వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు పీఠముడిగా మారింది. హైదరాబాద్ తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన వరంగల్‌పైన ఆధిపత్యం కోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడటం చూస్తున్నాం. గడచిన పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్థానం విషయంలో ఇప్పుడు ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. కరవమంటే కప్పకు, విడువమంటే పాముకు కోపంలా ఆ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇదే స్థానాన్ని కోరుకుంటుండడంతో ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద చిక్కువొచ్చిపడిరది. ఇక్కడ బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్‌ను మార్చాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఈ మొత్తం ఎపిసోడ్‌కు కారణంగా మారింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో స్టేషన్ ఘణపూర్, వర్ధన్నపేట ఎస్సీ శాసనసభ నియోజకవర్గాలు.
ఈ నియోజకవర్గాల్లో తాజా ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌పార్టీ వర్ధన్నపేటను కోల్పోగా, స్టేషన్‌ఘణపూర్‌ను గెలుచుకుంది. వర్ధన్నపేటలో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన ఆరూరి రమేశ్, స్టేషన్ ఘనపూర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి ఇద్దరూ ఇప్పుడు వరంగల్ ’(ఎస్సీ) పార్లమెంటు నియోజవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధపడడం ఇప్పుడు ఆ పార్టీకి పీఠముడిగా తయ్యారైంది. శాసనసభ ఎన్నికలకు ముందు నుండే తన కూతురు కడియం కావ్యకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కడియం శ్రీహరి పార్టీ అధిష్ఠాన వర్గాన్ని డిమాండ్ చేస్తూ వొచ్చారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్‌కు ప్రత్యమ్నాయ అభ్యర్థికోసం వెతుకుతున్న తరుణంలో తన కూతురు కడియం కావ్యకు పార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నారు. కాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన అరూరి రమేశ్ ఎంపి టికట్‌ను తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేక వరంగల్ స్థానాన్ని పక్కకు పెట్టడాన్ని చూసి ఇద్దరు పార్టీ మారడానికి సిద్దపడ్డారు. పార్టీ మారే విషయంలో వీరిద్దరు కాదని కొట్టి పారేసిన ఇతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ దశలో అరూరి ఎపిసోడ్ పెద్ద ప్రహసనమైంది. తన భవిష్యత్ కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే ఈ సమావేశానికి ముందే బిఆర్‌ఎస్ నాయకులు ఆయనను బలవంతంగా హైదరాబాద్‌లోని తమ అధినేత కెసిఆర్ వద్దకు తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన తాను బిజెపి నాయకులతో మాట్లాడినమాట నిజమేగాని, అమిత్‌షాను మాత్రం కలువలేదని, బిఆర్‌ఎస్‌ను వీడిపోవడంలేదని చెప్పినప్పటికీ, వరంగల్ ఎంపి టికెట్ హామీతోనే బిజెపిలో కలువడానికి సిద్దపడ్డట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే తన డిమాండ్‌కు అధిష్టానం స్పందించకపోవడంతో కడియం కూడా పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు విస్తృతమైనాయి. అయితే ఈ ప్రచారంపైన కడియం శ్రీహరి ఆలస్యంగా స్పందించడంతో నిజంగానే ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారన్న వార్తలు ప్రభలమైనాయి. వరంగల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరిని వరంగల్ ఎంపి స్థానానికి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ అడుగుతున్నట్లు తెలుస్తున్నది. ఎంపీగా గెలిచాక స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆయన కోరిక మేరకే ఆయన కూతురు కావ్యను నిలబెట్టి గెలిపించుకోవాలని కాంగ్రెస్ వర్గాలు కోరినట్లు తెలుస్తున్నది. అయితే అందుకు శ్రీహరి తన అయిష్టతను వ్యక్తం చేశారని, తన బదులుగా తన కూతురు కావ్వకు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి.
వీరిద్దరూ పార్టీ మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని బిఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పుడు తలపట్టుకుంది. ఆరూరికి టికెట్‌్ ఇస్తే అటు పసునూరి దయాకర్, ఇటు కడియం శ్రీహరి పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాదని కడియం కావ్యకు ఇచ్చినా పసునూరి, ఆరూరి ఇద్దరూ పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయి. ముగ్గురితో చిక్కు ముడిపడిగా మారిన ఈ సమస్య ఇప్పుడు అధిష్టానం కోర్టులో ఉంది. బిజెపి కార్యకర్తలు అడ్డుతగిలినా ఇప్పటికైతే ఆరూరి పార్టీ అధినేత కెసిఆర్ ఇంటికి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బస్వరాజు సారయ్యలు ఎలాగో చేర్చారు. అక్కడినుండి బిజెపి కార్యకర్తల ప్రతిఘటనల మధ్య మాజీ మంత్రి హరీష్‌రావు దగ్గరకు ఆరూరిని తీసుకెళ్ళారు. ఇది రాసే సమయానికి ఆయనతో కెసిఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఈ ఎన్నికల్లో నాయకుల కుటుంబ సభ్యులకు కాకుండా సీనియర్ నాయకులనే పోటీకి నిలబెట్టాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశంలో కెసిఆర్ తీసుకునే నిర్ణయాన్నిబట్టి వరంగల్ రాజకీయాల్లో ఎలాంటి మార్పు సంభవిస్తుందో వేచి చూడాలి.





