‘‘‌నిష్క్రమిస్తున్న దేహాలు’’!…

ఔను!..సిగ్గు పడుతున్నాం!
నా దేశ చిత్రపటం పై
కారుతున్న నెత్తుటి ధారలు
దిక్కుల ను కలిపే సమాంతరరేఖలపై
చిధ్రమైన దేహాల ఆనవాలు.
గానం చేస్తున్న
విరామమెరుగని విషాదగీతాలు
వింటూనే వున్నాం!
నిప్పులు చెరిగిన ప్రమాద ఘంఠికలు
నెత్తుటి చేవ్రాలుతో వందలాది దేహాలు
పొరలు పొరలుగా తెగిపడుతూ..
మసిబారి తూలి పడుతున్న అవయవాలు
అనివార్యమైన దేహయాత్ర
ఎవరి దేహాన్ని వారు మోస్తున్నారో తెలియని
అస్పష్టతలు అసంబద్ద హేతువులు
గుండె కవాటాల్ని చిదిమే దృశ్యమోటి
దేహం చీల్చుకుంటూ దూసుకెళ్తుంది..

అప్రమత్తమయ్యేందుకు కూడా
అస్సలు అవకాశమే ఇవ్వని వేళ
భీకర కరాళ నృత్యహేల
సాదృశ్యం కాని కరవాలమొకటి
నిలబెట్టి నిలువునా నిష్కర్షగా
రెండు ఖండాలుగా తెగ్గోస్తూంది..
అప్రయత్నంగా ఆవహించే దుఃఖం
ఇంకిపోయిన కన్నీటి చెలిమెను
తడిమి తడిమి పలుకరిస్తుంది

ఖండాలను ఆవరించిన సంద్రాలిప్పుడు
వాస్తవాల లోతులను విశ్లేషిస్తున్నాయి..
తీరాలు చేరేటి దారులను మరిచిన
అలల చివరలు కలవరంతో
ఉబికి వచ్చే హృదయ ఘోషను
పంటిబిగువున దాచుకుంటున్నాయి..
‘‘విశ్వాసాల’’ సౌధాలు పగుళ్ళూడి
నిజంగానే నిర్జనమై,నిస్తేజమై,
నిశ్శబ్ధ పరిష్వంగంలో జారుకున్నాయి.

సద్దు మణగని సంధ్యవేళన
పొద్దుతిరుగుడు పూవు నీడలు
నిర్జీవ దేహాలపై వచ్చి వాలాయి..
పగటి వెలుగులను వెక్కిరిస్తూ
కీచురాయొకటి పాట పాడింది
విశ్రాంతి కోరిన ఊపిరుల కునుకు
నిర్దయ ఘాతానికి నిష్క్రమించింది
హఠాత్తుగా రాలిపోయిన పేగుబంధ మొకటి
కూలిపోయిన జ్ఞాపకాలను తట్టి లేపింది..
దాచిపెట్టిన మట్టిజాడల సమాధుల్లోంచి
నెత్తుటి బంధాల ఆర్తనాదమొకటి
కలత నిద్రన పలుకరించి మెలుకవచ్చింది.

అమ్మ ఒడికై అర్రుచాచే ఆర్థి గీతం
ప్రేమికకు చేరాల్సిన ప్రేమలేఖొకటి
గుక్కపట్టిన రోదనై ఎదను తడుతాయి
మైళ్ళదూరపు చివరల మలుపులవుతల
మట్టి పొదల ఆనవాల్ల స్మృతుల తడిమే
చితిమంటల వెలుగుల్లో ప్రశ్నించే గొంతుకలు
కారణాల అనవాల్లు వెదకనున్నాయి.
– అజయ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *