‘‘ఒక్క అవకాశమన్న’’
తీయని మాటలకు
కొమ్ముకాసినందుకు
కరువయ్యింది ప్రశాంతత మానవాళికి.
ఎటుచూసినా నిరాశానిస్పృహలే,
ఏమీచేయలేని నిస్సహాయతలే.
ఎదుటివారి అభివృద్ధిని
జీర్ణించుకోలేని
నయవంచకుల పాలనలో
మంచికి,మానవత్వానికి చోటులేదు.
అవినీతికి రెక్కల్ని మొలిపిస్తూ
సంకుచిత భావాల్ని
స్వైరవిహారం చేయిస్తోంటే,
సమతా మమతలు కరువవగా
ఈర్ష్యా అసూయలలో
మునిగి తేలుతూ,
మాట నెగ్గించుకోవాలన్న
మూర్ఖత్వంతో,
కుళ్ళూ కుతంత్రాలతో,
ప్రకృతిని హింసిస్తూ
ఋతువుల్ని కూడా మార్చేస్తూ
తాను కూర్చొన్న కొమ్మను
తానే నరుక్కొంటోన్న
దౌర్భాగ్య జీవితాల్ని కని,
విస్తుపోతోంది ప్రకృతి మాత కూడా.
కొండల్నీ, గుట్టల్నీ పిండిచేస్తోన్న
ఈ కబంధహస్తాలను తెగనరికేదెవ్వరో
ఆ రోజెప్పుడో అని ఎదురుచూస్తోంది
శోకతప్త హృదయంతో…
– వేమూరి శ్రీనివాస్, 9912128967




