కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ,ఎస్టివెల్ఫేర్, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతపై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు. గత బడ్జెట్తో పోల్చితే పీఎం ఆవాస్ యోజన, పీఎం పోషణ్, పీఎం గ్రామ సడక్ యోజన వంటి వాటిపై తక్కువ ఖర్చు పెట్టారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో 47.65లక్షల కోట్ల అంచనాలతో గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పేద ప్రజలను వేతన జీవులను నిరాశపరిచింది. అన్నదాతలకు కూడా ఎటువంటి కొత్త రాయితీలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మొరార్జీ దేశాయ్ రికార్డును బ్రేక్ చేస్తూ ఆరవసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో చేసిన 56 నిమిషాల బడ్జెట్ ప్రసంగం రాజకీయ ఉపన్యాసాన్ని తలపెట్టింది దేశ ప్రగతి కోసం ఆదాయ వ్యయంలను అంచనా వేసుకుని ప్రణాళిక తయారు చేసుకోవడమే బడ్జెట్ రూపకల్పన చేయడం. ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రజలంతా తమకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందోనని, ఉత్కంఠతో ఎదురు చూడటం పరిపాటి.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి వికసించేలా బడ్జెట్ తయారు చేయవలసిన పాలకులు, దానిని విస్మరించి వారి రాజకీయ ప్రయోజనాల కోసం, వారి అనుయాయుల లబ్ధి కోసం రూపొందించడం గత పది సంవత్సరాలుగా కొనసాగుతుం డటం బాధాకరం. గతంలో మాదిరిగానే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధిక ధరలతో అలమటిస్తున్న సందర్భంలో వికసించే భారత్ లక్ష్యంగా చెప్పుకుంటూ పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆశ్చర్యకరం… పేదలు రైతులు, యువత మరియు మహిళలు అను నాలుగు వర్గాల వృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, వారి సాధికారితే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొంటూనే, ఆయా వర్గాల అభివృద్ధికి కేటాయించిన కేటాయింపులు గత బడ్జెట్లో కన్నా తగ్గించడం జరిగింది. మాటలు పేదల సంక్షేమం గురించి కోటలు దాటిన, చేతలు మాత్రం కార్పొరేట్ వికాసం కోసం పాటుపడటం బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆదాయం పెరిగినంతగా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు . ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం 13.3% పెరిగిన ప్రభుత్వ ఖర్చు కేవలం ఏడు శాతం మాత్రమే పెరిగింది. కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ ,
ఎస్ టి వెల్ఫేర్, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత పై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు. గత బడ్జెట్ తో పోల్చితే పీఎం ఆవాస్ యోజన, పీఎం పోషణ్, పీఎం గ్రామ సడక్ యోజన వంటి వాటిపై తక్కువ ఖర్చు పెట్టారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో 47.65లక్షల కోట్ల అంచనాలతో గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పేద ప్రజలను వేతన జీవులను నిరాశపరిచింది. అన్నదాతలకు కూడా ఎటువంటి కొత్త రాయితీలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మొరార్జీ దేశాయ్ రికార్డును బ్రేక్ చేస్తూ ఆరవసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో చేసిన 56 నిమిషాల బడ్జెట్ ప్రసంగం రాజకీయ ఉపన్యాసాన్ని తలపెట్టింది. 10 ఏళ్లలో ఎంతో సాధించామని, ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పరిణామం చెందిందని, 10 ఏండ్ల మా పాలన చూసి ఓటు వేయండని అన్నారు. గతంలో లాగే నిరుపేదలను, మహిళలను, రైతాంగాన్ని, సగటు ఉద్యోగులను మధ్యంతర బడ్జెట్ లో కూడా విస్మరించారు. కరోనా కాలం తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగం భారీగా పెరిగి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలంతా పేదరికంలోకి నెట్టి వేయబడగా2 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి పొందారని ప్రకటించడం హాస్యాస్పదం. దేశంలో 43% పైగా నిరుద్యోగం విలయతాండవం చేస్తుండగా గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన గురించి ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం నిరుద్యోగులను వంచించడమే.
మహిళా సాధికారత గురించి ప్రచార ఆర్భాటం చేస్తున్న వాస్తవంగా మహిళల ఉపాధి అవకాశాలు క్షీణించాయి. మహిళా కార్మికుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. మహిళలు గణనీయంగా పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం మొత్తంగా ఎత్తివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా 12 కోట్ల కుటుంబాలకు వంద రోజులు ఉపాధి కల్పించాలంటే కనీసం మూడు లక్షల కోట్లు అవసరం ఉండగా కేవలం 86 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం, నిత్యావసర సరుకుల, నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్న, గ్యాస్ ధరలు కూడా తగ్గించే అవకాశం ఉన్న చేయకుండా కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలు చేపడుతూ లోపభూయిష్ట బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రతిపక్షాల ఆరోపణ అక్షరాల సత్యం. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని , రైతుల సంక్షేమమే ధ్యేయమని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం, రైతులకు ఇచ్చిన హామీ మేరకు 50% తో కూడిన కనీస మద్దతు ధర నిచ్చేందుకు చట్టపరమైన హామీ కలిపిస్తూ బడ్జెట్లో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం,20 22- 23 తో పోలిస్తే 2024- 25 లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 81 వేల కోట్లు తగ్గించారు. వ్యవసాయ కార్యకలాపాల్లో పంట చేతికి వచ్చిన తర్వాత నిల్వ చేసే క్రమంలో, సరఫరా చేసే క్రమంలో, ప్రాథమిక సెకండరీ స్థాయిలో బ్రాండిరగ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వంటి వాటిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామాన్ని పెంచి పోషించేందుకు ప్రతిపాదనలు ఉండటం వ్యవసాయ రంగంలో కార్పొరేట్లకు చేయూతనిస్తూ రైతులను బానిసలుగా మార్చే విధానాన్ని బడ్జెట్ లో ప్రకటించడం విడ్డూరమని, గతంలో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల ద్వారా అమలు చేద్దామనుకున్న పనిని ఈ విధంగా అమలు చేయ పూనుకున్నారని బడ్జెట్ స్పష్టం చేస్తుంది.
దేశ ప్రగతికి, సంక్షేమానికి కీలకమైన విద్యారంగాన్ని విస్మరించడం అత్యంత విషాదకరం . 1966లో ప్రొఫెసర్ కొఠారి చేసిన సిఫారసులకు అనుగుణంగా జిడిపిలో ఆరు శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాల్సి ఉండగా ఈనాటి వరకు పాలకవర్గాలు దానిని అమలు చేయలేదు. .పోగ గత బడ్జెట్ల కంటే విద్యారంగానికి నిధులు తగ్గించడం, ఈ ఏడాది బడ్జెట్లో ఉన్నత విద్యకు నిధులను 9624 కోట్లు కోత పెట్టడం జరిగింది, 390 కి పైగా ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడంజరిగింది.నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని ప్రైవేటు కార్పోరేట్ వ్యక్తులకు దారా దత్తం చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగమే.ఆదివాసీ గిరిజనులకు కూడా ఈ బడ్జెట్ లో సరైన ప్రాతినిధ్యం లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని, గిరిజన యూనివర్సిటీ కేటాయింపులకు కూడా అతి గతి లేదు.
గత పాలకుల బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఆదాయ పన్నుకు సంబంధించిన స్లాబ్ రేట్లు వివరములలో ఎంతోకొంత ఉద్యోగుల సానుకూల వైఖరిని ప్రదర్శించేవి. కానీ గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లాగే ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశ మిగిలింది. చాలీచాలని జీతాలతో సతమతమవుతున్న ఉద్యోగ వర్గం, విపరీతమైన ఆదాయపన్ను చెల్లించాల్సి రావడంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర నిరసనను తెలియజేస్తున్నాయి.
