‘‘నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’
ఇటివల 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర భారతంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అమృత మహోత్సవ అనే కార్యక్రమాన్ని తలపె ట్టింది. దాని ఉద్దేశం దేశ స్థాయిలో జాతీయ జెండాలు ఎగురవేసి మూడు రోజులపాటు స్వాతంత్ర దినాలు జరిపి మన దేశభక్తిని నిరూపి ంచుకో వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ గుజరాత్లో బిల్కీస్ బాను అనే బాధి తురాలు తన కుటుంబ సభ్యులను 14 మందిని కోల్పోయి తను అత్యాచారానికి గురై హత్య చేసిన వారిని శిక్షించాలని సంవత్స రాలకు కొద్దిగా పోరాటం చేసి వారందరిని జీవిత ఖైదు చేయిం చడం జరిగింది. కానీ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం వారందరినీ క్రమశిక్షణ పేరుతో జైలు నుండి విడుదల చేశారు. బిల్కిస్ బాను అనే బాధితురాలు 2002 గుజరాత్ గోద్రా దుర్ఘటన పేరు మీద జరిగిన ఏకపక్ష మారణకాండలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైన మహిళ ఈమెది అహ్మదాబాద్ ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధికాపురం అనే గ్రామం.
అది దాహోదుజిల్లాలో ఉన్న ప్రాంతం. 2002 నాటికి బిల్కీస్ బాను వయస్సు 19 సంవత్సరాలు ఈమెకు తన కుటుంబం, తన పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని అమాయకురాలు. అయితే తను ఇంట్లో వంట చేస్తుండగా బయట నుండి అరుపులు, గోలలు వినబడుతున్నాయి. పారిపోండి అల్లరి మూకలు మనపై దాడికి తెగబడుతున్నారు చంపుతున్నారు అని బయట నుంచి పిలుపులు. కానీ బిల్కీస్ బానుకు అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆ మూకల్ని చూసి తన వారిని తీసుకొని పరిగెత్తడం ప్రారంభించింది. అప్పటికే అల్లరి మూకలు వెంబడించడం ప్రారంభిస్తునే బిల్కిన్ బాను చేతిలో ఉన్న మూడు సంవత్సరాల తన కూతురు సలేహాను గుంజుకుని నేలకేసి కొట్టి చంపేశారు. బిల్కీస్ బాను నేను గర్భవతిని అని వేడుకున్న తనని అత్యంత కిరాతకంగా రేప్ చేశారు. అప్పుడే ప్రసవమైన షమీమ్ కూడా తన పసిబిడ్డ తో చంపేసి తన కుటుంబంలోని 14 మందిని అతి క్రూరంగా చంపి శవాలు తొందరగా కుళ్ళిపోవాలని ఒకే సమాధిలో 14 శవాలను వాటిపైన ఉప్పు పోసి సమాధి చేయడం జరిగింది. కానీ ఈ ఘటనలు చేసింది బిల్కీస్ బాను ఇంటి పరిసర ప్రాంతంలోని వారే. తనతో పాటు ఇరుగుపొరుగున ఉన్న గాజుల కొట్టి యజమాని అలాగే వారి పక్కనే ఉన్న హోటల్ యజమాని ఆ ప్రాంతంలో ఉండే ఆర్‌ఎంపీ డాక్టర్ కొడుకు వీరందరినీ అన్నా అని బిల్కీస్ బాను పిలుస్తూ ఉండేది.
వాళ్లు వీళ్ళ మీదికి తెగ పడ్డప్పుడు బిల్కీస్ బాను ఎంత బ్రతిమాలిన ఫలితం లేకపోయింది. అప్పటికే నెత్తుటి మడుగులో మునిగిపోయిన బిల్కీస్ బాను చూసి ఆ దుండగులు చనిపోయిందని వదిలేసి పోయారు నగ్నంగా. తనకి మెలిక వచ్చిన తరువాత ఒక గుడ్డ కట్టుకొని ఆదివాసి ప్రాంతాలకు వెళ్ళింది. అక్కడ వారి సహాయం కోరింది. ఆ తర్వాత దావూద్ లో లింకేడ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళితే ఆ అధికారి కేసు తీసుకోకుండా వారి సమూహాలు ఉండే ప్రాంతానికి పంపించడం జరిగింది. తాను అక్కడే తన భర్తను కూడా కలుసుకుంది.తర్వాత కొంతమంది సహాయంతో కేసు పెట్టి చాలా రోజులు కష్టపడుతు అద్దె ఇళ్ళు ఒక 20 దాకా మారుస్తూ, భయపడుతూ 12 మంది దుండగులకు జీవిత ఖైదు శిక్ష వేయించింది. ఈ మధ్యనే జరుపుకుంటున్న వజ్రోత్సవం సందర్భంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అందులో ఒకరు చనిపోగా మిగతా 11 మందిని విడుదల చేసింది. విడుదల చేసిన ఈ ఖైదీలను ఒక ధార్మిక సంస్థ కార్యకర్తలు తమ ఆఫీసుల్లోకి తీసుకెళ్లి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు. సమాజంలో ఆకాశంలో సగభాగంగా స్త్రీలని మనం చెప్పుకుంటాం. కానీ ఒక స్త్రీకి జరిగిన అన్యాయాన్ని మనమందరం ముక్తకంఠంతో స్పందించకపోవడం మన ఆడపడుచులను, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా అనేక వరుసలతో గౌరవించుకుంటాం. కానీ బిల్కీస్ బాను కూడా మన ఇంట్లో ఆడపడుచు లాగా అనుకుని ఆమెకు అండగా ఉంటూ ఆమె పోరాటానికి నైతిక మద్దతును ప్రకటిస్తూ ఆమెతో కలిసి నడవాల్సిన సందర్బం ఇది. నిజానికి హత్యలు అత్యాచారాలు చేసిన వారిని తీసుకువచ్చి ఒక ధార్మిక సంస్థ కార్యకర్తలు పూలమాలలు వేసి సత్కరించడం దేనికి సంకేతం అంటే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఇటువంటి ఘటనలు జరగాలి అని పరోక్షంగా ఈ సమాజానికి సూచించడమే కదా వారి ఉద్దేశం.
మన తెలుగు నేల పైన కూడా ఈ మత ఉన్మాదులు మారుతీ రావు విడుదలైనప్పుడు అతను జైలు బయటికి వచ్చినప్పుడు అతనికి మద్దతుగా ర్యాలీ తీయడం జరిగింది. ఈ ఘటనలు చూసినప్పుడు సర్వసత్తాక, లౌకిక ,గణతంత్ర, ప్రజాస్వామ్య ,సామ్యవాద దేశంగా పిలుచుకునే మనం వాటిని తుంగలో తొక్కుతూ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించడానికి ఈ మత శక్తులు ప్రస్తుత సమాజంలో ఉపయోగపడుతున్నాయి. అనడం లో సందేహం లేదు. మానవ విలువలను మంట కలుపుతూ లౌకిక విలువలకు తూట్లు పొడుస్తు సమాజంలో వైరాగ్యాన్ని సృష్టిస్తూ ఒక అలజడిని ,ఆందోళనని ప్రజలలో అశాంతిని నెలకొల్పుతూ మతోన్మాద భావ ప్రచారాల ద్వారా రాజకీయ అస్తిత్వం పై నిలబడుతున్నారు. అందుకే ప్రజాస్వామ్యంగా ఆలోచించే కొంతమంది ఉన్నత అధికారులు స్పందిస్తూ స్మిత సబర్వాల్ లాంటివారు బలంగానే తమ గొంతుకను వినిపిస్తున్నారు. ఆ ఒక్కరే కాదు సమాజంలో సకల రంగాలలో స్త్రీలు ఈ సమాజం అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇటువంటి అన్యాయం ఏ స్త్రీకి మరోసారి జరగకుండా ఉండేటట్లుగా తమ ఉన్న దగ్గరనైనా నిలబడి తమ నిరసనను తెలియజేస్తూ బిల్కిన్ బానుకు మద్దతు ప్రకటిస్తూ ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా స్త్రీల పైన జరిగే అత్యాచారాలకు అవి పునరావృతం కాకుండా ఉండడానికి ఈ శ్రీవాదులందరూ కూడా తమ నిరసనగలాన్ని వినిపించాల్సిన అవసరం ఉన్నది. వీరితోపాటు ఈ సమాజంలో ప్రగతిశీలంగా ఆలోచించే వాళ్ళు, అభ్యుదయవాదులుగా ,ప్రజాస్వామ్యవాదులుగా వామపక్షవాదులుగా, శాంతికాముకులుగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఘటనలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
నిజానికి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులని గల్లలు పట్టి మనం మన హక్కుల కోసం అడగాల్సిన సందర్భం ఆసన్నమైంది. స్త్రీల కోసం ప్రత్యేకమైన చట్టాలు రావాలని వాటి అమలులో ఈ ప్రభుత్వాల చొరవ బలంగా ఉండాలని కోరుతూ సమాజంలో స్త్రీల పట్ల ఉండే ఆత్మ న్యూనత భావాలను తొలగించే ప్రయత్నంలో వారిలో నూతన చైతన్యాన్ని కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి స్త్రీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. స్త్రీలకీ బాల్య దశలోనే పురుషులతో సమంగా అవకాశాలను అవసరాలను ఆలోచనలు అందివాల్సిన అవసరం కూడా ఉంది . వారికి సమాజం పట్ల ప్రేరణ కల్పిస్తూ ఉద్యోగ పరంగా ఉపాధి పరంగా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన కర్తవ్యం ప్రస్తుత సమాజానిది. బిల్కీస్ బానుకు జరిగిన అన్యాయం ఏ ఇతర మహిళకు జరగవద్దని కులాలపరంగా ,మతాల పరంగా మహిళలను విభజించి చూడకుండా అందరూ మనుషులని వారికి జరిగే అన్యాయాలని ప్రశ్నిస్తూ ఇటువంటి దుర్మార్గులను మళ్లీ జైలుకు పంపించి బిల్కీస్ బానుకు ఆత్మవిశ్వాసం కల్పిస్తూ తనకు మనోధైర్యాన్ని నింపి సమాజం నుండి ప్రేరణను అందించి అందరం ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలని కోరుకుందాం.
ఉదయ్ కుమార్ ఉప్పల
ఉస్మానియా యూనివర్సిటీ 9553460621




