- కొరవడిన పర్యవేక్షణ… లక్షల రూపాయలు వృథా
- రోడ్ల నిర్మాణంలో గుత్తేదార్ల నిర్లక్ష్యం… కమీషన్ల కక్కుర్తిలో అధికారులు
పరిగి, ప్రజాతంత్ర, జూన్ 16 : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. అయితే అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రభుత్వాలు ఎంత చొరవ చూపినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి మూన్నాళ్ళ ముచ్చటగా మారిపోతున్నాయి. పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడం, వారు తమ చాంబర్‌లకే పరిమితమవుతూ ఎంబి రికార్డులు తయారు చేసి బిల్లులకు క్లియరెన్స్‌లు ఇవ్వడం, అనంతరం తమకు అందాల్సిన వాటాలను దండుకోవడం వంటివి చోటుచేసుకుంటుండడంతో రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఫలితంగా రాజుల పైకం రాళ్ల పాలు అన్న చందంగా గుత్తేదార్లు రోడ్ల నిర్మాణాలకు కేటాయిస్తున్న నిధుల నుండి అధిక మొత్తాన్ని మిగులుబాటకే ప్రాధాన్యతనిస్తున్నారు.
వారు రాజకీయ నాయకుల అండదండలతో టెండర్లు దక్కించుకుని ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిగి నియోజక వర్గంలోని పరిగి మండల కేంద్రం నుండి దోమ మండల కేంద్రం వరకు డబుల్ రోడ్డు మంజూరు కాగా అందులో దాదాపుగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5కిలో మీటర్ల మేర రోడ్డు పనులు జరగలేదు. అయితే వొదిలేసిన రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంగా మారడంతో ప్రజల నుండి విమర్శలు విన్పించడంతో ప్రజా ప్రతినిధులు చొరవ చూపి మళ్ళీ అట్టి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. అయితే డబుల్ రోడ్డు కాకుండా సింగిల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగినా ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేకుండా సదరు కాంట్రాక్టర్ పనులు కొనసాగించడం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామం చెరువు సమీపంలో రోడ్డు వేసి ఇరవై రోజులు కూడా గడవక ముందే కుంగిపోయింది. దీంతో అధికారులు, కాంట్రాక్టర్ల పని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్వాలిటీ రిపోర్టులన్నీ అంతంత మాత్రమే….
రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత క్వాలిటీ విభాగం అధికారులు సంబంధిత రోడ్డు నాణ్యతను పరిశీలించి ఫైనల్ బిల్లు చెల్లింపులకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. కానీ, క్వాలిటీ విభాగం అధికారులు నామమాత్రంగానే పర్యవేక్షణ చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మకై తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు వొస్తున్నాయి. నాణ్యత బాగుందని రిపోర్టులు ఇస్తున్నా ఏడాది తిరగక ముందే గుంతలు పడి రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. నియోజక వర్గంలో నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కరువవడంతోనే ఈ దుస్థితి ఏర్పడుతుందని, అడుగడుగునా క్వాలిటీ విభాగం అధికారుల వైఫల్యమే కనిపిస్తుందని స్థానికులు మండి పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో అధికారులు కచ్చితంగా వ్యవహరించి నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉండదంటున్నారు.
ఏ మాత్రం అవగాహన లేని కిందిస్థాయి సిబ్బందికి నాణ్యత ప్రమాణాల పనులను అప్పగిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ పనులు పూర్తయిన తర్వాతనే తూతూ మంత్రంగా రోడ్డు సాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్నారని, ఒకవేళ నాణ్యత లేదని తెలిసినా వెంటనే గుట్టు చప్పుడు కాకుండా కాంట్రాక్టర్లు అధికారులను మేనేజ్ చేస్తున్నారంటూ పలువురు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం. నాణ్యత లేకుండా పనులుచేస్తే సదరు కాంట్రాక్టర్ నుంచి నిధులను రికవరి చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్‌పై ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు.
ఇరవై రోజులకే రోడ్డు కుంగిపోయింది
రోడ్డు నిర్మాణం చేపట్టి కనీసం ఇరవై రోజులు కూడా కాలేదు. అప్పుడే రోడ్డు కుంగిపోయింది. అంతే కాక రోడ్డు పక్కన మట్టిని కూడా కాంట్రాక్టర్ సరిగా పోయలేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం.
– దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి




