- ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
- కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపై ‘నిగాహ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
- ప్రజా సంఘాల పోరాటం వల్లనే తెలంగాణ వొచ్చింది.. ప్రొఫెసర్ రమా మెల్కొటే
- రేవంత్ ఇచ్చిన ఏడో హామీ’ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ని నెరవేర్చాలి –వీక్షణం సంపాదకులు వేణుగోపాల్
- ప్రజా సంఘాలను పట్టించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయడం లేదు–ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కే.శ్రీనివాస్
- ప్రభుత్వంలో ప్రజాసంఘాల పాత్ర ఉండాలి–ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్ తెలంగాణ వొచ్చినప్పటినుంచి ప్రశ్నించడం ఆపలేదు–సామాజిక కార్యకర్త సజయ
- వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఏ మాత్రం అప్రమత్తత లేదు–పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 30 : గత ప్రభుత్వం విడిచిపెట్టిన చెప్పుల్లో ఈ ప్రభుత్వం కాలు పెట్టి వెళ్తుందని పలువురు వక్తలు అన్నారు. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా వంద రోజుల ప్రభుత్వ పాలన సాగిందని అన్నారు. ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ పాలన ఐనా ఏమైనా మార్పు తెస్తుందా? అని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం సైఫాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రిసోర్స్ సెంటర్ లో ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్ అజయ్ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనపై ప్రజాసంఘాల నిగాహ్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ప్రొఫెసర్ రమా మెల్కొటే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ప్రొఫెసర్ ఎ.కోదండరామ్ మాట్లాడుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారికంగా ఆరు హామీలు ప్రకటించాయి. కానీ ఏడో హామీగా సీఎం రేవంత్ రెడ్డి ‘ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని’ తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తొమ్మిది సార్లు నొక్కి చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే వందేళ్ళ నుంచి పోలీసు రాజ్యం యధావిధిగా కొనసాగుతుందన్నారు. శాంతి భద్రతల పేరు చెప్పి పోలీసులను పదేపదే తీసుకురావద్దని అన్నారు. ఈ వంద రోజుల్లో పోలీసు వ్యవస్థ లేని కార్యక్రమాలు జరగలేదని అన్నారు.

ధర్నా చౌక్ పునరుద్ధరించామని కాంగ్రెస్ చెప్తుందని అయితే గత ప్రభుత్వ హయాంలోనే కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. పోలీసు రాజ్యమే కొనసాగుతుందని ఎన్ఐఏ, ఈడి, ఐటి దాడులు జరుగుతున్నాయని అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ విషయంలో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి అమానుషం అన్నారు. ఊరేగింపుల పర్మిషన్ విషయంలో పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటేనని అన్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా ఊరేగింపులకు అనుమతి ఇవ్వాలని కోరారు. పి.ఆర్.ఐ పేరుతో ముస్లిం యువకులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఎస్ఐబి అనేది ఒక హంతక సంస్థ అని అన్నారు. మితిమీరిన అధికారాలు ఎస్ఐబికి ఇచ్చారని అన్నారు. పదేళ్ల ఎస్ఐబి పనితీరును సీఎం సమీక్షిస్తారా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు డా. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాసంఘాలను పట్టించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పని చేస్తుందన్న నమ్మకం లేదని అన్నారు. తెలంగాణలో పరిస్థితులు బాగా లేవని అన్నారు. ఉత్తర తెలంగాణలో మతతత్వం బాగా వ్యాప్తి చెందిందని అన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బిజెపి వాతావరణం ఏర్పడదని అన్నారు. కాంగ్రెస్ తనకు బలాన్ని చేకూర్చుకునే ప్రయత్నంలో ఉందని అన్నారు. నేటి నాయకులు అధికారం లేకుండా పది రోజులు కూడా ఉండలేక పోతున్నారని అన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని ఖాలీ చేస్తుందని అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత నిజమైన పాలన కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు తమ అనుభవంలోకి వొచ్చిన సమస్యలను లేవనెత్తాల్సిందేనని సూచించారు. ఉన్నప్పుడే ప్రభుత్వాలకు ప్రజల సమస్యలు గుర్తుకు వొస్తాయని అన్నారు. 100 రోజుల పాలనలో రైతుబంధు 92 శాతమే పంపిణీ చేశారని అన్నారు. కెసిఆర్ అనుభవించిన కంఫర్ట్ సీఎం రేవంత్ రెడ్డికి రాలేదని అన్నారు. ఏడవ గ్యారెంటీ అమలు అవుతుందని గ్యారెంటీ లేదని అన్నారు. ప్రజా సమస్యలపై ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉండాలన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వనరులు లేవని ఒకే ఐఏఎస్ కు 7 శాఖలు ఇవ్వడం దీనికి నిదర్శనం అన్నారు. బయటి వాళ్లు వొచ్చేందుకే మంత్రిత్వ శాఖలను ఖాలీ గా ఉంచారని అన్నారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యవస్థ మారింది అనుకోవడం పెద్ద భ్రమ అని అన్నారు. భయంకరమైన పరిస్థితి నుంచి బయట పడాలంటే దేశంలో బిజెపిని ఓడించాలన్నారు. ప్రజా సంఘాల పోరాటం వల్లనే తెలంగాణ వొచ్చిందని అన్నారు. కొత్త ప్రభుత్వం వొచ్చిన వెంటనే విప్లవత్మక మార్పులు వొస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు. నిరంతృత్వ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని అన్నారు. 30 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు మూసిని ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. కానీ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై ఎంత ఖర్చు అయ్యింది అనేది ఎవరికీ తెలియదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సంప్రదించి ప్రాజెక్టు తయారు చేస్తే బాగుంటుందన్నారు. రైతులకు ఎంఎస్పి ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారని ఇది నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తారా అని ప్రశ్నించారు. చదువు, విద్య, ఆరోగ్యం పట్ల ప్రభుత్వ విధానాలు మార్చాలన్నారు. చంద్రబాబు కాలంలోనే వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణ అయింది అన్నారు. వికారాబాద్ లో కొత్త ప్రాజెక్టుల కోసం 12 లక్షల చెట్లను నరికారని అన్నారు. ఇది చాలా భయంకరమైన విషయం అన్నారు. జే.ఎన్.యూ ఇఫ్లూలో విద్యార్థులు ఎన్నికల్లో కలిసి పనిచేసి పనిచేసి గెలిచారని అన్నారు.

