దీపం పరబ్రహ్మ స్వరూపం!

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. దీపం పరబ్రహ్మ స్వరూపం.  పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది..   అపురూపమైన దీపాల పండుగ దీపావళి. కార్తీకమాసం అమావాస్యనాడు దీపావళి పర్వదినం. దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకుంటారు. ఆనక దీపాలను తులస ికోట వద్ద, వాకిట్లో ఉంచుతారు. ఈ పర్యాయం మనం ఈ నెల 12, ఆదివారం దివ్య దీపావళి జరుపుకుంటున్నాం.

వామనుడు బలి చక్రవర్తిని బంధించి పాతాళానికి  పంపింది ఈ రోజే! రావణుని పరిమార్చి రాముడర్ధాంగితో బయలుదేరిందీ ఈ రోజే!క్రూరుడైన నరకాసురుని సత్యభామ కృష్ణుని వెంట వెళ్లి వధించిందీ ఈ రోజే! విక్రమార్కుడు శత్రు పరాజితులుచేసి తన పేర శకము నిల్పినదీ ఈ రోజే! శ్రీమహావీరజినుడు అహింసా మహస్సు దశదిసెల ప్రసరింప సిద్ధి పొందిందీ ఈ రోజే!  చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడిరది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. ఈ పండుగను అయిదు రోజులపాటు పాటిస్తారు.

దీపావళి నాడు కుటుంబసభ్యులందరూ తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. ఇళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు. మావిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. నైవేద్యానికి ప్రసాదాలను, పిండివంటలను సిద్ధం చేసుకుంటారు. ఆనక లక్ష్మీదేవి పూజకు సంసిద్ధమౌతారు. దక్షిణ భారతంలో మాత్రం నరక చతుర్దశి, దీపావళి, పాడ్యమి మూడు రోజులు పండగజరుపుకునే ఆచారం ఉంది. కర్ణాటక మహారాష్ట్రలలో, కార్తికమాసం మొదటి రోజు పాడ్యమిన పశువులకు అలంకారం చేసి పూజించే సాంప్రదాయం ఉంది.. దీనిని బలిపాడ్యమి అని వ్యవహరిస్తారు. తరువాతి రోజు విదియన యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్లి ఆతిధ్యం స్వీకరించి ఆమెను ఆశిర్వదించాడని నమ్మకం. ఆరోజున సోదరులు అక్క చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి ఆశీర్వదించి బహుమతులు ఇవ్వడం ఒక ఆచారం.

దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి.  టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.  మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. దీపావళితో మొదలుపెట్టి, మాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.

సాయంకాలం, ప్రదోష సమయాన, దక్షిణదిక్కుగా తిరిగి దీపం వెలిగించి, పెద్దలకు నమస్కారం చేయాలి. ఇది వారికి ముక్తి మార్గం చూపుతుందని భావిస్తారు. దీనినే ఉల్కాదానమంటారు. దీపావళి నాటి సాయంత్రం ఇది ముందుగా చేయాలి. పంచ భూతాలలో అగ్ని ప్రధానమయింది. అగ్నిలో తేజస్సు, ఆహారం, విద్యా నిండి ఉంటాయి. అందుకే అగ్ని హోత్రానికి మన సంప్రదాయంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.  దీపంలో నీలం, పసుపు, తెలుపు మూడు రంగులు కలిసి ఉంటాయి. ఇవి సత్య, తమో, రజో గుణాలకు సంకేతాలు. లక్ష్మి, సరస్వతి, దుర్గలకు ప్రతీకలు. ఈ దీపాన్ని ఆరాధించడమంటే త్రిజగన్మాతలను ఆరాధించడమే.

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం
శత్రు వృద్ది వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పర బ్రహ్మ దీపంజ్యోతి జనార్దనః
దీపోహారతి పాపాని సంద్యా దీపం నమోస్తుతే!
సకల కళ్యాణ ప్రదం, ఆరోగ్యం, ధనం, శత్రువులపై విజయం ప్రసాదించే దీపానికి నమస్కరిస్తున్నాను. ఈ దీపం, పర బ్రహ్మ మహావిష్ణు స్వరూపం, సకల పాపములు హరించే సంద్యా దీపానికి నమస్కారం అని ఈ శ్లోకంద్వారా దీప ప్రాశాస్త్యం చెబుతున్నారు. చనిపోయిన పితృదేవతలకు అమావాస్య నాడు తర్పణం విడిచే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తారు. అందరి జీవితాల్లో వెలుగులు చిందాలని అభిలషిద్దాం!
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌ 98481 28215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *