జాతరకు ఏర్పాట్లు పూర్తి
శాశ్వత ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి సీతక్క
మేడారం జనజాతర సందడి షురూ…కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ అధికారులను పురమాయిస్తున్నారు. జాతర పరిసరాల్లో ఉన్న రోడ్లను డబుల్‌గా విస్తరించి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతర పరిసరాలను మరింత విస్తరింపజేసేందుకు అవసరమైన భూసేకరణ కూడా చేపట్టడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు. మేడారాన్ని కుంభమేళా తరహాలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. జాతరలో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
మేడారం జాతర వరకు ఉన్న దారులను పూర్తిగా విస్తరింపజేస్తే భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. ఈసారి జాతరలో భక్తులకు తాగునీటి వసతి, టాయిలెట్స్‌ను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశామన్నారు. మేడారంలో కాలుష్యం తలెత్తకుండా పారిశుద్ధ్యం పనులు కూడా ఎప్పటికప్పుడు చేపట్టామని అన్నారు. రాబోయే రోజుల్లో జాతరను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మేడారాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం శాశ్వత పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. జాతర నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించామని మంత్రి సీతక్క తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
మేడారం జనజాతర సందడి షురూ…కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం
ములుగు జిల్లా మేడారంలోని కన్నెపల్లిలో గుడిమెలిగే పండుగ ప్రారంభమైంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం మహాజాతర ప్రారంభానికి నాందిగా గుడిమెలిగే పండుగ చేస్తామని పూజారులు తెలిపారు. గుడిమెలిగే పండుగలో భాగంగా సమ్మక్క, సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో పూజారులు కప్పారు. సమ్మక సారలమ్మ జాతర ఉండడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. భక్త జనసందోహంతో మేడారం సందడిగా మారనుంది. పెద్ద ఎత్తున్న బంగారాన్ని సమ్మక సారలమ్మకు భక్తులు సమర్పిస్తుంటారు. ప్రభుత్వం కూడా సదుపాయాలు కల్పించి, భక్తులకు ఇబ్బదులు రాకుండా చేస్తుంది.
రెండేళ్ల కోమారు జరగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ఘనతను చాటుకోనుంది. ఉత్తరాదిలో జరిగే కుంభమేళాకు తీసిపోని విధంగా ప్రజలు ఈ జాతరను ఆరాధిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనులు పోటెత్తుతున్న తీరు చూస్తుంటే మేడారంనకు ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పనక్కరలేదు. లక్షలాదిగా ప్రజలు నాలుగు రోజలుగా తరలివచ్చి గద్దెలను దర్శించుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. అన్నింటికి మించి ప్రభుత్వం ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు అన్నీ తామై అధికారులను నడిపిస్తున్నారు. ఏటా లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనం అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మొక్కులు, పూజలతో మేడారం ఆధ్యాత్మిక వనంగా మారుతుంది.



