నేను పోతున్నా…

ఈ పొద్దు ఎళ్ళిపోతున్నా
మల్ల ఆ దినాలు తిరిగొచ్చినప్పుడు
వాటెంట వస్తా… వాటిని తెస్తా!
ఎండ కన్నీళ్ళు కారుస్తోంది
వాన నిప్పులు కురిపిస్తోంది
పశువులు పొలిమేర దాటుతున్నయ్‌
‌నేనుండ ఇగ…
పచ్చికలను వెతుక్కుంటా అడువులకు పోతా!
ఊరినిండా విగ్రహాలే
మనుషుల నిండా అపోహలే
పైసల కంపు మురికి కాలువలన్నీ…
చెత్తల పండిన కుక్క ఏడుస్తోంది
సూర్యుని దిక్కు చూసి!
ముసలోళ్ళు మూగ బోయిండ్రు అర్థం అయ్యీ కాకా
కాలం అకాలం ఏకమైనయి కూడబలుక్కొనీ
భూమాతను మొండెం కాడికి పాతిపెట్టిండ్రు
ఆకాశంల నిచ్చెనలు కడుతున్నరు
మార్కెట్ల చెదలు అమ్ముతున్నరు
ఇంక పోతున్నా…
న్యాయదేవతను వెతుక్కుంటా!
ఆమె తక్కెట్ల నోట్ల కట్టలున్నయ్‌ ఒకపక్క
చింపిన రైకెలు చీరిన చీరలు ఇంకోపక్కా
కాల్చిన దేహాలు కూడా… బాట్ల లెక్క!
ఎంత జోకినా శిక్షలు కొసరేసినట్లే ఆఖరికి
అంతా అయిపోయినంక
అందరూ మరిచిపోయినంకా..!
రాజ్యం- చేపల చెరువు కాడ
కొంగ లాగ జపం చేస్తోంది
ఎప్పుడు పొడుస్తదో తెలవదు
ముక్కుతోటి మన కంట్ల!
ప్రజాస్వామ్యాన్ని కర్రకు వేలాడదీసి
చెరో పక్క ఎత్తుకవోతున్నరు-
నీళ్ళున్నకాడికని చెప్పి!
నిజానికీ యా నీళ్ళూ ఎండిపోలే
చేపలన్నీ తిరగబడితే ఉంటదీ…
చెరువు ఎరుపు రంగు పులుముకుంటది!!
చూస్తేనే వణకాలే దగ్గరికి రానిక్కే… బాంచత్‌!!!
-‌వగ్గు రఘువీర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *