తెలంగాణ అభివృద్ధి చెందిందంటూ డబ్బా
సిఎం కెసిఆర్ తీరుపై మండిపడ్డ టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్
నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ముఖ్యమంత్రి కెసిఆర్ దేశమంతా తిరుగుతూ..సమస్తం తామే బాగున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. తెలంగాణ అంతా పచ్చబడ్డదని, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…బడ్జెట్‌లో అత్యంత కీలకమైన విద్య, వైద్యంపై ఎప్పుడూ తెలంగాణా సర్కారుది శీతకన్నే అన్నారు. విద్యపై బడ్జెట్‌ను అన్ని రాష్ట్రాలు 15 శాతం కేటాయిస్తే తెలంగాణ సర్కారు మాత్రం ఏడున్నర శాతం కేటాయిస్తుందన్నారు.
వైద్యంలోనూ అదే పరిస్థితి ఉందని తెలిపారు. విద్యకు సంబంధించి ట్రీపుల్ ఐటీయే అందుకు ఓ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వైద్యానికి సంబంధించి ఇబ్రహీమ్‌పట్నంలో జరిగిన కు.ని ఆపరేషన్ల తీరే మరో ఉదాహరణ అని అన్నారు. ఒక ఆపరేషన్ వికటించిందంటే అర్థం చేసుకోవచ్చు…కానీ నలుగురు కు.ని ఆపరేషన్ల ద్వారా చనిపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికీ వాళ్లలో చాలామంది ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.



