మహాత్మా జ్యోతిరావు ఫూలేను అనేక విశేషణాలతో సంబోధించడం ఆనవాయితీగా వస్తుంది. ఆధునిక భారతీయ జాతిపిత, భారత మార్టిన్ లూథర్, నిజమైన మహాత్ముడు ఆయన. గాంధీజీ, దయానంద సరస్వతి వంటి వారికీ స్ఫూర్తిదాత, భారత స్త్రీల ప్రథమ ముక్తిదాత బుద్ధుడు, కబీర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు స్ఫూర్తి అని, నాటి రోజుల్లో శూద్రులు ఎవరు? అనే గ్రంధాన్ని అంకితమిచ్చాడు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాన్ని ముందుకుతెచ్చిన ఫ్రెంచి రెవెల్యూషన్ (1789 -1799 ) కు స్ఫూర్తినిచ్చిన థామస్ పెయిన్ 1791లో రాసిన మానవ హక్కులు గ్రంధం ఫూలేకు గొప్ప స్ఫూర్తి. విద్యతో పాటు సామాజిక రుగ్మతలపై, స్త్రీ సమానత్వంపై, అంటరానితనపై ఎన్నో పోరాటాలు చేసిన పూలే నేటి పాలకులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
1827 ఏప్రిల్ 11న చిమ్నాబాయి, గోవిందులకు జన్మించారు. వెలుగును సూచిస్తూ అతని తల్లి, తండ్రులు అతనికి జ్యోతి అనే నామకరణం చేసారు. ఏడాది వయసున్నప్పుడే అతని తల్లి చనిపోయింది. ఫూలే తన ఏడవయేటా మరాఠీ పాఠశాలలో విద్యార్థిగా జీవితం ప్రారంభించి చదువును చిన్న తనంలోనే ఆపేసి,కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తండ్రికి సహాయంగా పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. బడి మానేసిన పనిచేసుకుంటూ రాత్రిళ్ళు గుడ్డి దీపం వెలుగులో చదువుకున్న ఫూలే మరాఠీ భాషతో పాటు ఇంగ్లీషు భాషపై కూడా పట్టు సాధించారు. నాటి ఆచార, సంప్రదాయాల ప్రకారం 13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఎనిమిదేళ్ల సావిత్రిబాయితో వివాహమయ్యింది. ఒకరోజు బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేంగింపులో జరిగిన సంఘటన జ్యోతిరావు ఫూలే ఆలోచనలను మార్చివేసింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే పీడిత వర్గాలకోసం తపించి దీర్ఘకాలికంగా మహమ్మారి జబ్బుతో బాధపడుతూ నవంబర్ 28, 1890లో మరణించారు.
సామాజిక అసమానతల వల్ల ఒక వ్యక్తికీ జరిగిన వివక్ష, అవమానం యావత్ జాతికి జరిగిన అవమానంగా అయన భావించారు. దానికి గల మూలాలు భారతదేశం వెనుకబడడానికి, దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు విద్య లేకపోవడమేనని గుర్తించిన ఫూలే ,తన భార్య సావిత్రిబాయికి విద్యను నేర్పించి, భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు మహర్షి కార్వే పుట్టక ముందే తోలి మహిళా ఉపాద్యాయిరాలును అందించిన మేధోసంపన్నుడు 1848లో పుణేలో తొలిసారిగా బుధవార్ పేట్ లో బాలికలకు పాఠశాలను ప్రారంభించారు. ఈ దేశ మూలవాసులకు, స్త్రీలకు వేల ఏండ్లుగా విద్యను, ఆస్తిని, అధికారాన్ని దూరం చేసిన విషయాన్ని మొట్టమొదటి సారిగా గుర్తించి ప్రశ్నించిన ధీరుడు మన జ్యోతిరావు పూలే. దేశంలో ప్రజలు అభివృద్ధి కాకపోవడానికి, అణచివేతకు, అన్ని అనర్థాలకు విద్య లేకపోవడమేనని గుర్తించి, ఫూలే చేసిన ఉద్యమం, కృషి, త్యాగం వల్లనే బడుగులందరు ఫలాలను అనుభవిస్తున్నారు.
