ప్రపంచవ్యాప్తంగా 23,625 యూనివర్సిటీలు ఉన్నత విద్యాబోధనలో నిమగ్నమై ఉండగా, మన భారతావనిలో 1,114 విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా వితరణ సేవలో పుణీతం అవుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యమైన 1,000 యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల జాబితాలో మన దేశానికి చెందిన 91 యూనివర్సిటీలకు మాత్రమే చోటు దక్కడం గమనించాలి. దేశంలోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఐటీలు లాంటివి మినహయిస్తే అధిక శాతం విశ్వవిద్యాలయాలు నాణ్యాతాలోపంతో ఉన్నత విద్యాబోధనలో నీళ్లు నములుతున్నాయి. దేశీయ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన బోధనలు, పరిశోధనలు, సృజనశీల ఆవిష్కరణలు, విలక్షణ ఆలోచనలు మృగ్యం అయ్యాయనే వాదనలు నానాటికీ బలపడుతున్నాయి. డిజిటల్ యుగంలో భూగోళమే కుగ్రామమైన వేళ మన యువత అంతర్జాతీయ స్థాయి విజ్ఞానం, నైపుణ్యాలను పొందడానికి మన విశ్వవిద్యాలయాలు ఇకనైనా మొద్దు నిద్రనుమాని యువభారతాన్ని నైపుణ్య అండగా మార్చాలని విద్యాధికులు కోరుతున్నారు.
సంస్కరణల సంజీవని కావాలి:
నాణ్యతలోపంతో మూర్చబోయిన మన ఉన్నత విద్యా సంస్థలను పునరుజ్జీవింపజేయడానికి ఉన్నతాధికారులు వీరహనుమలుగా మారి సంస్కరణల సంజీవనిని తెచ్చి ఉపయోగించాల్సిందే. నాణ్యమైన అధ్యాపకులు/శాస్త్రవేత్తలు, డిజిటల్ బోధనాపరమైన పద్ధతులు, ప్రయోగశాల నైపుణ్యాల పెంపు, ప్రమాణాలతో కూడిన పరిశోధనలు, సృజన పోషణలు, ఇన్నొవేషన్ కొత్త కాంతులు, సమకాలీన పాఠ్యాంశాల నిర్ణయం లాంటి అంశాల్లో సకారాత్మక మార్పులు తక్షణమే తీసుకురావాలి. యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన విద్యార్థులే మన విశ్వవిద్యాలయాల ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్స్ కావాలి. ప్రాంగణ నియామకాలకు బహుళజాతి కంపెనీలు యూనివర్సిటీ ద్వారాల వద్ద క్యూ కట్టాలి. కొన్ని మినహా అధిక శాతం మన దేశీయ విశ్వవిద్యాలయాలు అర్హత కలిగిన బోధనా సిబ్బంది కొరత, మౌళిక వనరుల లేమి, ప్రయోగశాలల దుస్థితులు, పరిశోధనలకు మంగళం పాడడం లాంటి పలు సమస్యల వలయంలో చిక్కి సతమతం అవుతున్నాయి.
డిజిటల్ బోధనలు:
నేడు సాంప్రదాయ బోధనా పద్దతులకు బదులుగా డిజిటల్ టెక్నాలజీ బోధనలు, ప్రపంచ పోటీ తట్టుకునే యువ మేధను తయారు చేయడం, ప్రయోగశాల నైపుణ్యాలకు పెద్ద పీట వేయడం, యూనివర్సిటీ ప్రాంగణాలనుఅంతర్జాతీయ స్థాయి సంస్థలుగా పునరుజ్జీవింపజేయడం, నాణ్యత కలిగిన పరిశోధనా పత్రాలను ప్రచురించడం, క్రియేటివిటీ కిటికీలు తెరవడం, ఇన్నొవేషన్‌ను ఆహ్వానించడం, క్రిటికల్ థింకింగ్‌కు పట్టం కట్టడం, అనలిటికల్ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆధునిక టెక్నాలజీ వాడకంలో ముందు నిలపడం లాంటి పలు సంస్కరణలు సత్వరమే తీసుకురావాలి. అర్హతలేని అవుట్‌డేటెడ్ అధ్యాపకులను పక్కకు నెట్టి, నవ్య నైపుణ్యశీలురైన డిజిటల్ యుగపు ఆచార్సయులను ఆహ్వానించి యూనివర్సిటీలను సరస్వతి కోవెలలుగా మార్చడానికి తొలి అడుగు నేడే పడాలి. జ్నాపక శక్తితో పాటు విశ్లేషణాత్మక సామర్థ్యం, సృజనశీల చిరునామా కలిగిన యువ మేధను తయారు చేసే కేంద్రాలుగా యూనివర్సిటీలు మారాలి. ప్రపంచం గర్వించే పరిశోధనాలయాలుగా మన యూనివర్సిటీలు పేరు తెచ్చుకోవాలి. విదేశీ విద్యార్థులు మన యూనివర్సిటీల్లో చేరడానికి పోటీ పడాలి. అర్థవంతమైన, అత్యాధునిక, విలక్షణ, అవసర పరిశోధనలు మేధో హక్కులను (పేటెంట్స్) పొందే స్థాయికి మన యూనివర్సిటీలు చేరాలి. మన పరిశోధనా పత్రాలకు ప్రపంచ శాస్త్రజ్ఞులు సలాం కొట్టే స్థాయి రావాలి.
ఉన్నత విద్య ప్రైవేటీకరణ:
ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలలు పుట్టగొడుగుల్లా రావడంతో వ్యాపార ధోరిణి పెరుగుతూ లాభాల్లో పోటీ పడుతున్నాయి. విద్యా విలువలు వెనుక వరసకు చేరాయి. యూనివర్సిటీలు లాభాల పంట పండించే పరిశ్రమలుగా మారాయి. సామాజిక చైతన్యం తీసుకురావలసిన యూనివర్సిటీలు, నిరుద్యోగులను తయారు చేసే కార్మాగారాలుగా మారుతున్నాయి. నిధుల కొరత పేరుతో బాధ్యతలను మరిచి సర్దుకు పోవలసిన దుస్థితి రావడం రేపటి యువభారతానికి శాపంగా మారనుంది. పరిశ్రమలతో అనుసంధానం కావలసిన యూనివర్సిటీలు అనాధలుగా మారుతుండడం విచారకరం. డిజిటల్ రంగంలో రాణించడంతో, విద్యా బోధనలో అప్‌డేటెడ్ సంస్కరణలు తేవడం, నాణ్యమైన పరిశోధనా కేంద్రాలుగా మారడానికి, సమాజ సమస్యలకు తగు పరిష్కారాలు ప్రతిపాదించడం, రేపటి టెక్నోక్రాట్లను తయారు చేయడం, ప్రపంచ యువత మన యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు ఉవ్విళ్లూరడానికి అవసరమైన సంస్కరణలు తీసుకువచ్చి మన అవుట్‌డేటెడ్ విశ్వవిద్యాలయాలను సత్వరమే పునరుజ్జీవన దిశగా వడివడిగా అడుగులు పడాలి. మన యువభారతానికి నాణ్యమైన నైపుణ్య యూనివర్సిటీ విద్య అందితేనే ప్రపంచ యవనికపై భారత యూనివర్సిటీలు జ్ఞానకాంతులు పంచే కేంద్రాలుగా మారతాయని కళ్లు తెరిచి యువభారతాన్ని నైపుణ్య భారతంగా మార్చుదాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037





