పుట్టిన మట్టిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడి, పీడనను కవితారూపంలో ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో విద్యావేత్త , కవి ప్రొఫెసర్ ఏకు తిరుపతి చేసిన ప్రయత్నమే రౌద్రం. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రజలు జరిపిన చైతన్య పోరాటాలను సమీక్షించిన కవి రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడ తలెత్తుతున్న అసమానతలను చూసి ఎంతో ఆక్రోశించారు. ఉత్తర తెలంగాణలో తలెత్తుతున్న అసమానతలను చూసి వేదన చెందారు. ఉత్తర తెలంగాణలో అభివృద్ధి లేమి, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, వనరుల దోపిడి జరిగిందని వేదన చెంది సత్వరమే మేల్కొని ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పారు. కవిలోని కష్టపడే తత్వం, కమిట్‌మెంట్‌ను ఈ సంపుటిలోని 48 కవితలు వెల్లడిస్తాయి. తొలి కవిత రౌద్రంలోనే దక్షిణకాశిని మర్చిపోతే/ కాలకూటమై ఎగిసి పడలేనా / సప్త జడలతో నాట్యమాడే/ రామలింగేశ్వరుడిని రామప్పను కాపాడలేనా/ త్రికరణశుద్ధి కల్గిన నందీశ్వరుడు/ వేయిస్తంభాలను విరాజింపలేడా/ త్రినేత్రుడనై రణంతో సృష్టిని చీల్చే వాడను/ నమ్మక ద్రోహాలను చీల్చలేనా అని తన కవితాలక్ష్యాన్ని ఎంతో స్పష్టంగా కవి వెల్లడిరచారు.
అన్యాయంపై నిప్పులు కక్కుతూ తస్మాత్ జాగ్రత్త/ నా రుద్ర తాండవం నువ్వు చూడలేవు/ నా రౌద్రాన్ని తట్టుకోవడం/ ఎన్ని జన్మలెత్తినా అందుకోలేవు/ రుద్రం, రుద్రం, రౌద్రం, జాగ్రత్త భద్రం మేలుకో అని ఘాటుగా హెచ్చరించారు. ప్రగతిశీలానికి పట్టం కడదాం/ దండోరాతో దడ పుట్టిద్దాం/ ఉత్తర తెలంగాణే ఊపిరిగా నిలుద్దాం అని చెప్పారు. ఇకపై సాగవు అసమానతలని చెబుతూ ఉత్తర తెలంగాణ రథచక్రాలు/ కదులుతున్నాయి కాసుకో అన్నారు. అంతా చీకటి కవితలో అంధకార గ్రామాలు ఒక్కటవుతున్నాయి / చీకట్లను చీల్చి దీపాలు వెలిగించే రోజులు ముందున్నాయి అని చెప్పారు.
సిరిసంపదలు లేని మాకు నవ్వులెక్కడివి అని అన్నారు. మేము అన్నం తింటే గొడ్డుకారం/ పచ్చిపులుసు, మాడిన అన్నం ఏంటి ఈ వింత అంతరాలు ఓ బ్రహ్మదేవా మాకెందుకయ్యా నీ చేతిరాతలు అని సూటిగా నిలదీశారు. మహోజ్వల ధర్మ యుద్ధంతో ప్రజల కన్నీరు తుడిచే పరిష్కారం పొందాలని చెప్పారు. జీవనదుల తెలంగాణ ఎండకట్టిపోయిందని వేదన చెందారు. హక్కుల సాధనకు ఇక ఐక్య పోరాటాలే శరణ్యమన్నారు. మట్టి మనిషి తన ఉనికి కోల్పోతున్నాడని తెలిపారు. నీతి సమాజ నిర్మాణానికి ధీటుగా నిలబడి పోరాడమన్నారు. గోదావరి నీటితో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కావాలని చెప్పారు. భూమిపై పట్టు సాధించి మానవ మనుగడను నిలబెట్టుకోవాలని తెలిపారు. యువతరానిదే భవిష్యత్తు నిర్మాణానికి చైతన్యశీల భూమిక అని చెప్పారు. దగాను దండోరా వేసి చాటమన్నారు. పారేనీళ్ళు లేక పచ్చటి చెట్లు ఎండిపోయే దైన్యం దూరం కావాలని ఆకాంక్షించారు. ఆర్తనాదాలలోని ఆర్తి విని మానవత్వంతో స్పందించాలని సూచించారు. అజ్ఞానం, మోసం నుండి మనిషి చైతన్యమై బయటకు రావాలని చెప్పారు. పొద్దుపొడుపు కిరణాల్లా కవితలు దూసుకుపోయి ప్రసరించాలని భావించారు. సమత, మమత, సమానత్వం తెలిసిన కార్మికులు సమసమాజ నిర్మాణానికి తోడ్పడతారన్నారు. ఓటును ఆయుధంగా మలచుకొని ప్రజాస్వామ్యాన్ని, ప్రగతిని రక్షించమని కోరారు. సహజ, మానవ వనరులను కాపాడుకోవాలన్నారు. సమాజ సమ్మేళన సంఘర్షణల మధ్య పుట్టిందే బలగమని చెప్పారు. రాజ్యాన్ని రక్షించడమంటే ఓటును అందరూ సద్వినియోగం చేయడమేనని తెలిపారు.
బద్దిపోచమ్మకు శ్రావణ బోనాలు సమర్పించడమంటే ఆయమ్మ శాంతించి, కరుణించి, వనరులిచ్చి దీవించేందుకేనని తెలిపారు. కొండగట్టు అంజన్నను, ఉత్తర తెలంగాణను రక్షించమని కోరుకున్నారు. అసమాన జీవన అంతరాలు తొలగిపోయి అరాచకాలు ఆగిపోవాలని అన్నారు. బంధం, బంధుత్వాల ప్రాధాన్యతను వివరిస్తూ బలగంతో అనుబంధాలను పెంచుకుందామని చెప్పారు. చరిత్ర సృష్టించిన తెలంగాణ అమరులకు కవితా నివాళులు అర్పించారు. నీతి సమాజానికి నాంది పలకమని శ్రీలక్ష్మీనరసింహ స్వామికి విన్నవించారు.
రైతును, వ్యవసాయాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వర్షాలు కురిపించి కరుణించమని గంగమ్మకు కోటి మొక్కులు చెల్లించారు. జోగిని వ్యవస్థ పట్ల వేదన చెందారు. మనిషిని మనిషి ఆదరించి మానవ కళ్యాణానికి పాటుపడాలని చెప్పారు. పల్లెల్లోని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మళ్ళీ ఆ అనుబంధాలతో కలిసి బతికే రోజులు రావాలన్నారు. చైతన్యం ప్రతి మనిషిలో పెరగాలని చెప్పారు. వరద భీభత్సాన్ని దయనీయంగా చిత్రించి చూపారు. పంచభూతాల ప్రళయాన్ని, కరువు విలయ తాండవాలను కవితాత్మకంగా విశ్లేషించారు. యువత దగా పడకుండా ధైర్యంగా నిలబడాలని చెప్పారు. ప్రజా సమీకరణతో అన్యాయాలను నిలదీసి న్యాయాన్ని ఉన్నతంగా నెలకొల్పాలన్న సంకల్పం ఈ సంపుటిలోని కవితల్లో స్పష్టంగా అభివ్యక్తమైంది.
-డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





