వారం రోజుల ఇడి కస్టడీకి అనుమతి
పదిరోజుల కస్టడీ కోరిన ఇడి అధికారులు
న్యూదిల్ల్లీ,మార్చి16 : దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది. ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొంటున్నారు. దీని విూద చాలా కాలంగా ఈడీ విచారణ జరుపుతూ ఉంది. ఈ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా.. 7 రోజుల పాటు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే.. వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది. కాగా.. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఐటీ, ఈడీ జాయింట్ సోదాలు నిర్వహించిన అనంతరం.. కవితను అరెస్ట్ చేసి దిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పైవిధంగా కోర్టు తీర్పును వెలువరించింది. ఇదిలా ఉంటే.. తనపై చర్యలు తీసుకో వద్దన్న కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం నాడు విచారణకు రానుంది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఇప్పటికే పలుమార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ కస్టడీలో ఏమేం అడగబోతున్నారు..? ఎలాంటి సమాచారం రాబడుతారు..? అని బీఆర్ఎస్లో ఒకింత టెన్షన్ మొదలైంది. కస్టడీ తర్వాత ఏం జరగ బోతోంది..? అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కవిత సోదరుడు కేటీఆర్ దిల్లీ లోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి.. దీనిపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
న్యాయపరంగా పోరాడుతామని వెల్లడి
దిల్ల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢల్లీిలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె విూడియాతో అన్నారు.మరోవైపు కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపించనుండగా.. ఈడీ తరపున స్పెషల్ పీపీ ఎస్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించనున్నారు. ఇక కవితకు మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కోర్టుకు వచ్చారు.




