ధరణి పేరుతో భూ సమస్యలు

  • రైతుబంధుతో బీడుభూములుగా మార్చే కుట్ర
  • త్రిపుల్‌ ఆర్‌ ‌బాధితుల ధర్నాలో గద్దర్‌

‌యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర,మే29: ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ అన్నారు.  అలైన్మెంట్‌ ‌మార్చాలని త్రిబుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ‌ధర్నా చౌక్‌ ‌వద్ద సోమవారం రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తొలి రోజు దీక్షలో గద్దర్‌ ‌పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. భూ సమస్య తెలంగాణ సమస్య అన్నారు. దీన్ని పరిష్కరించకుండా ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుందని అననారు. నిజాం ఉన్నప్పటి నుంచి ఇక్కడ భూమి సమస్య ఉందన్నారు.  పంట పెట్టుబడి సాయం పేరుతో బీడు భూములుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని గద్దర్‌ ఆరోపించారు.

బీడు భూములను కార్పొరేట్‌ ‌కు ధారాధత్తం చేశారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ ‌లో కూడా భూ పోరాటాలు జరిగాయి..ప్రపంచ యుద్దాలు కూడా భూమి కోసమే జరిగాయని గద్దర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో రైతులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వాపోయారు. భువనగిరి సభ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం మొదలైందన్నారు. ఓటు అనే ఆయుధంతో పోరాడండి, విప్లవాన్ని తీసుకురండి అంటూ పిలుపునిచ్చారు. పార్లమెంటులో రైతు చట్టాలు చేస్తే, పంజాబ్‌ ‌రైతులు పోరాటం చేసి రద్దు చేయించారు.. అదే విధంగా తెలంగాణలో భూసేకరణ జీవోను రద్దు చేయిద్దాం.. భూములు కోల్పోతున్న రైతులకు భూమి ఇవ్వాలని కోరుతున్నామని గద్దర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *