ప్రజాస్వామ్య విలువలు పలుచబడుతున్నాయా..!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో జరుగనున్న సాధారణ ఐదు రాష్ట్రాల (తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజో రామ్‌) ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. ‘అత్య ంత ఖరీదైన’ ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను ఈ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధి కారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కట్టుకు కూర్చుంటోంది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా చూపిన రుజువులు ఎండమావిలో నీళ్లు అవుతున్నాయి. ధన ప్రవాహంలో ప్రజాస్వామ్యం కొట్టుకుపోతోంది. డబ్బులు, మద్యం పంపిణీ యద్ధేచ్చగా సాగి పోతున్నది. వోట్ల సభలు ప్రజలకు ఉపాధులు అవుతున్నాయి. సాధారణ వోటరు బిత్తరపోయి చూస్తున్నాడు. ఎన్నికల నియమావళి బందీ కావడం, అరాచక రాజకీయ క్రీడల నిస్సిగ్గు చేష్టలను చూసి నివ్వెరపోతున్నాం. తాయిలాల ప్రకటనల్లో పార్టీలు రెచ్చిపోతున్నాయి.
వేలంలో వోటు:
‘ధనమూలమిద్దం జగత్‌’ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. వోటు అంటే వేలంలో కొనుక్కోవడమని తెలుస్తున్నది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడిరది మాత్రం ప్రజాస్వామ్యమే అని విధితం అవుతున్నది. కోట్ల నోట్లు ఇంటింటికీ వరదలా ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని బరితెగించి బజారుకు ఈడుస్తున్నారు. పార్టీలు, సిద్ధాంతాలు, అభ్యర్థుల సచ్ఛీలతలు, అసంబద్ధ ఎన్నికల మానిఫెస్టోలు చెత్త బుట్టలో పడుతున్నాయి. నగదే నవ మంత్రమవుతున్నది. గతంలో డబ్బు పంచడం తెర వెనుక జరిగేది, నేడు బజారున పడడం నిత్యకృత్యమైంది. కుల సంఘాలు, మత సమూహాలు, గ్రామాలకు చుక్క ముక్కల రుచులు చూపడంతో ప్రజలు మద్యానికి శాశ్విత బానిసలుగా మారుతున్నారు. ప్రభుత్వ ఉచిత ‘బంధు’ పథకాల ప్రకటనలు, వర్గాల వారీగా సంక్షేమ పథకాల వరాల జల్లులతో ప్రజలు తడిసి ముద్దైపోతున్నారు. ఎన్నికల పర్యవేక్షకులు, సిసిటివీ కెమెరాలు, పోలీసు/మిలటరీ సాయుధ కవాతులు, ఎన్నికల సంఘ కఠిన నియమనిబంధనలు, జిల్లా యంత్రాంగాలు ప్రేక్షక పాత్రగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యం పట్టపగలే అమ్ముడుపోవడం చూస్తూ నివ్వెరపోతున్నాం.
రెచ్చిపోతున్న ధనస్వామ్యం:
కొందరు సున్నిత ప్రజలు ధైర్యంగా వోటుకు నోట్లను తిరస్కరించడం, అవినీతి నాయకులను ప్రశ్నించడం, మంచి మాటల సంస్కృతికి పట్టం కట్టడం కొంత ఊరటను ఇస్తున్నది. ప్రజాస్వామ్య నిర్వచనమే మారిపోయి ‘నోటుస్వామ్యం’ అయిపోతున్నది. ధనస్వామ్యం దర్జాగా రెచ్చిపోతోంది. ఎన్నికల ప్రచారంలో ఉచిత పథకాల ప్రకటనలు హోరెత్తి పోయాయి. పరస్పర ధూషనలు సర్వసాధారణమయ్యాయి. చీకట్లో జరగాల్సిన నీచ కార్యాలు పట్టపగలే బాహాటంగా జరగడం కంటున్నాం. ‘మా డబ్బే తిరిగి మాకు ఇస్తున్నారని’ వాదించడం వింటున్నాం. కుడి చేత్తో తీసుకొని ఎడమ చేత్తో విదిలిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం చూస్తున్నాం. ఎన్నికల్లో నిలబడటానికి వందల కోట్లు సిద్ధం చేసుకోవడమే అర్హతని, సామాన్యులు ఎన్నికల్లో పోటీపడడానికి అనర్హులని అర్థం అవుతున్నది.
వోటే వజ్రాయుధం:
ఇప్పటికైన జాతీయ/ప్రాంతీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పథకాలు, పాలన సామర్థ్యాలపైన మాత్రమే వోట్లను ఆకర్షించడానికి తలుపులు తెరవాలి. డబ్బు ఆశ చూపి గెలిచినా, ప్రజల దృష్టిలో ఓడినట్లే అని తెలుసుకోవాలి. నోట్ల పంపిణీతో గెలిచిన అభ్యర్థులు అనేక రెట్లు సంపాదనకు దారులు తెరుస్తారని అవగాహనకు రాకపోతే ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధి గాల్లో దీపాలవుతాయనేది వాస్తవం. ఎన్నికల సంఘం నియమనిబంధనల కొరడా జులిపించాలి. అసలైన సేవకులైన నాయకుల్ని మాత్రమే గెలిపించాలి. నోట్లను ధిక్కరించే వజ్రాయుధ వోట్లను సాసబట్టాలి.
అఖండ భారత ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం చేయాలి. ప్రజలే రాజులుగా నాయకులే సేవకులుగా మారాలి. మనం కలలు కన్న రామరాజ్య స్థాపన నిక్కంగా సత్వరమే రావాలి. ప్రజాస్వామ్య విలువలకు ప్రజలే ఘనసన్మానం చేయాలి. నోటుస్వామ్యం అంతరించి ప్రజాస్వామ్య పునర్‌ ప్రతిష్ట జరగాలి. గాంధీ కలలు కన్న భారతాన్ని ఆవిష్కరించాలి.

image.png

మధుపాళీ
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *