దోమ కాటును నిలువరించలేమా.?

‘‘అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం.’’

కంటికి కనిపించన కరోనా విపత్తు కల్లోలంలో విశ్వమానవాళి కొట్టుకుపోయింది, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఊపిరి పీల్చడానికి విశ్వప్రయత్నాలు చేసింది, ఇంకా కోవిడ్‌-19 ‌కోరలను గుర్తుచేసుకుంటూ భయం భయంగా జీవనయానం చేస్తూనే ఉంది. కనిపించని వైరస్‌ ‌విపత్తు వలె కాకుండా కనిపించే దోమలు శతాబ్దాలుగా తమ కోరలతో మనుషుల్ని కాటు వేస్తూ ప్రజారోగ్య సమస్యను సృష్టించి మరో మహమ్మారి వలె మానవాళిని వెంటపడుతూనే ఉంది. శతాబ్దాల దోమ కాటుకు నేటికీ సమాధానం దొరకలేదు, వెతుకుతారనే ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు దోమలను ప్రజలకు వదిలేసి, జాగ్రత్తగా ఉండండంటూ నీతి పలుకులు పలుకుతున్నారేగాని, దోమల నివారణకు సమగ్ర పథకాలను అమలు పరచడంలో విఫలమైనారని 70 శాతం ప్రజలు విశ్వసిస్తున్నారు. దోమ కాటు నుంచి రక్షణ పొందడానికి దాదాపు 44 శాతం కుటుంబాలు మస్కిటో రిపెలెంట్స్ ‌మెషిన్స్, ‌కాయిల్స్, ‌రాకెట్స్, ‌లిక్విడ్స్, ‌స్ప్రేలు, క్రీమ్స్, ‌ఫాగింగ్స్, ‌పాచ్ఛెస్‌ ‌లాంటి జాగ్రత్తల కోసం నెలకు కనీసం రూ 200/- వెచ్చిస్తున్నారు. ఇటీవల డెంగ్యూ వ్యాధిగ్రస్థుల సంఖ్య దినదినం పెరుగుతున్నదని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

దోమ కాటు సంబంధ వ్యాధులు:
దోమ కాటుతో సంక్రమించే ప్రోటోజోవా, మైయాసిస్‌, ‌హెల్మింథియాసిస్‌, ‌వైరస్‌ ‌లాంటి సూక్ష్మజీవుల కారణంగా వ్యాధులు కలుగుతాయి. అనాఫిలిస్‌ ‌దోమ కాటుతో మలేరియా, ఎన్సిఫలైటిస్‌/‌ఫైలేరియాసిస్‌ ‌లాంటి వ్యాధులు, ఏడెస్‌ ‌రకం దోమ కాటుతో డెంగ్యూ, చికెన్‌ ‌గున్యా, లింఫొటిక్‌ ‌ఫైలేరియాసిస్‌, ‌జీకా వైరల్‌ ‌జ్వరం, యెల్లో వైరల్‌ ‌ఫివర్‌ ‌లాంటి రోగాలు, క్యూలెక్స్ ‌రకం దోమ కాటుతో జపనీస్‌ ఎన్సిఫలైటిస్‌, ‌వెస్ట్ ‌నైల్‌ ‌వైరస్‌, ‌ఫైలేరియాసిస్‌ ‌లాంటి ప్రాణాపాయ వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రపంచవ్యాప్త వ్యాధుల్లో 17 శాతం అంటువ్యాధులు దోమ కాటు లాంటి వెక్టర్‌-‌బార్న్ ‌రోగాలతో సతమతం అవుతున్నారని, ఏడాదికి 7 లక్షల మరణాలు నమోదు అవుతున్నాయని ఐరాస నివేదికలు తెలుయజేస్తున్నాయి. దోమ కాటుతో సంక్రమించే మలేరియా బారిన ఏడాదికి 219 మిలియన్ల ప్రజలు పడుతున్నారని, కనీసం 4 లక్షల మరణాలు నమోదు కావడం గమనించబడింది. ప్రపంచవ్యాప్తంగా 129 దేశాలకు చెందిన 3.9 బిలియన్ల ప్రజలు డెంగ్యూ బారినపడవచ్చని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో 95 శాతం జనాభా అపరిశుభ్ర నివాస ప్రాంతాల్లో దోమలతో సహజీవనం చేస్తూ ఉండడంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దోమ కాటు వ్యాధులు అధికంగా ఒరిస్సా, ఝార్ఖండ్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ‌యంపీ, ఏపీ, మహారాష్ట్రా, గుజరాత్‌, ‌కర్నాటక, వెస్ట్ ‌బెంగాల్‌ ‌లాంటి రాష్ట్రాల మురికి వాడలు, గ్రామీణ, గిరిజ ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నది.

మలేరియా టీకాలు రానున్నాయా ?
ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొనుటతో దోమ కాటు వ్యాధుల్ని నివారించవచ్చని తెలుసుకోవాలి. దోమ కాటు వ్యాధుల వల్ల విశ్వవ్యాప్తంగా దేశాలు అధిక ఆర్థిక వనరులను ఖర్చు చేయడం, దోమల నిర్మూలన పోరాటాలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన బుర్కినా ఫాసో, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా (యస్‌ఐఐ)‌లతో పాటు పలు ప్రపంచ సంస్థలు ప్లాస్మోడియం ఫాల్సిపారమ్‌ ఏక కణ జీవి కారణం మలేరియా వ్యతిరేక టీకాలను రూపొందించే పరిశోధనలు చేయడం, ఆ ఫలితాలు క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌స్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటీవల రూపొందించిన ‘ఆర్‌21’ ‌మలేరియా టీకా 77 శాతం ఎఫికసీని ప్రదర్శించిందని తెలుస్తున్నది. యూకెకు చెందిన ‘గ్లాస్కో స్మిత్‌ ‌క్లైమ్‌’, ‌లండన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌హైజీన్‌ అం‌డ్‌ ‌ట్రేపికల్‌ ‌మెడిసిన్‌ ‌సమన్యయంతో రూపొందించిన ‘మాస్క్విరిక్స్’ ‌టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించినట్లు తెలుస్తున్నది. ఈ మలేరియా టీకాను కెన్యా, మలావి, ఘానా లాంటి దేశాల్లో 8 లక్షల బాలలపై ప్రయోగించడం, 50 శాతానికి పైగా ఎఫికసీ గుర్తించడం కూడా జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి. గ్లాస్కో సంస్థతో హైదరాబాద్‌?‌కు చెందిన ‘భారత్‌ ‌బయోటెక్‌’ ‌కంపెనీ ఒప్పందం ద్వారా భువనేశ్వర్‌ ‌కేంద్రంగా ఇండియాలో కూడా మలేరియా టీకా రూపొందించే ప్రయోగాలు కొనసాగనున్నాయని తెలుస్తున్నది.

డెంగ్యూ టీకాల ప్రయోగాలు:
ఏడెస్‌ ఏజిప్టీ రకం దోమ కాటుతో సంక్రమించే డెంగ్యూ వ్యాధి ఇండియాలో ప్రాణాంతకంగా మారుతున్నది. నాలుగు రకాలైన డెంగ్యూ వైరస్‌లు కనుగొనబడిన కారణంగా ఒకే రకమైన టీకా రూపొందించడం కష్టంగా తోస్తున్నది. ‘డెంగ్వాక్షిన్‌’ అనబడే డెంగ్యూ టీకాను ‘సనోఫీ పాస్చర్‌’ ‌రూపొందించగా 45-78 ఎఫికసీతో నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లకు వ్యతిరేకంగా క్రియాశీలతను ప్రదర్శించిందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. కోవిడ్‌-19 ‌టీకా రూపొందించిన మార్గంలోనే డెంగ్యూకు వ్యతిరేకంగా కూడా భారత్‌కు చెందిన ‘జైడస్‌ ‌కాడిలా’ డియన్‌ఏ ‌టీకాను రూపొందించడం జరుగుతున్నది. దోమలు, ఈగలు లాంటి వెక్టర్‌-‌బార్న్ ‌వ్యాధుల నివారణకు టీకాలను రూపొందించడం, వ్యాధులను నయం చేసే ఔషధాలు/చికిత్స మార్గాలు అందుబాటులో ఉంచడం, వ్యాధులు సంక్రమించకుండా పలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమైనవిగా గుర్తించాలి. అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం

.image.png

   డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
 కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *