నా ఆరోగ్యం-నా హక్కు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ ఏడవ తేదీన జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆరోగ్య అవగాహనను పెంచుకునే ముఖ్యమైన దినోత్సవం.దీనిని 1950 నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము.ఈ రోజు ఆరోగ్య సంబంధ సమస్యల గురించి పౌరులు అవగాహన పెంచుకోవడానికి ఉద్దేశింపబడినది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందేశం ‘‘నా ఆరోగ్యం-నా హక్కు’’.ప్రపంచ దేశాలలోని పౌరులందరూ ఆరోగ్యంగా జీవించే హక్కు గురించి అవగాహన కల్పించడంమే ఈ సంవత్సరం యొక్క థీమ్‌.ప్రభుత్వాలు పౌరుల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఈ థీమ్‌ తెలియజేస్తున్నది.నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా చెప్పవచ్చు.దేశాభివృద్ధిలో, సమాజాభివృద్ధిలో ఆరోగ్యవంతమైన ప్రజలే ముందు వరసలో నిలుస్తారు.ఏ దేశంలోనైతే పౌరులు ఆరోగ్యంగా ఉంటారో ఆ దేశం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యవంతమైన సిబ్బంది ఉంటే పారిశ్రామిక మరియు సేవా రంగాల్లో కూడా ఉత్పాదకత పెరుగుతుందని చెప్పవచ్చు.అందుకే అందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా కలదు.ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా కావలసినవి విద్యా మరియు వైద్యం తప్పనిసరి. పౌరులు శారీరకంగా ,మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆర్థిక సామాజిక అంతరాలకు అతీతంగా ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.

పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి.ప్రభుత్వాలే తమ ఖర్చులతో వారికి ఉచిత ఆరోగ్య భీమా అందించాలి.దేశ జనాభాలో ముపై శాతానికి పైగా ప్రజలకు ఆరోగ్య భీమా సౌకర్యం లేదని నీతి అయోగ్‌ తన నివేదికలో వెల్లడిరచింది. ప్రైవేట్‌ ఆస్పత్రులు,ల్యాబరేటరీలు తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో చికిత్సలు మరియు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. నీతి అయోగ్‌ వెలువరించిన ‘‘ఆరోగ్య రాష్ట్రాలు -ప్రగతిశీల భారతదేశం’’ నివేదికలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది.పిల్లలకు టీకాలు వేయించే విషయంలో,ప్రభుత్వ ఆసుపత్రుల యందు జరిగే ప్రసవాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నది.పిల్లలకు టీకాలు వేయించే విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది.ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం జననాల రిజిస్ట్రేషన్‌ జరుగుచున్నది.తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్నది. మాతా శిశు సంరక్షణ సేవల్లో కూడా తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తున్నదని చెప్పవచ్చు.రాష్ట్రంలో వైద్య సిబ్బంది సహజ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతమైన ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.సాధారణ ప్రసవాలు చేసే సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహకాలు అందజేస్తున్నది. అందరికీ ఆరోగ్యం అందించే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయుచున్నది. అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయి కంటే ఎంతో మెరుగ్గా ఉంది.కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి అయోగ్‌ విడుదల చేసిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ,తమిళనాడు రాష్ట్రాల తర్వాత మూడవ స్థానంలో నిలిచింది.

నేడు హైదరాబాద్‌ నగరం హెల్త్‌ హబ్‌ గా గుర్తింపును తెచ్చుకుంది.దేశ విదేశాల ప్రజలు అత్యుత్తమ వైద్య సేవలకై హైదరాబాద్‌ కు తరలి వస్తున్నారు.వారి రాకతో హెల్త్‌ టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్నది.సంపన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో వైద్య ఖర్చులు తక్కువని భావించి విదేశాల నుంచి ఎంతోమంది మన దేశానికి వస్తున్నారు. ఆస్పత్రి చికిత్స సేవలను పేదలకు విస్తరించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌,ఆరోగ్యశ్రీ వంటి పథకాలను స్వాగతిస్తూ ఉచిత ఆసుపత్రి సేవలను అన్ని రకాల జబ్బులకు విస్తరించి అందరికీ ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా కలదు.దీనితో ఆరోగ్యం పై ప్రజలు ఖర్చు పెట్టే భారం తగ్గే అవకాశం కలదు.పేదరిక నిర్మూలనకు మరియు ఉత్పాదకతను పెంచుటకై ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వాలకు కలదు. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చే కోవిడ్‌ లాంటి మహమ్మారుల ను ఎదుర్కొనే విధంగా ప్రజారోగ్య రంగాన్ని పట్టిష్టపరచాలి.కోవిడ్‌ -19 కారణంగా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై కలదు.ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా ఆరోగ్యంగా ఉండడమే నిజమైన అరోగ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తుంది. మెరుగైన ఆరోగ్య ప్రపంచ నిర్మాణం కొరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతిన బునాల్సిన అవసరం ఎంతైనా కలదు. ప్రపంచంలోని పౌరులందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించినప్పుడే ‘‘నా ఆరోగ్యం- నా హక్కు’’ అనే సందేశానికి సార్థకత లభిస్తుంది అని చెప్పవచ్చు.
(ఏప్రిల్‌ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)

-పుల్లూరు వేణుగోపాల్‌
9701047002

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *