ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే ‘డీసెంట్రీ’ అంటారు. పిల్లలో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వల్ల వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి.రోగి బ్రతికితే డయేరియా చస్తే కలరా అంటారని సామెత . వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా వీరేచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం.
ప్రతి సంవత్సరం అతిసారం వలం 760 000 ఐదు సంవత్సరాల లోపు శిశువులు మరణిస్తున్నారు. అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతూ, పరిశుభ్రత పాటించడం వలన నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 1.7 బిలియన్ అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. డయేరియా ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం అవుతుంది. రోటా వైరస్, అస్ట్రో వైరస్, నార్ వ్యాక్ వైరస్, పికోర్నా వైరస్ మాములుగా కల్గిస్తాయి. డీసెంట్రీ కలిగించే బాక్టీరియాలు, ఈ.కోలై ( హీమోరేజిక్ సబ్ స్పీసీస్ 0H 157), క్యామపైలోబ్యాక్టర్ జెజెనై, సాల్మొనెల్లా జాతులు, షిగెల్లా. ఇవన్నీ నీటి కలుశితాల ద్వారా సంక్రమిస్తాయి. శుద్ధి లేని నీటిలో ఈ విరస్లు వృద్ధి చెందుతాయి. డ్రైనేజీ కాల్వలు పొంగి పొర్లుతున్నాయి, నలభై శాతం రోడ్లు మురుగునీటితో తడిసి ముద్దవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, శుచి శుభ్రతలేని రెస్టారెంట్లు, ఏండ్ల తరబడి శుభ్రం చేయని మంచి నీటి ట్యాంకులు, కలుషిత ఆహారం డయేరియాకు ప్రధాన కారణం. ప్రజలకు మంచి ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు లేకపోవడం. ఏ పద్ధతిలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో అర్ధం కాని ప్రభుత్వాలు పాలించడం గమనార్హం. ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేశామన్న ప్రకటన లు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు.
నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్ధికంగా వెనక పడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్య ఎలా ఉంది వాళ్ళ అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో కార్పొరేట్ ఆసుపత్రుల లో వైద్యం పేదలకి అందని ద్రాక్ష, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక రోగిని వెక్కిరిస్తాయి. రోగికి వైద్యుడికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా తాను చేసింది వైద్యం అన్న చందంగా సాగిపోతోంది. అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏమిటి అన్నదే ప్రశ్న? నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్టదన్నట్లు జిల్లా ఆసుపత్రి కి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు. జిల్లా కేంద్రంలో వెలసిన సర్వజన ఆసుపత్రులలో గైనిక్ వార్డుల్లో ప్రతి మంచానికి ఇద్దరు గర్భిణీలు, ఇద్దరు బాలింతలు ఉంటున్నారు. గైనిక్ వార్డ్ సందర్శకులు తాకిడితో కిటకిట లాడుతున్నది. అడ్మిషన్ అయిన గర్భవతులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజలు, వీరిలో చాల మందికి రక్తహీనత ఉంటున్నది. సిజరిన్ చేయడానికి వీరికి కావాల్సిన రక్తం చాల సందర్భాలలో అందుబాటులో ఉండడం లేదు.
గత రెండు సంవత్సరాలుగా కళాశాలల్లో రక్త సేకరణ జరగక పోవడంతో బ్లడ్ బ్యాంక్ లో రక్తం కొరత ఉన్నది. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులే శరణ్యం. చాల బోధనాసుపత్రులల్లో డయాగ్నస్టిక్ యూనిట్లు లేవు. ఎంఆర్ఐ, సిటి స్కాన్ వసతి లేదు. గ్రామీణ ఏజెన్సీలలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు అందుబాటులో ఉండరు, మందులు ఉండవు. ముఖ్యంగా సీజన్ వస్తున్న దోమతెరలు ఇవ్వరు. రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు.అక్కడ ఆరోగ్య కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నారు. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు. పాండమిక్ తర్వాత అయినా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆరోగ్య సేవలు మాటలకే పరిమితం అయ్యాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి? రోగి కళ్యాణ్ సమితి (రోగి సంక్షేమ కమిటీ)/హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక సాధారణ సామర్థ నిర్వహణ వ్యవస్థ.
ఈ కమిటీ, ఒక నమోదిత సంఘము. ఆస్పత్రులు మరియు వాటి వ్యవహారాలను చూసుకోవడానికి ట్రస్టీగా పనిచేస్తుంది. దీనిలో స్థానిక పంచాయతీ రాజ్ సంస్థలు, స్వచ్చంధ సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు ఆస్పత్రి/కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ల సరైన కార్యాచరణ మరియు నిర్వహణకు బాధ్యులుగా ఉంటారు. రోగి కళ్యాణ్ సమితి ద్వారా మందుల ఉత్పత్తి మరియు సులువైన పనితీరుకు అనుగుణంగా నిధులు పెంచడం మరియు వాటిని ఉపయోగించడం చేయగలరు. పాలక మండలి సమావేశాలు త్రైమాసికంలో కనీసం ఒకసారి చైర్పర్సన్ నిర్ణయించిన సమయం మరియు ప్రదేశంలో నిర్వహించాలి. ఒకవేళ చైర్ పర్సన్ గవర్నింగ్ బాడీ మూడోవంతు సభ్యులనుంచి సంతకాలు చేసిన ఒక సమావేశ పిలుపు అందుకుంటే వెంటనే సాధ్యమైనంత తొందరగా అవసరమైన ప్రదేశంలో పిలవాలి. క్రింది కనీస పనులను ముందుకు తీసుకు తీసుకురావాలి మరియు ప్రతి పాలక మండలి సమావేశంలో చర్చించాలి.
ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్స్ మరియు ప్రోటోకాల్స్ అంగీకరించటం. గత త్రైమాసికంలో ఆసుపత్రి ఓపిడి మరియు ఐపిడి సేవల పనితీరుల సమీక్ష మరియు తరువాతి త్రైమాసికంలో సేవా లక్ష్యాలు నిర్ణయించటం. పర్యవేక్షణ కమిటీ సమర్పించిన నివేదికలు సమీక్షించటం. నిధులు, పరికరాలు మరియు ప్రభుత్వ వివిధ కార్యక్రమాల కింద అందుకున్న మందుల వినియోగ స్థితిని ఆన్లైన్లో సమీక్షించటం. పౌర పట్టిక పునర్విచారణను పాటిస్తున్న ఆసుపత్రి మరియు ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పరిశీలించటం. సాధారణ అంశాలకు అదనంగా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చర్చ జరగని సొసైటీ వార్షిక నివేదిక కూడా త్రైమాసిక సమావేశంలో చర్చించాలి. ఇవన్నీ ఇప్పుడు నామమాత్రంగా ఉంటున్నాయి. ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం పరచాల్సిన బాధ్యత మనందరిది.
డా. యం సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక





