ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
మాంసం ముద్దలైన మృతదేహాలు..కేసు నమోదు చేసి పోలీసుల విచారణ
నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 26 : నల్లగొండలోని బర్కత్ పురా కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజి లో ఏసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలి అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలై మృతి చెందారు. వివరాలలోనికి వెళితే షేక్ కలీం అనే అతను గత పది సంవత్సరాలుగా పండ్ల వ్యాపారం బర్కత్ పుర నందు నిర్వహిస్తున్నాడు, ప్రతి 15 రోజులకు ఒకసారి ఏసీ సిలిండర్ గ్యాస్ అయిపోయిన వెంటనే మారుస్తుంటారు.
సోమవారం రోజు కూడా అలాగే మార్చే క్రమంలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఎస్.కె.కలీం(44) మరియు తన వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేసే ఎం.డి సాజీద్(41) ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.చనిపోయిన వ్యక్తి కలీం యొక్క భార్య ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీని పోస్ట్ మార్టం అనంతరం, కుటుంబ సభ్యులకు అప్పగించించినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో పక్కనే ఉన్న మరో నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుండి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు.నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.



