ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పట్టణ వోటరు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి వోటర్లు  మరోసారి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేశారు. వోటర్లను ఆకట్టుకునేందుకు నెలల తరబడి అవగాహన కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు సోమవారం పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాల్లో వోటర్లకు దిశానిర్దేశం చేసేందుకు  స్టాళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్‌ చాలా పోలింగ్‌ స్టేషన్లలో  రాజకీయ పార్టీ కార్యకర్తలు, ఏజెంట్లు, ఎన్నికల అధికారులు, పోలీసులు, సహాయక సిబ్బంది  మాత్రమే కనిపించారు. దురదృష్టవశాత్తూ, వారి సమయం  గణనీయమైన భాగం వోటరు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి.  50 శాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అత్యల్పంగా 39.17 శాతం, సికింద్రాబాద్‌ లో 42.48 శాతం, మల్కాజ్గిరి లో 46.27 శాతం పోలింగ్‌ నమోదైంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 47.88 శాతం పోలింగ్‌ నమోదైంది. సామజిక మాధ్యమాలలో ట్విట్టర్‌, వాట్స్యాప్‌. ఇంస్టాగ్రామ్‌ లో  ‘హైదరాబాద్‌’ అని సెర్చ్‌ చేస్తే, మనకు  కనిపించే  ట్వీట్లలో, పోస్టుల్లో ఎక్కువగా కనిపించేవి  ఒకటి తమ విధులను నిర్వర్తించనందుకు ప్రభుత్వాన్ని తిట్టిపోసే వారు, రోడ్ల పై  డ్రైనేజీ నీరు ఫోటోలు,   రోడ్లపై చెత్తాచెదారం కావచ్చు, కరెంటు కోతలు కావచ్చు, దారుణమైన రోడ్లు లాంటివి ఎత్తి చూపడానికి  హైదరాబాదీలు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి వెనుకాడరు, ఇలాంటివి చూసినప్పుడు సమాజం చాలా చైతన్య మయింది అనే భ్రమలో ఉన్నారు .

అయితే వాస్తవంగా తమ గళం వినిపిస్తారని భావించిన రోజు సగానికి పైగా వోటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఎక్కడా కనిపించరు.  హైదరాబాద్‌ లో వోటరు ఉదాసీనత చాలా కాలం  నాటిది. కొన్ని కారణాల వల్ల ఈ పట్టణ మహానగరం ఇటీవలి కాలంలో సరైన పోలింగ్‌ శాతాన్ని సాధించలేకపోయింది.  2019 లోక్‌ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం కేవలం 46.5 శాతం, హైదరాబాద్‌, మల్కాజిగిరి లో 44.84 శాతం, 46.93 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది.  2014లో కూడా ఈ స్థానాలకు 51 నుంచి 53 శాతం మధ్య పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలో కేవలం 47.88 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది.   వోటు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పలుమార్లు చొరవ చూపడంతో ఈ నిరాశాజనక గణాంకాలు నమోదయ్యాయి. ఈసారి నగరంలో సిస్టమాటిక్‌ వోటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌) కార్యక్రమాన్ని ప్రహసనంగా  పెద్ద ఎత్తున నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది.  అభ్యర్థులతో  ముఖాముఖీ చేపట్టే  పౌర సంస్థలు ఎక్కడా కార్యక్రమాలు నిర్వహించలేదు.  నిఘా వేదికలు, వోటరు చైతన్య సంస్థలు   కేవలం  పత్రికా ప్రకటనలకు, వాట్సాప్‌ సందేశాలను షేర్‌ చేయడం తప్ప పెద్దగా  చేయగలిగింది ఏమి లేదు.

పట్టణ వోటర్ల ఉదాసీనతను తిప్పికొట్టే ప్రయత్నంలో, చెప్పుకోదగ్గ మార్పును రాష్ట్ర ఎన్నికల సంఘం  ఏర్పాటు చేయలేదు . మల్టీ నేషనల్‌ కంపెనీలు,  కార్పొరేషన్లు తమ ఉద్యోగులలో వోటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు   చర్యలు,  అవగాహన కార్యక్రమాలు, వోటర్‌ చైతన్య యాత్రలు, ప్రజాస్వామ్యంలో వోటరు పాత్ర అలాగే మెరుగైన సమాజానికి  దోహదపడే చర్యలు గురించి కార్పొరేట్‌ ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా చతికిలపడిరది.  చిరునామా వివరాలను నవీకరించడం వంటి సాధారణ సమస్యలను పరిష్కరించడానికి సహాయం అందించి, అలాగే పోలింగ్‌ స్టేషన్లో మెరుగైన వసతులు ఉండేట్లు చూసి,  హైదరాబాదులో వోటు హక్కు ఉన్నవారు తమ వోటు హక్కును వినియోగించుకునేలా ప్రేరేపించడంపై తక్షణ దృష్టి కేంద్రీకరించబడినప్పటికీ, ఇతర రాష్ట్రాల ఉద్యోగులు వారి వోట్లను వారి ప్రస్తుత నివాస స్థలానికి బదిలీ చేయడానికి వీలు కల్పించడం దీర్ఘకాలిక లక్ష్యం.

హైదరాబాద్‌, తరచుగా మినీ ఇండియాగా పిలువబడుతుంది, దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వారిలో చాలా మందికి వారి స్థానిక రాష్ట్రాలలో వోటు హక్కు ఉంది, స్థానిక ఎన్నికల ప్రక్రియలలో వారి ప్రమేయాన్ని పరిమితం చేస్తుంది. వోటు వేసే కొద్దిమంది ఎలక్టోరల్‌ రోల్స్‌లో తమ పేర్లు లేకపోవడాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు,  టర్నౌట్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌ ,  సిస్టమాటిక్‌ వోటర్‌ ఎడ్యుకేషన్‌తో ప్రారంభమైన పోల్‌ వాచ్‌డాగ్‌   అలాగే   2010లో ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌ ) కార్యక్రమం ఫలితంగా 2014 లోక్‌సభ ఎన్నికలలో భారతదేశం వోటింగ్‌ రికార్డును సృష్టించింది.  2009లో, వోటింగ్‌ శాతం 58%గా ఉంది, ఇది 2014లో 66.4%కి పెరిగింది,  2019లో 67.6%కి పెరిగింది. ఇప్పుడు, ఎలెక్షన్‌ కమిషన్‌  దానిని 70% దాటాలని భావిస్తోంది. భారత ఎన్నికల కమిషన్‌ టర్నౌట్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌ ద్వారా వోటర్లకు చేయూత నిస్తుంది  ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో  వోటింగ్‌ శాతాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన వోటర్‌ ఔట్రీచ్‌ కార్యక్రమం. నాలుగు కీలక రంగాలపై దృష్టి సారించడం ద్వారా వోటరు వోటింగ్‌ శాతాన్ని 70% దాటించడమే దీని లక్ష్యం. ఈ ప్రక్రియలు అన్నీ  వోటరు వద్దకు  తీసుకెళ్లడంలో ఎన్నికల సంఘం పూర్తిగా  విఫలమైంది.  ఎన్నికల కమిషన్‌ కు చాలా అధికారాలు, హక్కులు ఉన్నా  పనితీరులో  చాలా పేలవంగా ఉంటున్నది.

తప్పుడు అఫిడవిట్ల విషయంలో, అభ్యర్థులు డబ్బు ఖర్చు చేసేటప్పుడు సరైన  రిజిస్టర్‌ మైంటైన్‌ చేయకపోవడం,  ఎక్స్పెండిచర్‌ అబ్జర్వర్లు  ఉత్సవ విగ్రహాలుగా  ఉండడం. నామినేషన్‌  రోజున ర్యాలీ  వందల సంఖ్యలో  వాహనాలు రావడం, కొన్ని చోట్ల  ఏనుగులు, ఒంటెలు  వినియోగించడం, కరపత్రాలు, హోర్డింగ్‌ లపై  ప్రచురణ కర్త పేరు లేకపోవడం, ప్రధాన కూడళ్లలో  ఇబ్బందికరంగా ఫ్లెక్సీలు ఉండడం, బహిరంగ ప్రదేశాలలో   మద్యం వినియోగం ఏరులై పారుతున్న  పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒక్క వాహనానికి  పర్మిషన్‌ తీసుకుని పదుల  వాహనాలలో డీజే సాంగ్స్‌,  విపరీతమైన ధ్వని కాలుష్యం ఉన్నా పట్టించుకోరు.

డబ్బు మద్యం వస్తువులు బహుమతులు  నిర్వాసిత ప్రాంతాలలో మద్యం, భోజనాలు అరికట్టలేక పోతున్నారు.  రెసిడెన్షియల్‌ ఏరియాల్లో  బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నారు.  సమయం సందర్భం లేకుండా  ఖర్చు చేస్తున్న అభ్యర్థులను నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. పట్టణ ప్రాంతాలల్లో  వోటింగ్‌ శాతం పెంచడానికి  డిమాండ్‌ లేని  స్టార్‌ క్యాంపెయినర్‌ పేరుతో వచ్చి రాని  తెలుగులో ఫోన్‌ సందేశాలకు  లక్షలు లక్షలు వెచ్చిస్తున్నారు కానీ  ప్రతిసారి వోటింగ్‌ పెంచడంలో విఫలమయ్యారు.   ఎన్నికల సమయంలో ఎవరైనా  సమాచారం ఇచ్చినప్పుడు దానికి  దీటుగా  టాస్క్‌ ఫోర్స్‌  చర్యలు లేకుండా ఉంటున్నాయి. వోటరు చైతన్యం కొరకు ఏర్పాటు చేయవలసిన సమావేశాలు నిర్వహించరు.  ఎవరైనా  స్వచ్చంధ సంస్థలు  ఏర్పాటు చేస్తే  వాటికి చుట్టపు చూపుగా వెళ్లడం తప్ప, విద్యార్థులను  ప్రోత్సహించి ప్రజాస్వామ్యం పై  పనికొచ్చే  పోటీలు  నిర్వహించరు.  పాటలు బహుళ ప్రాచుర్యం చేయమని  ఎంతో శ్రమకోర్చి ఇస్తే  ఇంతవరకు  జిల్లా ఎలక్టోరల్‌ ఆఫిసర్లకు  పంపలేదు.  చిత్తశుద్ధి లేని అధికారులను ఏమనాలి..?
-డా.ముచ్చుకోట సురేష్‌బాబు,
అధ్యక్షులు, ప్రజాసైన్స్‌ వేదిక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *