యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ శతజయంతి రోజే ప్రారంభం
నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ అభూతకల్పనలు
:టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్
న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్ భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజున నూతన పార్లమెంట్ ప్రారంభం కావడం యాదృచ్ఛికమే అయినా.. గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. సోమవారం డియాతో మాట్లాడుతూ… నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ చెప్పిందొకటి.. నిజానికి చేస్తున్నది మరొకటన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపై వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలతో నచ్చని పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారని విమర్శించారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ ఏపీ నుంచి తెలంగాణకు ఎలా వెళ్లిపోయిందో అందరికీ తెలుసన్నారు. కానీ నీతి ఆయోగ్ సమావేశంలో పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు అంటూ సీఎం జగన్ మాట్లాడారని మండిపడ్డారు. ఏ రాష్ట్రమైనా అప్పులు చేయడం సహజమని.. కానీ ఆ అప్పులు అభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగపడాలన్నారు. ఏపీలో మాత్రం ప్రభుత్వం చేసే అప్పు అవినీతి విలయతాండవం చేయడానికి దోహదపడుతోందని ఆరోపించారు. సంపద సృష్టి లేకపోగా.. ఉన్న సంపద ఆవిరైపోతోంద న్నారు. సంక్షేమం పేరుతో రూ. లక్షల కోట్లు లెక్కలు లేకుండా దారిమళ్లుతున్నాయని మండిపడ్డారు. ఏపీలో నేటి వరకు శంఖస్థాపనలు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కాలేదని తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ చెప్పినవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలు అంటూ ఎంపీ వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాశ్ రెడ్డిని ఎలా కాపాడాలి అన్నదే ఎజెండాగా పెట్టుకున్నరాన్నారు. డియాకు మాత్రం తేదీలు మార్చి పాత ప్రెస్‌నోట్లే ఇస్తున్నారన్నారు. హోంమంత్రి అమిత్ షా తో జగన్ ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి కర్నూలుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యను సృష్టించి అరెస్టు చేయనీయకుండా అడ్డుకుందన్నారు. హత్య విషయం సీఎం జగన్‌కు ముందే తెలుసు అంటూ సీబీఐ ఆరోపించిందన్నారు. ఈ ఆరోపణను జగన్ ఖండించలేదని.. ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. జగన్ మౌనం హత్యలో ఆయన పాత్రపై సందేహాలను రేకెత్తించేలా ఉందన్నారు. దీనికి తోడు ఆయన అర్థరాత్రి కేంద్ర హోంమంత్రిని కలవడం మరింత చర్చనీయాంశంగా మారిందని కనకమేడన రవీంద్రకుమార్ పేర్కొన్నారు.