వాళ్లని చూసి ప్రభుత్వాలు ప్రజా సంఘాలు నేర్చుకోవాలని అన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని వోట్లు అడిగే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రజాసంఘాల పాత్ర ఉండాలని అన్నారు. అలాగే పాలనలో ఒక ప్రతినిధి ఉండాలని అన్నారు. ఉద్యమం లేనిదే తెలంగాణ లేదని అన్నారు. జేఏసీ లేనిదే ఉద్యమం లేదన్నారు. ప్రొఫెసర్ కోదండరాం లేనిదే జేసీ లేదన్నారు. కమిట్మెంట్ ఉన్న నేత కోదండరాం అని అన్నారు. వీలైనంత త్వరగా కోదండరామ్ కు ప్రభుత్వంలో అవకాశం కల్పించాలని ప్రజాతంత్ర తరపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ప్రజాతంత్ర ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ‘నిగాహ్’ కార్యక్రమం ఉంటుందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో ప్రజా సంఘాలన్నీ ప్రారంభంలోనే వ్యతిరేకించాయని , అప్పట్లోనే నిర్బందాలు, అరెస్టులు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక మేడిగడ్డ కుంగిందని, పనికిరానిదని కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇది ప్రజాధనం అని లక్షల కోట్లు వృధా చేయొద్దని సూచించారు. మళ్లీ దాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కునే ప్రమాదం ఉందన్నారు. సామాజిక కార్యకర్త సజయ మాట్లాడుతూ తెలంగాణ వొచ్చినప్పటినుంచి ప్రశ్నించడం ఆపలేదని అన్నారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత మనదేనన్నారు. జెండర్ భాష, వివక్ష లేని భాష చాలా ముఖ్యమన్నారు. ప్రజా సంఘాల క్రియాశీలకంగా ఉంటేనే ప్రభుత్వం మన మాట వింటుందన్నారు.

