- ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకుంటున్నారు
- పేరు మార్చుకున్నంత మాత్రాన టిఆర్ఎస్ జాతీయ పార్టీ అవుతుందా
- బిజెపి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలో రాష్ట్ర నాయకుల మద్దతు కోరిన మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బరిలో ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్గీ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో ఏం చేశారంటున్నారు…మేము దేశాన్ని ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దాం. ప్రాజెక్టులు నిర్మించాం.పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశాం. భాజపా, దాని వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ కలిసి మేము నెలకొల్పిన వాటిని ఒకదాని తర్వాత మరొకదాన్ని అమ్మేస్తూ వొస్తున్నారు. కొందరిని కుబేరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రూపాయి విలువ 82.82కి పడిపోయింది. బియ్యం, పప్పులు, పెట్రోల్, డీజిల్.. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు జీఎస్టీ కారణంగా ఆకాశాన్నంటు తున్నాయి. మా హయాంలో రూ.414గా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ రూ.1,100 అయింది. మహిళలకు ఉచితంగా ఇచ్చే పథకాలనూ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి.
ఇలాంటి ధోరణులపై పోరాడేందుకే నేను నిలబడుతున్నాను.’ అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇక పేరు మార్చుకున్నంత మాత్రాన తెరాస జాతీయ పార్టీ అయిపోదని ఖర్గే వ్యాఖ్యానించారు. గతంలో చాలా ప్రాంతీయ పార్టీలు పేరు మార్చుకున్నా.. జాతీయ పార్టీలు కాలేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన..రాష్ట్ర పార్టీ మద్దతు కోసం శనివారం హైదరాబాద్‌కు వొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో నేతల మధ్యే ఈ ఎన్నిక జరుగుతుందన్న ఖర్గే..భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక జరగలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ పార్టీలో ఎన్నిక జరుగుతుందని.. భాజపా చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదన్నారు. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో పీసీసీ ప్రతినిధులతో ఖర్గే సమావేశమయ్యారు. తొమ్మిది వేలకు పైగా ఉన్న వోటర్లను తాను నేరుగా కలిసి వోటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటించి, కాంగ్రెస్ వోటర్లను అభ్యర్థించానని పేర్కొన్న ఖర్గే.. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయన్నారు.
ఇప్పుడు ఐదోసారి.. తాను బరిలో దిగానని తెలిపారు. ఈ క్రమంలోనే ఉదయ్‌పూర్ చింతన్ బైటక్లో తీసుకున్న డిక్లరేషన్‌ను అమలు చేస్తానన్న ఖర్గే.. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామన్నారు. శశిథరూర్ కూడా ఇక్కడికి వొచ్చి ప్రచారం. చేసుకోవచ్చన్నారు. ఇందులో ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు. ‘భాజపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకమే లేదు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నడ్డాలను ఎన్నికలు జరిపే ఎన్నుకున్నారా.? పైగా నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. ముందు రు పాటించకుండా ఇతరుల గురించి మాట్లాడటమెందుకు? ప్రజాస్వామ్య విధానం కాకుండా ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరించే భాజపాకు కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల గురించి మాట్లాడే హక్కులేదు.
టిఆర్ఎస్ బిఆర్ఎస్గా పేరు మార్పుపై మాట్లాడుతూ.. ‘ఏడీఎంకేగా ఉన్న పార్టీ ఏఐడీఎంకేగా మారింది. టీఎంసీగా ఉన్న పార్టీ ఆల్ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అయింది. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా పేరు మార్చుకున్నాయి. కానీ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వాటిలో ఎవరూ చేరలేదు’ అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేవంత్, ఉత్తమ్, పొన్నం, వీహెచ్, పొన్నాల, సంపత్ స్వాగతం పలికారు. ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా హైదరాబాద్ వొచ్చారు. అక్కడి నుంచి గాంధీ భవన్ చేరుకున్న ఖర్గే.. ఇందిరా భవన్లో పీసీసీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.