పూలే చూపిన మార్గంలోనే సాహు మహారాజ్ విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసారు. పూలే మరణానంతరం జన్మించిన అంబేడ్కర్ పూలేను తన గురువుగా ప్రకటించుకోవడమే కాకుండా పూలే చూపించిన మార్గంలో నడిచిన అంబేడ్కర్ అణగారిన వర్గాలకు విద్య, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగములో పొందుపరిచారు. అణగారిన వర్గాల మేలు కోసం అంబేడ్కర్ చేసిన ప్రతి పనిలో పూలే సిద్ధాంతం ఉందనేది వాస్తవం. మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనా సిద్ధాంతంతో ఈ దేశ పీడిత వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన పాలకులు కుంటిసాకుతో 1931లో జరిగిన కులగణన ఆధారంగానే ఫలాలు అందిస్తున్నారు. స్వార్థ రాజకీయాలతో ఓబీసీలను వోటు బ్యాంకుగానే చూస్తున్నారనే విమర్శ ఉంది. అటువంటిది లోకసభ ఎన్నికల సందర్భంగా ఎస్సి, ఎస్టీ, ఓబీసీలు నిర్ణయాధికారంలో పాలుపంచుకోవాలనే ఉద్ద్యేశంతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో కులగణన చేర్చడంతో అట్టడుగు వర్గాలు జాతీయ కాంగ్రెస్ అగ్రనేత ను ప్రధానిగా చూడాలని తహతహ లాడుతున్నారనేది నిర్వివాదాంశం.
విద్య లేనందువల్లనే నేడు మెజారిటీ ప్రజలు అసంఘటిత రంగాల్లో జీవనం కొనసాగిస్తూ నానాటికి పెరుగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణను ఎదుర్కోలేక నానా అవస్థలు పడుతున్నారు. కూటి కోసం దేశాలు దాటి వలస పోవడమే కాకుండా దేశములోని వివిధ పారిశ్రామిక నగరాలకు వలస పోతున్నారు. అవిద్య, చాలీచాలని ఆదాయంతో వారి పిల్లలను ప్రైవేట్ రంగంలో చదివించడం కత్తిమీది సాములాగా మారింది. ఆరుగాలం కష్టపడ్డా సంపాదన పిల్లల చదువు కోసం, వైద్యం కోసం సంపాదన ధారపోయడమే కాకుండా అప్పుల పాలవుతున్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు, వలస కూలీలు, వారి కుటుంబాల పరిస్థితి, విద్య లేని లోటు వల్ల బాహ్య ప్రపంచానికి తెలిసింది. పూలే జయంతి సందర్భంగానైనా పాలకలు విద్యకు అభివృద్ధికి మధ్య ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరికి ఉచిత సమాన విద్య అందించడానికి, ప్రజా ఆరోగ్యానికి అవసరమైన వైద్య విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతినబూనాలి. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే నడిపిన పాఠశాలతో ఎందరో దళిత బాలికలు, బాలలు చైతన్యవంతమయ్యారు. ఫూలే నిజమైన మహాత్ముడని గాంధీజీ అన్నారు. వీరసావర్కార్ జ్యోతిరావును సామాజిక విప్లవకారునిగా అభివర్ణించారు. 76 ఏండ్లుగా విద్య-అభివృద్ధి పై అణగారిన వర్గాల ప్రజలకోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి స్వాతంత్రానాంతరం మన పాలకులు కొనసాగించలేదు. ప్రభుత్వాల వివక్ష కారణంగా సంపన్న వర్గాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉంది. పాలకులు ఉద్దేశ పూర్వకంగానే ప్రజలను విద్యకు తద్వారా అభివృద్ధికి దూరం చేయడం వల్లనే నేడు దేశంలో ఇంతటి దుర్భర స్థితి ఏర్పడిరదనే అభిప్రాయం నెలకొంది.
(మహాత్మా జ్యోతిరావు ఫూలే
197వ జయంతి సందర్భంగా…)
డా. సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్,
సెల్ : 9866255355





