ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఆదరాభిమానాలు, సద్గురు ఆశీస్సులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు.
గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు. సద్గురుతో పాటు, ఆయన అభిమానులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఓఎస్‌డి ప్రియాంక వర్ఘీస్, ప్రభుత్వ సలహాదారు ఆర్. శోభ, పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి డీఎఫ్‌ఓ జానకిరామ్, ఎఫ్‌ఆర్వో విష్ణు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




