మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతోపాటు కొత్తగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉన్నత పదవులను దక్కించుకునేందుకు నాయకగణమంతా క్యూ కడుతున్నారు. తమకు అనుకూలురైన రాష్ట్ర, కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కొందరైతే ఏకంగా కొద్ది రోజులుగా దిల్లీలోనే మకాం పెట్టినట్లు తెలుస్తున్నది. పదేళ్ళ తర్వాత తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఇంతకాలంగా పార్టీని అంటిపెట్టుకున్న తాము ఆ అవకాశాన్ని దక్కించుకోవాలన్న తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి మంత్రివర్గ విస్తీర్ణ విషయంలో ఇప్పటికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఎవరికి అవకాశాలివ్వాలన్న విషయంలో అధిష్టానం సూచనలు, సలహాలను తీసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. జూలై మొదటివారంలో కొత్త మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పదకొండు మంది మంత్రులున్నారు.
కాగా మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశముంది. కాని, మంత్రిపదవులు ఆశిస్తున్నవారి జాబితా మాత్రం చాలా పెద్దదిగానే ఉంది. ఈ పదవులు ఆశిస్తున్నవారిలో మొదటినుండీ కాంగ్రెస్‌లో ఉన్నవారు కాగా, తాజాగా బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నవారికి కూడా క్యాబినెట్‌లో చోటుదక్కే అవకాశాలు లేకపోలేదు. దీనితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చింది. డిసెంబర్ 9న మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కొన్ని ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలనుండి కనీసం ఒక్కరి చొప్పున అయినా తీసుకుం టారనుకుంటున్నారు. ఉమ్మడి నిజామా బాద్‌లో ఇప్పటికే మదన ్‌మోహన్, సుదర్శన్‌రెడ్డి పోటీపడు తుండగా తాజాగా బిఆర్‌ఎస్‌నుంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయాల్లో సీనియర్ అయిన ఆయనకు ఖచ్చితంగా ఏదో ఒక ఉన్నత పదవిని తప్పక ఇచ్చే అవకాశముంది. ఆయనకున్న అపార అనుభవాన్ని తాము వినియోగించుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి పోచారం చేరిక సందర్భంగా పేర్కొనడం గమనార్హం. పోచారంతోపాటు ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అయిదు గురున్నారు.
కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటివారంతా సీనియర్లే కావడంతో వారిలో ఎవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతున్నది. సిఎం రేవంత్‌రెడ్డి వద్ద కీలకమైన హోం, విద్యాశాఖ. మున్సిపల్, కార్మికశాఖలున్నాయి. వాటిని దక్కించు కోవడంకోసం పోటీ కొనసాగు తున్నది. కాగా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులతో పాటు 37 నామినేటెడ్ పోస్టులున్నాయి. వీటిని భర్తీచేసే విషయంలో అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తున్నది. కాగా మరో కీలకమైన పదవి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానం. ఈ పదవిని కాంగ్రెస్‌లోని సీనియర్లు చాలామంది ఆశిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డిలా చురుగ్గా పనిచేసేవారికే దీన్ని అప్పగించాలనుకుంటున్నారు. అయినప్పటికీ అధిష్టానాన్ని ప్రసన్నంచేసుకునేందుకు కొందరు నాయకులు దిల్లీలోనే మకాం పెట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి మధుయాస్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్‌లు దిల్ల్లీలో గట్టి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో పి. సుదర్శన్‌రెడ్డి (బోధన్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రాహిం పట్నం), రామ్మోహన్‌రెడ్డి (పరిగి), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ ్డ(మునుగోడు), వాకాటి శ్రీహరి(మక్తల్), బీర్ల అయిలయ్య (ఆలేరు), బాలూనాయక్ (రేవరకొండ), ఎమ్మెల్సీ మహేష్‌గౌడ్ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరితోపాటు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ బ్రదర్స్‌కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నవారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఖాలీగా ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జిల్లాల్లో గ్రంధాలయాల చైర్మన్‌్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, నీటి సంఘాల అధ్యక్ష స్థానాలతో మరి కొందరిని సంతృప్తిపర్చేందుకు రేవంత్‌రెడ్డి టీమ్ మల్లగుల్లాలు పడుతోంది.





