నేనోడి పోయాను
నన్నొంటర్ని చేసి
నీ వెళ్ళిపోయాక
సూర్యునిచుట్టూ
పరిభ్రమించే ఫీనిక్స్ పక్షిలా
నేనోడిపోయాను
ఈ ఏకాంత నిశిధి
వినువీధుల్లో
తారల తళకులలో
మిరుమిట్లు గొలిపే
నీ నయనాలను చూస్తూ
నీశ్వాస నా అధరాలకు దూరమై
నేనోడిపోయాను
నీకర స్పర్శ నా మేను వీడి
నీ ఎడబాటు ఎడారిలో
ఓయాసిస్సు కానరాక
నేనొంటరినై ఓడిపోయాను
నా అధరాలే నీ నుదిని ముద్దాడ లేనంత దూరాన నీ వెళ్ళిపోయాక
ఆకాశం అవని కలిసే చోటు వెతుక్కుంటూ
నేనోడిపోయాను
నా నయన ధ్వయ జీవనదులకు
కట్టలేయలేక నేనోడిపోయారు
కనికరం లేని నిశి రాత్రులలో
నా వెక్కిళ్ళే
ఈ ప్రవాహానికి గులకరాళ్ళు
నీళ్ళుంటే చాలు
వెళ్ళిపోదామన్నావు
నేనుంటే తోడు
అదే స్వర్గమన్నావు
ఎడబాటు ఎప్పటికి
తాత్కాళకమన్నావు
తుఫాను మేఘ గర్జనలో
నన్నొంటర్ని చేసి
కన్నీటి కెరటాల సంద్రాన
ఎడబాటు శాశ్వత శాసన
రుధిరాక్షరాల ఫలకాన్ని లిఖించి
నిర్ధాక్ష్యణ్యంగా నీ వెళ్ళిపోయాక
నేనోడిపోయాను
– కోట దేవదానం
రిటైర్డ్ పబ్లిక్ ప్రోసిక్యూటర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, భద్రాచలం , 9705693226




