- అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం
- ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తారా స్థాయికి రాజకీయాలు
హైదరాబాద్, ప్రజా తంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 30: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధిం చిన కేసులో విచారణ నిమిత్తం దిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసు ప్రకారం సిఎం రేవంత్‌రెడ్డి మే ఒకటవ తేదీన దిల్లీలో హాజరు కావాల్సి ఉంది. ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్, స్టేట్ సెక్రెటరీ శివకుమార్, స్పోక్స్ పర్సన్ అస్మా తస్లీమ్, నవీన్‌లను కూడా హాజరు కావాలంటూ వారికి కూడా దిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. కాగా ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు తమకు కనీసం పదిహేను రోజుల గడవుకావాలని రాష్ట్ర కాంగ్రెస్ అడిగినప్పటికీ, నోటీసులో పొందుపర్చిన ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదాని పైన రాష్ట్రంలో ఉత్కంఠ చెలరేగింది. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయా లు తారస్థాయికి చేరుకుం టున్నాయి. ఎదుటి పార్టీ తప్పులు వెతుకుతూ, వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం ద్వారా వోట్లు దండుకోవాలన్న ఎత్తుగడ ల్లో అన్ని పార్టీలున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడుతలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు విడుతల ఎన్నికలు దాదాపు సాఫీగానే ముగిసాయి. అయితే మూడవ విడుత ఎన్నికలు మాత్రం రసవత్తరంగానే సాగేట్లుగా కనిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడతున్న కాంగ్రెస్, బిజెపిల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం కొనసాగుతున్నది. దక్షిణాదిలో పట్టుకోసం బిజెపి చాలాకాలంగా అనేక రాజకీయ వ్యూహాలను రచిస్తున్నది. దక్షిణాదిలో తమ ప్రాపకానికి తెలంగాణను ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుంది. గత ఎన్నికల్లో విశ్వప్రయత్నం చేసినప్పటికీ లక్ష్యానికి చేరువ కాలేకపోయింది. కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందులో భాగాంగా జాతీయ స్థాయి నాయకులతో తెలంగాణలో విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించే విధంగా ప్రణాళికా రచన చేసింది. రాష్ట్రంలో తమతో పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు ఏ చిన్న తప్పిదాన్నైనా బూతద్దంలో చూపించడం ద్వారా ప్రజల సానుభూతిని సంపాదించుకునేందుకు సిద్ధ్దమైంది. అందులో భాగమే తాజా రిజర్వేషన్ల వివాదం. అదిప్పుడు దేశవ్యాప్త చర్చగా మారింది. అంతటితో అగకుండా కేసులు, అరెస్టులకు దారితీసేదిగా ఉంది. ఏప్రిల్ 23న తెలంగాణలోని సిద్దిపేటలో ఎన్నికల ప్రచార సభలో హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా మాటలను మార్ఫింగ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయన మాట్లాడిన వీడియోలోని మాటలను మార్ఫింగ్ చేసి ప్రజలకు తప్పుడు సమాచారం అందే విధంగా సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కూలేట్ చేశారన్నది అభియోగం. దీనిపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన మాటలకు భిన్నంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైన అమిత్‌షా దిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ప్రాథమిక విచారణలో తెలంగాణ నుండే ఆ మార్ఫింగ్ వీడియో వైరల్ అయిందని గ్రహించిన పోలీసులు విచారణలో భాగంగా రేవంత్‌రెడ్డితో పాటు, నలుగురిని మే ఒకటిన హాజరుకావాలని నోటీసులను అందజేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రచారంలో పెట్టిన మరికొందరిని గుర్తించే పనిలో కూడా కేంద్రముంది.
అయితే దిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నోటీసులు అందించే సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి కర్ణాటక ప్రచార సభలో ఉన్నారు. ఆ సభలోనే ఆయన దీనిపై స్పందిస్తూ ఈ నోటీసులకు తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వంపై పోరాటం చేసేవారినెవరినీ వదిలిపెట్టడం లేదన్నది గత పదేళ్ళ పాలనలో జరిగిన అనేక సంఘటనలే అందుకు సాక్షమంటున్న రేవంత్‌రెడ్డి, తనకు నోటీసులు పంపించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి దురాలోచన లేకపోతే ఈసారి కావాల్సిదానికన్నా ఎక్కువగా నాలుగు వందల సీట్లను ఎందుకుకావాలనుకుంటుందో చెప్పాలంటున్నారాయన. రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార ప్రవాహాన్ని అడ్డుకోవడానికే ఇలాంటి నోటీసులను కేంద్రం జారీచేస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శిస్తున్నారు. రేవంత్‌ను అరెస్టు చేస్తే ఇక మోదీ పతనం ప్రారంభమైనట్లేనంటారాయన. నిజంగానే రేవంత్‌రెడ్డి అమిత్‌షా మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తే ఆయన ను వెంటనే అరెస్టుచేయాలని సిద్ధిపేట ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. కాని పక్షంలో బడేబాయ్, చోటాబాయ్‌లు ములాఖాత్ అయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
వాస్తవంగా అమిత్‌షా తాము మళ్ళీ అధికారంలోకి వొస్తే రాజ్యాంగ విరుద్దంగా కల్పించిన ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తామన్న మాటలను, అధికారంలోకి వొస్తే మొత్తం రిజర్వేషన్లను రద్దుచేస్తామన్న మార్ఫింగ్‌తో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయన్నది ఫిర్యాదు. హోరాహోరీగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలవేళ ఇది బిజెపిని డ్యామేజీ చేసేదిగా ఉండటంతో అమిత్‌షా ఫిర్యాదులో దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు, అయితే ఇప్పటివరకు కేంద్రం తనను వ్యతిరేకించే వారిపైన ఇడి, సిబిఐ, ఐటిలను ప్రయోగిస్తుండగా ఇప్పుడు కొత్తగా దిల్లీ పోలీసులను కూడా రంగంలోకి దింపుతున్నదని సిఎం రేవంత్‌రెడ్డి కామెంట్ చేయడం కొసమెరుపు.