ప్రజా సంఘాలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. పాసిజంపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి వంద రోజులకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజాతంత్రను అభినందించారు. టీఎస్ కేవీ వెంకటేష్ మాట్లాడుతూ ఆదివాసుల పోడు వ్యవసాయానికి ఒక శాతం మాత్రమే భూమిని ఇచ్చారన్నారు. చెంచులను మైదానాలకు తరలించి వారి అభివృద్ధిని మరిచారన్నారు. నల్లమలను ఫారెస్ట్ అధికారులు ప్రతి చెట్టుకి సీసీ కెమెరా పెట్టారని అన్నారు. అడవిలో ఉన్న చెట్లు, జంతువులు ఎలా మాయమవుతున్నాయో పోలీసులు తెలపాలన్నారు. ప్రకాష్ మాట్లాడుతూ చంద్రబాబు యజమాను రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడని, చంద్రబాబు ఏమో మోడీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నారని అన్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉద్యమకారులకు 250 గజాలు ఇప్పటికి నెరవేర్చలేదని అన్నారు. మహిళా సంఘాల నేత కృష్ణకుమారి మాట్లాడుతూ హింస లేని సమాజం మహిళ హక్కు అన్నారు. లిక్కర్, గంజాయి మహిళా హింసకు కారణమవుతున్నాయని అన్నారు. పబ్బులు , క్లబ్బులు , మాదకద్రవ్యాలు, సారా బట్టిలపై ఉక్కు పాదం మోపితేనే మహిళలపై హింస తగ్గుతుందన్నారు. చాలా గడ్డు కాలంలో ఉన్నామని కలిసికట్టుగా ఎదిరించాలన్నారు. పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య మాట్లాడుతూ వంద రోజులు కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం అప్రమత్తత లేదని అన్నారు. మహిళా సంక్షేమాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. వంద రోజుల్లో సమస్యలు చెప్పుకుందాం అంటే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ప్రజాతంత్ర చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ఉందని .. బిజెపి లాంటి ప్రమాదకరమైన పార్టీతో అప్రమత్తంగా ఉండాలన్నారు. బిజెపి గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై ప్రజాసంఘాలు దృష్టి పెట్టాలన్నారు. ఉచిత విద్య వైద్యంపై ఒత్తిడి తేవాలన్నారు.

ఆర్.వెంకటరెడ్డి(ఎంవీఎఫ్) మాట్లాడుతూ విద్యలో మౌలిక వసతులు కరువయ్యాయని అన్నారు. ప్రొ.సూరేపల్లి సుజాత(దళిత విమెన్స్ కలెక్టివ్) మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీలో అధ్యాపకుల రిక్రూట్మెంట్ చేయడం లేదన్నారు. నిజాయితీల విషయం హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పట్టదని అన్నారు. వెంటనే దళిత ఉమెన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. శ్వేత మాట్లాడుతూ పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. అన్నిటికీ రేషన్ కార్డు ముడి పెట్టారని, మొదట రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు ప్రకటించాలని అన్నారు. యాంత్రీకరణ వల్ల ఉపాధి లేకుండా పోయిందన్నారు. గ్రామాల్లో మహిళల జీవనోపాధికి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అమన్ వేదిక రేణుక మాట్లాడుతూ మహిళలకు ఉమెన్ షేల్టర్ తొలగించారని, ఇళ్ళు ఉంటేనే ఆధార్ కార్డు ఇస్తున్నారని ఇందులో మార్పు తేవాలని అన్నారు. రైతు స్వరాజ్య వేదిక నేత విస్సా కిరణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసిందో బేరీజు వేసుకోవాలని అన్నారు. 2018లో 75 రోజులైన కేబినెట్ విస్తరణ చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద దృష్టిపెట్టి సమీక్షించుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని అన్నారు. వ్యవస్థాగతంగా మార్పులు తీసుకు వొస్తారనేది ముఖ్యం అన్నారు. ప్రజావాణి ద్వారా కొంతవరకు సమస్యల పరిష్కారం జరుగుతుందని అన్నారు. చాలా డిపార్ట్మెంట్లలో పెండింగ్ సమస్యలు ఉన్నాయని అన్నారు. డేటా అంతా పబ్లిక్ లో పెట్టాలని అన్నారు. వ్యవసాయం విద్య కోసం కమిషన్ ఇప్పటికే వేస్తే బాగుండేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. కౌలు రైతులను ఏ ప్రాతిపదికను గుర్తిస్తారో ఇప్పటికీ విధివిధానాలు ఇప్పటికీ రూపొందించలేదని అన్నారు. ఖలీదా పర్వీన్(ముస్లిం సంఘాల జేఏసీ) మాట్లాడుతూ వందరోజుల కాంగ్రెస్ పాలన నిరుత్సాహ పరిచిందన్నారు. సమస్యలపై దగ్గర వాళ్ళని సంప్రదించి అదే నిజం అనుకోకూడదని అన్నారు.

మైనార్టీ వెల్ఫేర్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు పూర్తి తెలంగాణకు వర్తిస్తుందన్నారు. అది చేస్తాను అది చేస్తాం అనడం కాదు ప్రజలకు ఏం కావాలో అడిగి తెలుసుకుని సదుపాయాలు కల్పించాలన్నారు. మైనార్టీ బడ్జెట్ సరైన విధంగా చేయడం లేదని అన్నారు. రూబీనా మాట్లాడుతూ మైనార్టీలకి ఇచ్చిన ఏ హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు రాజ్యాంగం పట్ల అవగాహన లేదని అన్నారు. తెలంగాణలో మూడవ తరగతి పిల్లలు 12 శాతం మందికి మాత్రమే రాయడం, చదవడం తెలుసని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాక ముందు విద్యకు 10 శాతం ఉన్న బడ్జెట్ ప్రత్యేక తెలంగాణలో 6 శాతానికి దిగజారిందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సమూన్నత మాట్లాడుతూ ఉన్నత విద్యలో గత పది సంవత్సరాలుగా డ్రాప్ అవుట్ లు పెరిగిపోయాయని అన్నారు.

గతంలో 24 ప్రొఫెసర్లు ఉంటే ఇప్పుడు కేవలం ఏడు మందికి ఉన్నారని అన్నారు. స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు, మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. రచన ముద్రబోయిన(మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీ) మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్టెన్ ట్రాన్స్ జెండర్ సంక్షేమం రూ.20 కోట్ల బడ్జెట్ ఉండేదని అన్నారు. రాను రాను అది రూ.60 లక్షల నుంచి రూ.2 కోట్ల బడ్జెట్ గా మారిందన్నారు. ట్రాన్స్ జెండర్ ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ నేత అశోక్ మాట్లాడుతూ నేటికీ విద్యాశాఖ మంత్రిని ప్రకటించకపోవడం విద్యా వ్యవస్థను చిన్నచూపు చూడడమే అన్నారు. 6 శాఖలకు కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి అదనంగా విద్యాశాఖ అప్పజెప్పడం శోచనీయమన్నారు. కనీసం ఒక గంట సమయం కూడా విద్యాశాఖకు ఆ కార్యదర్శి కేటాయించడం లేదని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు. విద్యాశాఖకు సంబంధించి నేటి వరకు ఒక సమీక్ష సమావేశం నిర్వహించలేదని అన్నారు.

సత్యవతి కొండవీటి(భూమిక కలెక్టివ్) మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పోలీసుల తీరు మారడం లేదని అన్నారు. క్రైమ్ రివ్యూ మీటింగ్ జరగకపోవడం ఒక లోపం అన్నారు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, మూడు నెలలకు ఒకసారి క్రైమ్ రివ్యూ మీటింగ్ జరపాలన్నారు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ గల్ఫ్ జేఏసీ నేత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్నేషనల్ వర్కర్స్ కు చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. మైగ్రేషన్ పాలసీ రూపొందించాలని అన్నారు. ఏ కారణం చేతనైనా చనిపోతే రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. దళిత బహుజన ఫ్రంట్ నేత పి.శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 30 వేల మందికి దళిత బంధు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అంబేద్కర్ భరోసా పేరుతో రూ.10 లక్షలు ఇస్తామని నేటికీ చడి చప్పుడు లేదన్నారు. వంద రోజుల్లో దళితులకు ఇచ్చిన దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు.

రైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ నియంతృత్వ పాలనను దించామని, కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను తన పత్రికా వ్యాసాలతో ఖండిస్తున్నానని తెలిపారు. సమస్యలపై 40 ఏళ్లుగా ప్రజాసంఘాలు గళం విప్పుతూనే ఉన్నాయని అన్నారు. ఫాసిజం, నియతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. వికలాంగుల నేత వసుంధర మాట్లాడుతూ అంబేడ్కర్ కూడా గుర్తించని వర్గం ఉంది అంటే అది వికలాంగులు అని అన్నారు. వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇచ్చి ఎందుకు పనికిరాని వాళ్ళుగా తమను చూస్తుందని అన్నారు. పదేళ్ల పాలనలో గత సీఎం కేసీఆర్ వికలాంగుల మొహం చూడలేదని అన్నారు. వికలాంగులకు ఇప్పటికీ ఎక్కడ కూడా టీ హబ్ లో సైతం మౌలిక వసతులు లేవని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది వికలాంగులు ఉంటే 5 లక్షల ఐదు లక్షల మందికి మాత్రమే వోటు హక్కు ఉందని అన్నారు. ఫ్రీ బస్సును వికలాంగులు ఎలా వినియోగించుకుంటారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని అన్నారు. 80 శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారని 35 శాతం మందిని ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. హెచ్ఆర్ఎఫ్ కార్యకర్త బాలరాజు మాట్లాడుతూ ధరణి కంటే ముందు వ్యవస్థ బాగాలేదన్నారు. ధరణి అనేది చట్టబద్ధతలేని ఆకాశ రామన్న .. ఫిలిప్పీన్స్ కంపెనీకి కట్టబెట్టిందని అన్నారు.

కౌలు రైతు ప్రతినిధి కొండల్ మాట్లాడుతూ క్రాఫ్ ఇన్సూరెన్స్ కోసంమే నెలలోనే నోటిఫికేషన్ రావాలన్నారు. పలు వివరాల కోసం ఆర్టిఐని కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్లైన్ లో రిప్లై ఇవ్వడం లేదని అన్నారు. ఆరు గ్యారంటీలను చట్టబద్ధత చేయాలని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో 14 స్కీములు ఉన్నాయని, వీటికి చట్టబద్ధత కల్పించాలన్నారు. పంట నష్టంపై స్పష్టమైన లెక్కలు తీయాలని అన్నారు. సామాజిక కార్యకర్త ఫరూక్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందించాలని ఆశిస్తున్నానని అన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నేత మంజుల మాట్లాడుతూ గృహ కార్మికులకు గుర్తింపు లేదని అన్నారు. చిన్నచూపు, లైంగిక వేధింపులకు గురవుతున్నారని అన్నారు. గృహ కార్మికులకు రక్షణకు గత ప్రభుత్వాలు చట్టాలు తీసుకురాలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఒక్క డిమాండ్ కూడా పెట్టలేదన్నారు. తమకు ఈఎస్ఐ కార్డుతోపాటు 55 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం, వారానికి ఒక సెలవు కల్పించాలన్నారు. లోకల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాడిపంటలను పట్టించుకోలేదని అన్నారు. రైతులకు ఆవులు, గేదెలు ఇచ్చినట్లయితే వ్యవసాయానికి బాగుంటుందన్నారు. అసైన్ భూముల్లో వ్యవసాయం చేస్తున్న ఎస్సీ, ఎస్టీలకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పరిశ్రమలు ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాలన్నారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు. మోర్ ఫుడ్స్ అలీమ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి పరిధిలో దాటి సపోర్ట్ చేశామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కోసం వందల సంఖ్యలో ఎన్జీవోలు పనిచేశాయన్నారు. గార్బేజ్ కలెక్టర్స్ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నేటి విద్యా వ్యవస్థ అట్టడుగు స్థాయికి పడిపోయింది అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడు హయతుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చినప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం అవుతూనే ఉందన్నారు.

కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అని గత ప్రభుత్వానికి ఏనాడో చెప్పమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు పరిశీలించకుండా పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భూ నిర్వాసితుల కోసం న్యాయ పోరాటం చేశామని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, రైతు స్వరాజ్య వేదిక, నిరాశ్రయ శ్రామిక సంఘం, ప్రవాసి మిత్ర లేబర్ యూని యన్, గృహ కార్మికుల సంఘం, గార్బేజ్ వర్కర్స్ యూనియన్, మల్లన్నసాగర్ నిరా శ్రయుల వేదిక, డొమెస్టిక్ వర్కర్స్ యూని యన్, టీపీటీఫ్, మానవ హక్కుల వేదిక, తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ, సఫా సొసైటీ, గ్రామ్య, దళిత స్త్రీ శక్తి, కోవా, భూమిక, డీబీఎఫ్, ఎన్ఎఫ్ఎడబ్ల్యు, సిసిసి, నేలమ్మా మహిళా రైతుల సంఘం, మహి ళా రైతుల హక్కుల సంఘం, అమన్వేదిక, ఇంకా ఇతర సంఘాల ప్రతినిధులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.



