ప్రక్షాళన దిశగా కాంగ్రెస్‌

‘‘‌పార్టీలో నూతనోత్తేజం కలిగించేందుకు కొత్తవారిని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే సామర్థ్యంగల యువ కిశోరాలకు ఆయా పదవులను అప్పగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఆయన ఎన్నికల సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యువకులకు అత్యంత ప్రాధాన్యత నివ్వనున్నట్లు స్వయంగా చెప్పిన విషయం తెలియందికాదు.’’

‌కాంగ్రెస్‌ ‌పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీ, రాహుల్‌గాంధీ తదితరులు హాజరైనారు. దీంతో దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్షులు కావడం ఇదే మొదటిసారి. ఇరవై నాలుగేళ్ళ క్రితం నాటి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి నుండి బాధ్యతలు స్వీకరించిన సోనియాగాంధీ నేటి వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. మధ్యలో కొంతకాలం రాహుల్‌గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, ఆ పదవిలో ఇముడలేక పోయాడు. రాహుల్‌ను ఏ విధంగానైనా ఒప్పించి తిరిగి ఆ పదవిలో కొనసాగేట్లు చూడాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలంతా చాలాకాలం ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో ఆ బరువు బాధ్యతలన్నీ సోనియాగాంధీయే మోయక తప్పలేదు. సోనియాగాంధీ, రాహుల్‌ల నేతృత్వంలో పార్టీ బలోపేతం కావాల్సి ఉండగా క్రమేణా క్షీణిస్తూ వచ్చింది. నరేంద్రమోదీ ప్రధాని కావడానికి ముందు గత దశాబ్ధకాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కుంచించుకు పోయింది. ఒకప్పుడు పదుల స్థానంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి.

అందుకు పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్న మాట చాలాకాలంగా విని పిస్తున్నా జరిగింది మాత్రం ఏమీ లేదు. సోనియా, రాహుల్‌ ‌గాంధీలు మార్పుకోసం చేసిన ప్రయ త్నాలుకూడా ఫలిం చలేదు. ఇప్పుడు ఆ పదవిని పార్టీ సీనియర్‌ ‌నాయ కుడు, గాంధీ కుటుంబానికి సన్ని హితుడు మల్లిఖార్జున ఖర్గే చేప ట్టారు. సోనియాగాంధీ, రాహుల్‌ ‌గాంధీలు చేయలేని పనిని, వారి ఆలోచనలను ఖర్గే తప్ప కుండా అమలుచేసే అవకా శాలున్నాయన్న భావన ఉంది. ఖర్గేపైన ఆ నమ్మకం తోనే దేశవ్యాప్త కాంగ్రెస్‌ ‌నాయకులు ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. ఆయనకు బాధ్యతలు అప్పగించే సమయంలో సోనియాగాంధీ ఖర్గే సారధ్యంలో పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. సాధారణ కార్యకర్తనుండి పార్టీ అధ్యక్ష స్థానానికి ఎన్నికైన ఖర్గే ఇంతకాలం పార్టీలోని ఉత్తాన పతనాలు చవిచూశారని, ఆయన అనుభవాన్ని రంగరించి పార్టీకి పూర్వ వైభవాన్ని కలిగిస్తాడన్న ఆకాంక్షను ఆమె వెలిబుచ్చారు. అయితే అనేక రాష్ట్రాల్లో తన ఆధిపత్యంతో వేళ్ళూనుకున్న భారతీయ జనతా పార్టీని ఖర్గే ఏ మేరకు ఎదుర్కోగలడన్నదే ఇప్పుడు ప్రధానాంశం. 137 ఏళ్ళ కాంగ్రెస్‌ ‌పార్టీ భవిష్యత్‌ను ఎనభై ఏండ్ల ఖర్గే చేతిలో పెట్టారు. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో పార్టీ అంతర్ఘత విబేధాలతో కొనసాగుతున్నది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బిజెపి ఆకర్ష్ ‌మంత్రంతో వాటిని కోల్పోవాల్సివచ్చింది.

అందుకు కారణం పార్టీలో విభేదాలు ఒకటైతే, బిజెపి అందిస్తున్న తాయిలాలు బాగా పనిచేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ ‌గహ్లోట్‌కు, మంత్రి సచిన్‌ ‌పైలట్‌కు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. అక్కడ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరికొంతకాలం ఇలానే కొనసాగితే సచిన్‌ ‌పైలట్‌ ‌లాంటి మరో యువ నాయకుడిని కాంగ్రెస్‌ ‌కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని సరిదిద్ది వారందరిని ఒక తాటిపైకి తీసుకురావాల్సిన గురుతర బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పటికే పాతుకు పోయిన బిజెపిని ఢీ కొనడం కాంగ్రెస్‌కు అంత సులభమేమీకాదు. ముంగిట్లో హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌గుజరాత్‌ ఎన్నికలున్నాయి. ఖర్గే కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే మొదటి ఎన్నికలు కావడంతో ఇది నిజంగా ఆయనకు పరీక్షా సమయమే అవుతుంది. దీనికి తోడు మరో ఏడాదిన్నర కాలంలో పార్లమెంటు ఎన్నికలు రానుండగా కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఆయన విపరీతమైన శ్రమ చేయాల్సి ఉంటుంది.

ఒక కార్మికుడి కుమారుడైన తాను ఈ స్థానానికి ఎదగడానికి గాంధీ కుటుంబంతోపాటు, పార్టీ పనితీరే కారణమని చెప్పుకుంటున్న ఖర్గే కీలక దశలో పార్టీ పగ్గాలు చేపట్టారు. తన ముందున్న సవాళ్ళన్నిటికీ పార్టీ ప్రక్షాళన ముందున్న ప్రధానాంశంగా ఆయన భావిస్తున్నట్లున్నది. అందుకు ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఆలోచన మేరకు పార్టీ అత్యున్నత విధాయక మండలి సిడబ్ల్యూసీ సభ్యులతో సహా పార్టీ కార్యదర్శులంతా స్వచ్చందంగా రాజీనామాలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. పార్టీలో నూతనోత్తేజం కలిగించేందుకు కొత్తవారిని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే సామర్థ్యంగల యువ కిశోరాలకు ఆయా పదవులను అప్పగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఆయన ఎన్నికల సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల్లో పర్యటించినప్పుడు యువకులకు అత్యంత ప్రాధాన్యత నివ్వనున్నట్లు స్వయంగా చెప్పిన విషయం తెలియందికాదు.

Manduva-Ravinder-Rao
– మండువ రవీందర్‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *