‘‘ఒక వైపు ఆకారణంగా ముందస్తుగా ఒక శాసన సభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చే పరిస్థితి కల్పించి ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తే,మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నడు లేనంతగా మని మధ్యం ఏరులైపారుతున్న పరిస్థితి.ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది.’’
ప్రజాస్వామ్య వ్యవస్థ కు పునాది రాయి ఎన్నికల వ్యవస్థ.ఇది స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ బద్ద సంస్థ. తనకున్న అధికార పరిధి కి లోబడి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది.భిన్న మతాలు,భిన్న కులాలు,భిన్న సంస్క్రతులు కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో ఒక్క ఓటు,ఒకే విలువ అనే భావనను ఎన్నికల సంఘం అమలు చేస్తుంది.ఓటు ఒక హక్కు మాత్రమే కాక ఒక బాధ్యత కూడా. అది పౌరులకివ్వబడిన ఒక అరుదైన గౌరవం. ఈ హక్కుని ఉపయోగించుకొని పౌరులు,వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కర్తవ్యం ఎన్నికల సంఘానిదే.ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరం. పార్లమెంట్ చేసిన పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నికలు జరిగే నియోజకవర్గం ప్రాంతం యొక్క భౌగోళిక పరిధిని నిర్ణయించడం,ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం,ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం,నామినేషన్లు స్వీకరించడం, పరిశీలించడం,పోలింగ్ తేదీల ఖరారు చేయడం,పర్యవేక్షణ చేయడం,రాజకీయ పార్టీలను గుర్తించడం,చిహ్నాలను కేటాయించడం,ఎన్నికల సమయంలో పార్టీలు పాటించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి అమలుచేయడం,ఎన్నికల్లో జరిగే అక్రమాలను పరిశీలించడానికి విచారణాధికారులను నియమించడం లాంటి పనులను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
షెడ్యూల్ ప్రకటించే తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటో కూడా స్పష్ఠమైన సంపుటి రూపంలో చేరవేస్తుంది.దీనిలోని నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల నిబంధనావళి ని ఉల్లంఘించినట్లుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని కూడా స్పష్ఠపరుస్తుంది. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రజలే ఓటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని,అభివృద్ధి ని సరిగ్గా పట్టించుకోకపోతే మళ్ళీ ఎన్నికలలో వారిని ఎన్నుకోరనే నినాదం ఉంది. కాని భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలను అందరు అర్ధం చేసుకోవడం కొంత కష్ఠమే.కారణం ఏమిటంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటమే.చేయాల్సిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించకుండా వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎన్నికల ప్రక్రియ లో రాజకీయ పార్టీలు వివిధ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టి లోంగదీసుకుంటున్నాయి.ఈ తతంగం మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం యధేచ్ఛగా కొనసాగుతోంది.దీనికి పోలింగ్ సిబ్బందిని కూడా మినహాయింపేమి కాదు.
అటు కేంద్రం లోను, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి.ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘‘మమ్ములను గెలిపిస్తే’’ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతదని అలిమికాని హమీలు ప్రకటిస్తున్నాయి.మరొక జాతీయ పార్టీ నుంచి పోటిచేస్తున్న అభ్యర్థమో ప్రజలకు ఏమి అభివృద్ధి చేస్తడో చెప్పకుండా ‘‘కుటుంబ పాలనను’’అంతం చేయడమే నా ధ్యేయం అంటున్నాడు.కాని ఏ పార్టీ కూడా వాళ్ల సమస్యల గురించి గాని,వాళ్ళ ఆకాంక్షల గురించి గాని అడగడం లేదు.గ్రామాలలో ప్రజలు తాగునీటి సమస్య గురించి గాని,రోడ్ల అధ్వాన్నపరిస్థితుల గురించి గాని, చదువుకున్న వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏమి కల్పిస్తారో అనే దాని గురించి గాని,వాళ్ళ జీవనోపాధి గురించి గాని,అక్కడి భూ నిర్వాసితుల పరిహారం గురించి గాని,ఆ ప్రాంత అభివృద్ధి గురించి గాని చర్చ లేదు.ప్రజలలో చర్చ అంతా కూడా ఏ పార్టీ ఓటుకు ఎంత ఇస్తుంది..? ఎవరు ఎక్కువ మొత్తంలో ఇస్తారు.? అనే విషయంపైనే చర్చ జరుగుతుంది.అయా గ్రామాల్లో ఒకొక్క పార్టీ లక్షల రూపాయలు పెట్టి ‘‘కిరాయిలకు’’ ఇండ్లు తీసుకొని తిష్ఠ వేసిన స్థానికేతర రాజకీయ పార్టీల ప్రతినిధులు ‘‘మీకు ఓటుకు ఎంత కావాలని’’ నేరుగా ఓటర్లను అడుగుతున్న పరిస్థితి.వందల కొద్ది విలువైన వాహనాలు గ్రామాలలో తిరుగుతూ హడావుడి సృష్టిస్తున్నాయి. స్థానిక సమస్యల మీద దృష్టి సారించకుండా సమస్యలను గాలికి వదిలేసి ‘‘డబ్బు, మద్యం’’ద్వారా ఓటర్లను లొంగదీసుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో,ఓటర్లతో బేరమాడుతున్న వ్యవహారం స్పష్టం గా కనబడుతుంది.ఓటర్లను మభ్యపెట్టడానికి అనైతిక, అప్రజాస్వామిక పద్దతులను రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి.
ఇక్కడ ఎన్నికల కమిషన్ విధులలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలవుతుంధా.! లేదా.! ఎన్నికల ప్రక్రియ నియమానుసారంగా నడుస్తుందా.! ఎక్కడనైనా అతిక్రమాలు జరుగుతున్నాయా.! అన్న విషయాన్ని నిశ్చితంగా గమనించాలి.పరిమితికి మించి ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలపై నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయాలి.ప్రజలను వివిధ ప్రలోభాలకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ది.ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కూడ ఎన్నికల సంఘానిదే.కానీ ఎన్నికల కమిషన్ సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నట్లుగాని,నిఘా వ్యవస్థ ను పటిష్టం చేసినట్లు గా గాని కనిపించటంలేదు. ’’స్వేచ్ఛగా ఓటు వేయమని ఓటు వేయడం నీ బాధ్యత’’ అని బ్యానర్లు తప్ప ఓటర్లను చైతన్యం చేస్తున్న ఏ విషయాలు మునుగోడు లో కనపడటం లేదు. ఒక వైపు ఆకారణంగా ముందస్తుగా ఒక శాసన సభ్యుడు రాజీనామా చేసి ఉపఎన్నిక వచ్చే పరిస్థితి కల్పించి ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తే,మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో ఎన్నడు లేనంతగా మని మధ్యం ఏరులైపారుతున్న పరిస్థితి.ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది.ఇటువంటి దుస్థితుల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా భారతధేశంలో ఒక్కొక్క ఎన్నిక సమర్థవంతమైన ప్రభుత్వాలకు బదులు అసమర్ధ ప్రభుత్వాలను అధికారంలోకి తెస్తూ మంచికి బదులు చెడును భారతీయ సమాజం కొని తెచ్చుకుంటున్నది.కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడం మన కర్తవ్యం. కాబట్టి ప్రతి ఓటరు రాష్ట్రం లేదా దేశంలో పాలనా తన చేతిలోనే ఉందని తెలుసుకొని తమ ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోవాలి.అలా ఐతే బాధ్యత యుత ప్రభుత్వాలకు పునాది పడుతుంది.లేనట్లయితే ప్రజాస్వామ్యం ఓడిపో యినట్లవుతుంది.
-పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