ద్రవ్యోల్బణం అనుగుణంగా ఆదాయ పన్ను పరిధిని పెంచాలని సోయి లేకపోవడం, పన్నుల భారం వేసి సగటు ఉద్యోగులను వేదించడం దుర్మార్గం. దీంతో మధ్యతరగతి వారి కొనుగోలు శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది. గతంలో వ్యాట్ యావరేజ్ గా నాలుగు శాతం ఉంటే ఇప్పుడు జీఎస్టీ 12 శాతంగా పెరిగింది తిండిగింజల మీద నుంచి మొదలుకుని, మందుల మీద, టెలిఫోన్ సెల్ ఫోన్ మీద, కరెంట్ బిల్లుల మీద ,బ్యాంక్ చార్జీల మీద ,లోన్ చార్జీల మీద , విద్యార్థుల ప్లీజ్ మీద కూడా జిఎస్టి కట్టవలసిందే, ఇటీవల కాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. వాటికి అనుగుణంగా నిత్యవసరాలతో పెట్రోల్, డీజిల్ గ్యాస్ వంటి ధర తగ్గింపు పై ఎటువంటి చర్యలు లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.బడ్జెట్ లో సామాన్య పేదలు, రైతులకు సంబంధించిన వాటిపై కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించింది. ఆహారం, వంట గ్యాస్, యూరియా వంటి ఎరువులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. ప్రజల ఆదాయాలు 50% పెరిగాయని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని చెప్పడం పూర్తి అబద్ధం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని,4.09 లక్షల కోట్ల మేరకు ప్రైవేటీకరణ జరిగిందని ,చరిత్రలోనే ఇది అత్యంత ఎక్కువ. ప్రైవేట్ రంగానికి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రతిపాదనలు ఉండడం ప్రైవేటీకరణలో భాగమే. కార్పొరేట్ టాక్స్ ని కూడా 30% నుండి 22 శాతంనకు తగ్గించడం కార్పొరేట్ వర్గాల ప్రయోజనం కోసమే.
సబ్కా వికాస్, సబ్కా సాత్ , సబ్కా విశ్వాస్ మంత్రంగా ముందుకు సాగుతున్నామని చెబుతూ కార్పొరేట్ కా వికాస్ ,కార్పొరేట్ కా సాథ్ అంటూ ధనికులకు రిబేట్ అందించడం ఎవరి ప్రయోజనాల కోసం?… మోదీ ప్రభుత్వంలో అప్పు విపరీతంగా పెరిగింది. అప్పుల కుప్పగా మారింది. 2019 నుంచి 82 లక్షల కోట్ల పెరుగుదల సంభవించింది. ప్రభుత్వానికి అప్పులే ప్రధాన ఆర్థిక వనరుగా మారాయి. 28% ఆదాయం అప్పుల ద్వారా సమకూరుతుండడం దేశ ప్రగతికి విఘాతం…
మొత్తంగా 2024 బడ్జెట్ సామాన్యులకు విషాదం మిగిల్చిందని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం, ధరల పెంపుతో ప్రజలపై భారాలు, జీఎస్టీ పేరుతో రెట్టింపు పరోక్ష పన్నులు వసూలు చేయడం, ప్రత్యక్ష పన్ను రాయితీలను కార్పొరేట్ వర్గాలకు అందించి పెంపుదల భారం అంతా మధ్యతరగతి , ఉద్యోగ వర్గాలపై వేయడం, సాధారణ ప్యాసింజర్ రైళ్లను తగ్గించి, పొందే భారత్ పేరుతో ప్రయాణాలను భారంగా మార్చి ఈ అసంతృప్తులను పక్కదారి పట్టించడానికి రామనామం జపించడం, ఆర్థిక భారాలన్నీ సామాన్య ప్రజలపై మోపుతూ , దేశ సంపదను సంపన్న వర్గాలకు కట్టబెడుతూ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టడం పాలక పార్టీ ఘనతగా చెప్పవచ్చు. పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా సంపన్న వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుంటే వికసిత భారత్ లక్ష్యం ఎలా నెరవేరుతుందో ఏలికలకే తెలియాలి.
తండ సదానందం
టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మహబూబాబాద్..





