డి.ఎస్‌.సి పెట్టరు. ప్రతినెల నెల ఇచ్చే ప్రమోషన్లను పది సంవత్సరాల్లో రెండు సార్లు, బదిలీలు మూడుసార్లు చేపట్టినా రిలీవ్‌ చేయకుండా అనేక ఇబ్బందులు. 2023 ఉపాధ్యాయ బదిలీలు, కొత్తగా టెట్‌ సమస్య వచ్చిపడి ప్రమోషన్లు ప్రహసనంగాసాగి మధ్యలోనే ఆగిపోయాయి. అన్నింటికి యుద్ధాలు చేయాల్సిందే! జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైతే సెప్టెంబర్‌ వరకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చెయ్యరు, విద్యావాలేంటర్లను ఇవ్వరు. మరి పాఠశాలల మీద ప్రజలకెట్లా విశ్వాసం పెరుగుతుంది? గురుకులాలు, మోడల్‌ స్కూళ్ళ ఉపాధ్యాయుల సమస్యలు వినే నాధుడేలేడు! అధికారం ఆ శాఖామంత్రి, అధికారుల చేతుల్లోలేక అంతా కేంద్రీకృతం. తుమ్మినా, దగ్గినా ఫైలు సి.ఎం.వోకు వెళ్ళాలే రావాలే. 398తో అపాయింట్‌ అయిన ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్‌ ఇస్తామని ప్రకటించి ప్రభుత్వం మాటతప్పింది. ఓ డి.ఎస్‌.సి వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చే వరకు అందుబాటులో ఉండుమని డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చిన నాటి ముఖ్యమంత్రిమాట నీళ్ళమూటే అయ్యింది. 2007 నాటి 2లక్షల మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ సీలింగ్‌ను ఎత్తివేయరు, సవరించరు. ఎన్నికలప్పుడు క్యాష్‌లెస్‌ కార్పోరేట్‌ హెల్త్‌ స్కీమ్‌ బయటకు వస్తుంది, అయిపోగానే మూలకుపడుతుంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు మరణించినపుడు కర్మలు నిర్వహించుటకు 15 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని, మెమో నెం.26559ని రద్దు చేసి జి.ఓ.నెం.342 ప్రకారంగా ఎస్‌.సి., ఎస్‌.టి ఉపాధ్యాయులకు ఉన్నత విద్యాభ్యాసానికి ఓ.డి సౌకర్యం కల్పించాలని మానవత్వం ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. 2016 వేసవిలో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు 24 సంపాదిత సెలవులు మంజూరు చేయలేదు.

అప్పటి సి.ఎస్‌ నాయకత్వంలోని ఓ ఐ.ఏ.ఎస్‌ అధికారుల బృందం కుట్రపూరితంగా స్థానికతను మరిచి సీనియారిటీ ప్రాతిపదికన రాత్రికి రాత్రే మెడమీద కత్తిపెట్టి ఉద్యోగులను, ఉపాధ్యాయులను చెట్టుకొకరు పుట్టకొకరినిచేసి కుటుంబాలను ఛిన్నాభిన్నంగా మార్చిన 317 జి.ఓను అమలుచేసి ప్రభుత్వం ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఈ జి.ఓ అమలు వల్ల దూరపు జిల్లాలకు వెళ్ళినవాళ్లు సంతృప్తిగాలేరు, స్వంత జిల్లాకు వచ్చిన వాళ్ళు తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. 1975 పద్ధతిలో జిల్లాలకు కెటాయింపులు చేయకపోవడం వల్ల 40 శాతం పైబడి ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగడంతోపాటు కొత్త సమస్యలు తలెత్తి కోర్టులో నలుగుతున్నాయి. సీనియర్లు, జూనియర్లు అంటూ విడదీసి చీల్చి చెండాడి స్పౌజ్‌లు, నాన్‌స్పౌజ్‌ల మధ్య కయ్యంబెట్టి తన్నుకుంటుంటే తమాషా చూసింది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఆర్టీసి సమ్మెను దారుణాతిదారుణంగా అణచివేతను ప్రారంభించి 317 దాకా కొనసాగించి నరబలులు తీసుకొని బంగారు తెలంగాణ నినాదం ఇచ్చింది మా దొడ్డ ప్రభుత్వం. ఆ అణచివేతను చూసి హక్కులటుంచి జీతాలు ఆలస్యంగా ఇచ్చినా సంవత్సరాల తరబడి మెడికల్‌, జి.పి.ఎఫ్‌, రిట్కెర్‌మెంట్‌ బెనిఫిట్‌ బిల్లుల చెల్లింపులు పెండిరగ్‌పెట్టినా కిక్కురమనకుండా ఉండే ఒక అప్రకటిత నిర్బంధాన్ని చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న సంఘాల నాయకత్వాలను గౌరవంగా చూడకుండా ద్రోహ సంఘాలను అక్కునచేర్చుకొని ఫక్తు రాజకీయం చేసారు.

ఎన్నికైన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5వ తేదీలోగా జీతభత్యాలు చెల్లిస్తామని, సి.పి.ఎస్‌ రద్దుకు, 317 బాధితుల సమస్య పరిష్కారానికి రోడ్డుమ్యాప్‌ ప్రకటించి, పెండిరగ్‌ బిల్లుల చెల్లింపుకు, పెండిరగ్‌ సమస్యల అధ్యయనానికి సానుకూల వైఖరి తీసుకుంటుందని, క్యాష్‌లెస్‌ హెల్త్‌ స్కీమ్‌తో కార్పోరేట్‌ వైద్యం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తుందని, ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకి, బదిలీలు,ప్రమోషన్లకు ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని, సంఘాలను గౌరవిస్తుందని, హక్కులను పునరుద్ధరిస్తుందని, సంఘాలతో సంవత్సరంలో మూడుసార్లైనా సమావేశమై సాదకబాధకాలు తెలుసుకొని ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పి ప్రజలతో అనుసంధానకర్తలుగా ఉద్యోగులను వాడుకొని తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలని తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. చంద్రబాబును దించి వై.ఎస్‌ను, కె.సి.ఆర్‌ను దించి కాంగ్రెస్‌ను గద్దెనెక్కించి ఒక ప్రజాస్వామిక వాతావరణానికి నాందిపలకడంలో చారిత్రాత్మకపాత్ర పోషించిన స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిందే!

-డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు
రాష్ట్ర ప్రధానకార్యదర్శి,
తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *