రంగారెడ్డి-పాలమూరుకు కాంగ్రెస్ నేతల పిలుపు
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఛలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు హసత్తం నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు రేపు ఛలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు బయలు దేరనున్నారు. మేడిగడ్డ విజిట్ చేసే బృందంలో ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాజీ ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.
ఏడు బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు పయనంకానున్నారు. మధ్యాహ్నం భూపాల పల్లిలో లంచ్ చేయనున్నారు. సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్ట్‌గా చూపే కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదని గులాబీ పార్టీ చెబుతోంది. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చలో మేడిగడ్డ అని నేతలు అంటున్నారు. కుంగిన బ్యారేజ్‌కు మరమత్తులు చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. చలో మేడిగడ్డకు ఆటంకాలు లేకుండా బీఆర్ఎస్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముందే మేడిగడ్డ టూర్ షెడ్యూల్, రూట్ మ్యాప్‌న డీజీపీకి నేతలు అందజేశారు.





