కాంగ్రెస్ నేతలకు తొందరెక్కువైంది…
హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు
బిఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫైర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 26 : ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారనీ, ప్రచారంలో అన్నీ అబద్ధాలు చెప్పారనీ, ఇప్పుడేమో పాలనలో అసహనంతో మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలో గల బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఉచ్చ ఆగడం లేదని ఒకరు, చెప్పుతో కొడతామని ఒకరు అంటున్నారనీ వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు తొందరపాటు ఎక్కువైందనీ, ఎంతసేపు తమ మీద బురద జల్లడం మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో దృష్టి సారించాలన్నారు. పాలన మొత్తం అసహనం వ్యక్తం చేస్తున్నారనీ, జర్నలిస్టులపైనా, ప్రతిపక్షాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయనీ, నోటిఫికేషన్ రాకముందే హామీలు అమలు చేయాలని డిమాండు చేశారు. తమకు ఓపిక ఉందని, ప్రజల కోసం ప్రశ్నిస్తామనీ, ప్రతిపక్షాలపై బురద జల్లడంపైనా, కుట్రలు చేయడంపై దృష్టి పెట్టారన్నారు. గెలిచిన వాళ్లకు ప్రతిపక్షాలను కలుపుకునిపోయేలా ఓపిక ఉండాలన్నారు.
ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే దుందుడుకు స్వభావంతో కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నారన్నారు. అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారనీ, తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నది వారు కాదా అని అడిగారు. తెలంగాణా తెచ్చిన కేసీఆర్ పట్ల మీ భాషా అలాగే ఉంటుందా…అని నిలదీశారు. తెలంగాణా ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, తగిన గుణపాఠం చెబుతారన్నారు. హామీలు అమలు చేయాలని కోరుతున్నామనీ, ప్రజలు మీరిచ్చిన బాధ్యత మీరు నిర్వర్తించాలన్నారు. మాకిచ్చిన బాధ్యత మేం నిర్వహిస్తామనీ, మార్చి 17వ తేదీకి వంద రోజులు నిండుతుందనీ, అంతలోపు ఎన్నికల కోడ్ వొస్తుందన్నారు. మహిళా విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్నీ అమలు చేశామంటే ఏలా…అని ప్రశ్నించారు. ఒక్క మహిళలకు మూడు హామీలు ఉన్నాయనీ, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా వివరణ ఇవ్వాలని, ఎప్పటి నుండి అమలు చేస్తారో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్‌కు ముందే హామీలు అమలు చేయకపోతే దాటవేసినట్లే అని హరీష్‌రావు తెలిపారు.




