- ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం
- ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన
- దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం
- ప్రగతి భవన్ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు
- ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్
- నేడు పది గంటలకు ప్రజా దర్బార్
- ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు
- మొదటిసారిగా ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి
- ఆరు గ్యారెంటీలపై సిఎం తొలి సంతకం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటానికి, నగర అభివృద్ధి కోసం శాంతి భధ్రతలను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా..ప్రపంచంతోనే పోటీపడే అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లి పేద వాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ తమకు ఎవ్వరూ లేరు….ఏ దిక్కూ లేదనే పరిస్థితులను రానీయకుండా బాధ్యతలను తాను నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము పాలకులం కాదని, సేవకులమని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహూల్ గాంధీ సూచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని, సేవ చేయడానికే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా వినియోగిస్తానని ఆయన తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే ఆలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలుపెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింవని రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎల్‌బి స్టేడియం వేదికగా రాష్ట్ర రెండవ సిఎంగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం బారీగా హాజరయిన ప్రజలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో జై సోనియమ్మ…జై సోనియమ్మ నినాదం తర్వాత ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని, అనేక పోరాటాలతో ఏర్పడ్డదని, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రమని అన్నారు. దశాబ్ధకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనై మానవ హక్కులకు భంగం కలిగి ప్రజలు చెప్పుకుందామంటే ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక దశాబ్ధకాలంగా మౌనంగా భరించిన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాచేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ప్రజా రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి తమ ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనిందన్నారు.

ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్చ వొచ్చిందని, మంత్రి వర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడీగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టడం జరిగిందని, వేదిక మీద నుంచి నాలుగు కోట్ల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నానని, ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్ధలు కొట్టి తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్‌లోకి ప్రవేశించి తమ ఆలోచనను, ఆకాంక్షలను, తమ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకునే అవకాశం కల్పించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వాములని, రాష్ట్ర ప్రభుత్వంలో వారి ఆలోచనను ప్రాంత అభివృద్ధిలో మిలితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజల అభిమాన నాయకుడిగా, రేవంతన్నగా వారి మాట నిలబెడతానని ఆయన మాట ఇచ్చారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలుకొట్టినమని, శుక్రవారం ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు.
నేడు ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారని, కానీ మువ్వన్నెల జెండాను వదులుకోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. వారి కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటానని, గుండెల నిండా నింపుకుంటానని, పదేండ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాయకుడిగా తాను తీసుకుం టానని ఆయన పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తమ కుటుంబ సభ్యులుగా దిల్లీలో బాధ్యతలు తీసుకుంటారన్నారు. నేటి నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమర వీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం జ్యోతీరావు పూలే భవన్‌లో 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నామని, దానికి ప్రజందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపాలని, చప్పట్లతో స్వాగతం పలుకాలని ఆయన కోరగా హజరయిన ప్రజలు చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. వేలాదిగా ఈ శుభకార్యక్రమానికి హాజరై తెలంగాణకు పట్టిన చీడ, పీడ నుంచి విముక్తి కలిగించారని, ప్రమాణ స్వీకారంలో ప్రజలందరు కుటుంబ సభ్యులుగా పాల్గొన్నారని, వారితో పాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు, తన సహచర పార్లమెంటు సభ్యులు ఇందిరమ్మ రాజ్య ప్రక్రియలో పాల్గొన్నారన్నారు. వారందరికీ తెలంగాణ ప్రజలు తమ చప్పట్లతో ధన్యవాదాలు తెలుపాలని రేవంత్ కోరగా ఎల్‌బి స్టేడియం చప్పట్లతో మారుమోగింది. ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ ఆయన ధన్యవాతాలు తెలిపారు. అనంతరం ఆరు గ్యారంటీల ఫైలుపై సిఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. తర్వాత ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగిని రజినీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైలుపై ఆయన రెండో సంతకం చేశారు.





