ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత వస్తున్న సింగరేణి ఎన్నికల్లో అనూహ్యంగా బిఆర్‌ఎస్ దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాయకులు కూడా రాజీనామా బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరవాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో పట్టుకోసం బిఆర్‌ఎస్ ప్రయత్నించ లేదు. ఇకపోతే అధికారంలో ఉండగా సింగరేణి విషయంలో బిఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలు అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. పలు ప్రధాన సమస్యలపై హోరాహోరీగా ప్రచారం చేపట్టారు. ఇప్పుడు నేరుగా పోటీ చేస్తే తలబొప్పి కట్టవచ్చన్న సమాచారంతో ప్రత్యక్ష పోరుకు బిఆర్‌ఎస్ దూరంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. అధికార కాంగ్రెస్‌కు ఇప్పుడీ ఎన్నికలు ప్రతిష్టగానే భావించాలి. అయితే కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా నేరుగా ప్రచారంలో పాల్గొనడం లేదు. సింగరేణి ఏరియాలో ఇటీవల కాంగ్రెస్ గన విజయం సాధించింది. దాని అనుబంధ ఎఐటియూసి ఇప్పుడు ఇదే ధీమాతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా ఎప్పు డెప్పుడా అని ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న జరగను న్నాయి. హైకోర్టు కూడా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక అనివార్యంగా ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం 14 సంఘాలు నామినేషన్లు వేసినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్ మధ్య ఉండనుంది. టీబీజీకేఎస్ పోటీకి దూరంగా ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే తాము బరిలో ఉంటున్నామని శనివారం ఆ యూనియన్ నాయకులు ప్రకటించారు. దీంతో మూడు యూనియన్ల నడుమ త్రిముఖ పోటీ నెలకొంది.
ఈ క్రమంలో సింగరేణి కార్మికులు ఏ యూనియన్‌ను ఆదరిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అధికారం దక్కించు కున్న టిజిబికెఎస్ ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదని, సింగరేణిపై అధికార పార్టీ నేతుల ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పెత్తనం పరోక్షంగా ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్ 5వ తేదీన జరుగగా, బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం (టీబీజీకేఎస్) గెలుపొందింది. కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈసారి జరుగుతన్న పోరులో కార్మిక సంఘాలు తమ భవిష్యత్తును పరీక్షించు కునేందుకు ముందుకు సాగుతున్నాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం తో పాటు..సింగరేణి పరిధిలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. దీంతో ఆ పార్టీ అధినేత టీబీజీకేఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేసి పోటీలో ఉండేది లేదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నిరాశ చెందిన యూనియన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పదవులకు రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. టీబీజీకేఎస్ ఎన్నికల బరిలో ఉండదని అనుకుంటున్న తరుణంలో తాము పోటీ చేస్తామని యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తాము పోటీ చేస్తున్నామని యూనియన్ నాయకులు చెప్పారు. గనులు, విభాగాలపై తాము సాధించిన హక్కులను కార్మికులకు వివరిస్తున్నారు.
ఏఐటీయూసీ హయాంలోనే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ, యాంత్రీకరణ ప్రారంభమయ్యిందని, డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టాయని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐ కలిసి పనిచేసినా సింగరేణిలో మాత్రం ఎవరికి వారే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కలిసి పనిచేస్తాయని ప్రచారం జరిగింది. కానీ యూనియన్ ఎన్నికల వరకు వచ్చేసరికి తాము విడి విడిగా పోటీచేసి తమ సత్తా చాటుకునేందుకు సమాయత్తమయ్యాయి. తమ మధ్య పొత్తు ఉండదని, వేర్వేరుగా పోటీ పడుతామని రెండు యూనియన్లు పేర్కొన్నాయి. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గతంలో మూడుసార్లు గుర్తింపు సంఘంగా ఉన్నది. ప్రస్తుతం నాలుగోసారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ యూనియన్‌కు కార్మికుల్లో ఆదరణ ఉందని, విజయం సాధించడం ఖాయమని ఏఐటీయూసీ నాయకులు చెబుతున్నారు. టీబీజీకేఎస్ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా గనులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నాటి సిఎం కేసీఆర్ కార్మికులకు పలు హావిూలు ఇచ్చారని, కానీ అందులో చాలావరకు నెరవేర్చ లేదని పేర్కొంటు న్నారు. ఎంతోమంది డిపెండెం ట్లకు ఉద్యోగాలు రాకుండా పోయాయని, వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మెడికల్ అన్‌ఫిట్ దందా, క్వార్టర్, సర్ఫేస్.. ఇలా ఏ పని కావాలన్నా ఒక రేటు కట్టి వసూళ్లు చేశారని, దీంతో కార్మికవర్గంలో టీబీజీకేఎస్ యూని యన్‌పై ఆగ్రహం పెల్లుబుకుతోందని, ఇది తమకు లాభిస్తుందని ఏఐటీయూసీ నాయకులు పేర్కొంటున్నారు.
ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ రెండోసారి విజయం కోసం పోరాడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరడంతో తమకు లాభిస్తుందని యూనియన్ నాయకులు భావిస్తున్నారు. పైగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఉన్న 11 నియోజకవర్గాల్లో మొననటి అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వారు తమ యూనియన్ గెలుపుకోసం కృషి చేస్తారనే భావనలో ఉన్నారు. ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ యూనియన్లు కార్మికులకు ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చలేకపోయాయని, వీటిపై జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం రాష్రంలో ఉన్నందున ఎలాంటి హావిూలు ఇచ్చినా నెరవేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. ఇటీవల టీబీజీకేఎస్ నుంచి భారీగా ఐఎన్‌టీయూసీలోకి వలసలు జరుగడంతో గెలుపు తమదేనని భావిస్తున్నారు. ఎన్నికకు మరోరోజు మాత్రమే గడువు మిగిలి ఉండడంతో ప్రతి కార్మికుడిని కలుస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. మొత్తంగా ఇప్పుడు సింగరేణి కార్మికులు ఎవరిని ఆదరిస్తారన్నది చూడాలి.





